logo

పరికరాలు గోవిందా..!

తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కర్షకులను ఆదుకున్న పరికరాల లెక్కతేలింది. చేతికొచ్చే వేరుసెనగ పంటను కాపాడుకునేం దుకు గత ప్రభుత్వం జలఫిరంగులు అందుబాటులోకి తెచ్చింది. కోట్ల విలువైన పరికరాల్లో కొన్ని రైతుల వద్ధ. మరికొన్ని గోదాముల్లోనే మూలన పడవేయడంతో అవి తుప్పు

Published : 20 Jan 2022 05:26 IST

G గోదాముల్లో తుప్పు పట్టినవే సగం

G రూ.కోట్ల నిధులు ప్రశ్నార్థకం

G దుస్థితిలో జల ఫిరంగులు


పరికరాల వివరాలు సేకరిస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, చిత్తూరు(వ్యవసాయం) తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కర్షకులను ఆదుకున్న పరికరాల లెక్కతేలింది. చేతికొచ్చే వేరుసెనగ పంటను కాపాడుకునేం దుకు గత ప్రభుత్వం జలఫిరంగులు అందుబాటులోకి తెచ్చింది. కోట్ల విలువైన పరికరాల్లో కొన్ని రైతుల వద్ధ. మరికొన్ని గోదాముల్లోనే మూలన పడవేయడంతో అవి తుప్పు పట్టిపోయాయి. మూలనపడిన జలఫిరంగులను వాడుకలోకి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. ప్రతి గోదాముకు వెళ్లండి.. ఏవి పనిచేస్తున్నాయో.. ఏవి చేయడం లేదో.. ఒకసారి పరిశీలించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణకుమార్‌ జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. దీంతో 11 వ్యవసాయ శాఖ సబ్‌డివిజన్లలో గోదాముల్లోని పరికరాలను ఏవోలు, ఏడీలు పరిశీలించి లెక్క తేల్చారు. పరికరాల వారీగా పనిచేస్తున్నవి, మరమ్మతుకు గురైనవి, పూర్తిగా పనికిరాకుండా పోయినవాటి వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు.

రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు..

జిల్లాలో 2015లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాధార పంట వేరుసెనగ ఎండుముఖం పట్టింది. బిందు, తుంపర్ల పద్ధతిలో నీరు అందించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కరవు నివారణ పథకం కింద రూ.కోట్లు వెచ్చించి.. 999 జలఫిరంగులు(రెయిన్‌గన్లు), 999 స్ప్రిక్లర్లు, 24,500 నీటి సరఫరా పైపులు, అయిల్‌ ఇంజిన్లు 247 కొనుగోలు చేసి అందజేశారు. అప్పట్లో వాటిని విరివిగా వినియోగించారు. తద్వారా ఎన్నో పంటలకు ఊపిరిలూది నట్లయింది. ఆపై వాటిని మూలనపడేశారు. కొన్నిచోట్ల పలుకుబడి ఉన్న నాయకులు వాటిని దర్జాగా తమ నివాసాల్లో దాచేశారు.

మూటగట్టి పడవేయడంతో..

కరవు నివారణ పథకం కింద కొనుగోలు చేసిన పరికరాలకు 2017లో జియో ట్యాగింగ్‌ చేశారు. 60శాతం పరికరాలు రైతుల వద్దే ఉన్నాయి. మిగిలినవి రైతుల నుంచి సేకరించి గోదాముల్లో ఉంచారు. ఇష్టానుసారంగా మూటగట్టి పడవేయడంతో అధిక శాతం తుప్పుపట్టి పనికిరాకుండాపోయాయి. ఉన్నతాధికారులు మేల్కోవడంతో ఎట్టకేలకు పరికరాల లెక్క తేలింది. ‘గోదాముల్లో నిల్వ చేసిన పరికరాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతులకు అందజేస్తాం. మరమ్మతుకు గురైనవాటిని బాగుచేయించడానికి చర్యలు తీసుకుంటాం’ అని జేడీఏ దొరసాని తెలిపారు.

గోదాముల్లో మూలపడేసిన పరికరాల వివరాలిలా..

పరికరం నిల్వచేసినవి బాగున్నవి మరమ్మతులు దెబ్బతిన్నవి

రెయిన్‌గన్లు333 205 48 80

స్ప్రింకర్లు213 85 40 88

పైపులు15,745 10,048 858 4839

అయిల్‌ఇంజన్లు251 70 139 42

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని