logo

ఉప్పెనలా ఎగసి.. ఉద్యమమై నిలిచి..

చిత్తూరు (విద్య, కలెక్టరేట్, నేరవార్తలు): కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు గురువారం ఉదయమే కుప్పం నుంచి సత్యవేడు వరకు ఉన్న సగం మంది ఉపాధ్యాయులు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో  చిత్తూరు పయనమయ్యారు. వీరిని నిలువరించేందుకు

Updated : 21 Jan 2022 05:54 IST

కలెక్టరేట్‌ను ముట్టడించిన ఉద్యోగ, ఉపాధ్యాయులు 

బడుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పే మమ్మల్ని.. బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నారు.. హక్కుల కోసం శాంతియుతంగా ఉద్యమించడానికి కలెక్టరేట్‌కు వస్తుంటే.. అడుగడుగునా పోలీసులతో ఆటంకాలు కల్పించారు.. అర్ధరాత్రి తీసుకొచ్చిన అశాస్త్రీయ పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా మండుటెండలో పోరాటం చేసే స్థితికి తెచ్చిన ప్రభుత్వానికి భవిష్యత్తులో కచ్చితంగా గుణపాఠం చెబుతాం’ అంటూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలెక్టరేట్‌ ఎదుట నినదించారు. పోలీసు నిర్బంధాలను ఎక్కడికక్కడ ఛేదించుకుని.. చిత్తూరుకు కదిలివచ్చిన ఉపాధ్యాయులను అడ్డుకోవాలన్న యత్నా లు విఫలమయ్యాయి.. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ గురువారం ఫ్యాప్టో చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చారు. మహిళా ఉపాధ్యాయులు సైతం వ΄డు గంటలపాటు జాతీయ రహదారిపై నిలబడి.. చీకటి జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 
ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్‌టుడే, చిత్తూరు (విద్య, కలెక్టరేట్, నేరవార్తలు): కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు గురువారం ఉదయమే కుప్పం నుంచి సత్యవేడు వరకు ఉన్న సగం మంది ఉపాధ్యాయులు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో  చిత్తూరు పయనమయ్యారు. వీరిని నిలువరించేందుకు బుధవారం సాయంత్రం నుంచే పోలీసులు సంసిద్ధులయ్యారు. ప్రధాన నాయకులను ముందుగానే గృహ నిర్బంధంలో ఉంచారు. మదనపల్లె, పీలేరు, పుంగనూరు, బంగారుపాళ్యం, పూతలపట్టు, వి.కోట తదితర మండలాల్లో పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. దీనికితోడు జిల్లావ్యాప్తంగా ఉన్న రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి.. గురువారం వేకువజాము నుంచే తనిఖీలు ప్రారంభించారు. పీలేరు, కల్లూరు, దామలచెరువు, పూతలపట్టు, ముత్తిరేవుల, ఇరువారం, బంగారుపాళ్యం, పలమనేరు, వి.కోట, శాంతిపురం, గంగాధరనెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, కార్వేటినగరం, పుత్తూరు తదితర ప్రాంతాల్లో ఒక్కో వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశారు. దీంతో కొందరు వాహనాలు దిగి.. తమిళనాడు, కాణిపాకం తదితర ప్రాంతాలకు వెళ్తున్నామంటూ చెప్పారు. కలెక్టరేట్‌ వద్ద ఉదయాన్నే అల్పాహారం తింటున్న ఉపాధ్యాయులు కొందరిని.. వ్యాన్‌లో పోలీస్‌ శిక్షణ కేంద్రానికి తరలించారు. టోల్‌ప్లాజాల వద్ద  ఆర్టీసీ బస్సుల్లో ఉన్న ప్రయాణికులను సైతం ఆరా తీశారు. ప్రయాణికులైతేనే వెళ్లండి.. ఉపాధ్యాయులైతే వెనక్కు మళ్లండని పోలీసులు తెలిపారని ఎస్టీయూ  రాష్ట్ర నాయకుడు అమరనాథ్‌ పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కలెక్టరేట్‌కు సమీపంలోని విజయ డెయిరీ వద్దకు ఉదయం 10 గంటలకు ఉపాధ్యాయులు తరలివచ్చారు.. వారిని అటు నుంచి అటే వాహనాల్లో వెనక్కు పంపాలని పోలీసులు భావించినా.. ఉపాధ్యాయులు రెట్టించిన ఉత్సాహంతో కలెక్టరేట్‌ వైపు కదిలారు.. ఒకానొక దశలో వారిని ఆపడం పోలీసులకు కష్టతరమైంది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులు ముందుకు రాకుండా.. పోలీసులు నెట్టారు. మొత్తం వ΄డు అంచెల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు, వాటి వెంట ఉన్న పోలీసులను తోసుకుంటూ కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని.. పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కలెక్టరేట్‌ వద్ద పీఆర్సీ కోసం ధర్నా చేస్తున్న పుత్తూరు ఉపాధ్యాయులు

అడ్డుకుంటున్న పోలీసులను ఛేదించుకుని కలెక్టరేట్‌లోకి వెళ్తున్న ఉపాధ్యాయులు 
 మదనపల్లె పోలీసులు 45 మంది  ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకొని.. సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ను స్టేషన్‌లో ఉంచారు. పుంగనూరు, పూతలపట్టు స్టేషన్లకు సైతం కొందరిని తరలించారు. ః చిత్తూరులో స్కూల్‌ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరోత్తమరెడ్డితోపాటు ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెంగల్రాయ మందడి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని.. స్టేషన్లకు తరలించారు. ః శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు స్టేషన్‌లో పలువురిని ఉపాధ్యాయులను ఉంచారు. ః  ఉద్యమానికి సంఘీభావంగా ఎస్టీయూ రాష్ట్ర నాయకులు గంటా మోహన్‌.. హోం ఐసోలేషన్‌లోనే దీక్ష చేశారు.  చిత్తూరు వస్తున్న పలువురు తితిదే ఉద్యోగ సంఘాల నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరిని తితిదే పరిపాలన భవనం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ః మాదిగ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు మిరియాల సుబ్బరాజు, ఆయన భార్య కవితను యర్రావారిపాళెం మండలంలో గృహ   నిర్బంధంలో ఉంచారు.


పోలీసులు తాడు అడ్డుగా ఉంచినా తప్పించుకొని ముందుకు సాగుతున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు

మూ΄డు గంటలు మండుటెండలో..
పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని.. ఉదయం 10.30 గంటల సమయంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. పోలీసులు పక్కనే ఉన్న మరో మార్గంలో వాహనాలు వెళ్లే ఏర్పాటు చేశారు. కొంతసేపు తర్వాత ఉపాధ్యాయులు అక్కడ బైఠాయించారు. రివర్స్‌ పీఆర్సీ ఇచ్చిన.. సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినదించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే.. ఇంతలా ముఖ్యమంత్రి మోసం చేస్తాడనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. ఎన్నికల్లో తగిన వ΄ల్యం తప్పదని హెచ్చరించారు. వ΄డు గంటలపాటు ఉపాధ్యాయులు మండుటెండలో ఉండి ఆందోళన చేశారు. ఫ్యాప్టో నాయకులు దండు అమరనాథ్, కడియాల మురళి, యువశ్రీ మురళి, దక్షిణావ΄ర్తి, రమేష్‌ నాయుడు, రాధాకృష్ణ, పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎంఆర్‌ ప్రభాకర్, చెంచురత్నం, ఎన్జీవోల సంఘం జిల్లా కోశాధికారి మురళీమోహన్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, పెన్షనర్లు, పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.  కలెక్టరేట్‌ ముట్టడిలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా 8 వేల మంది టీచర్లు గురువారం సెలవు పెట్టారు. జిల్లాలో 16,772 మంది ఉపాధ్యాయులుండగా సెలవు పెట్టిన ఉపాధ్యాయుల వివరాలను పోలీసులు సేకరించారని సమాచారం.


చిత్తూరులో తితిదే ఉద్యోగులను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు

మెరుగైన పీఆర్సీ ఇవ్వాలి  
కొత్తగా ఇచ్చిన జీవోలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసి.. మెరుగైన పీఆర్సీ ఇవ్వాలి. హెచ్‌ఆర్‌ఏ విషయాన్ని పునరాలోచించాలి. చరిత్రలో ఇటువంటి జీవోలను చూడలేదు.  - శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ
 ఇచ్చిన హామీలనే అమలు చేయాలంటున్నాం
ప్రభుత్వం అర్ధరాత్రి ఇచ్చిన ఉత్తర్వులు.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం కలిగిస్తున్నాయి. గతంలో మీరు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని సీఎంను కోరుతున్నాం. - యువశ్రీ మురళి, బీఎన్‌ కండ్రిగ

ఉపాధ్యాయులు, ఉద్యోగులతో కలిసి నినాదాలు చేస్తున్న ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి

అక్రమ అరెస్టులు తగవు
తిరుపతి(తితిదే): నిరసన తెలిపేందుకు వెళ్తున్న తితిదే ఉద్యోగుల అక్రమ అరెస్టులు, నిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. వెంటనే మెరుగైన పీఆర్‌సీ ఇచ్చి.. సీపీఎస్‌ రద్దు చేయాలి. 
- చీర్ల కిరణ్, అధ్యక్షుడు, తితిదే ఉద్యోగుల సంక్షేమ సంఘం 


 ముట్టడికి అనుమతివ్వాలని పోలీసు అధికారిని ప్రాధేయపడుతున్న ఎస్టీయూ  నాయకుడు అమరనాథ్‌

కొత్త పీఆర్‌సీ రద్దుకు డిమాండ్‌
పీలేరు గ్రామీణ: పీఆర్‌సీ ఉత్తర్వులపై ఉపాధ్యాయ, ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆక్రోశంతో ఉన్నారు. ప్రభుత్వ సీఎస్‌ కమిటీల పీఆర్‌సీ సిఫార్సులను వెంటనే నిలుపుదల చేసి, అశుతోష్‌ మిశ్రా పీఆర్‌సీ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి. హెచ్‌ఆర్‌ఏలను పాత స్లాబ్‌ విధానంలో కొనసాగించాలి.  - అక్రంబాషా, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి, పీలేరు
అరెస్టులతో పోరాటాలు ఆగవు
 పీఆర్సీ ఉత్తర్వులో ఐఆర్‌ 4 శాతం వరకు తగ్గిపోవడం, పాత హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌ కొనసాగించకపోవడం, సీసీఏ, సీపీఎస్‌ రద్దు చేయకపోవడం, పెన్షనర్లకు అదనపు క్వాంటం పరిష్కారం కాకపోవడం వంటి సమస్యలు యథావిధిగా ఉన్నాయి. వీటిని సాధించేందుకు చేసే పోరాటాలు అరెస్టులతో ఆగవు.  - జగన్‌మోహన్‌రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు, పీలేరు

మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని పాదరక్షతో కొట్టుకుంటున్న ఉపాధ్యాయుడు

ఫిట్‌మెంట్‌ తక్కువ ఇచ్చిన ప్రభుత్వమిద
ఏ ప్రభుత్వమైనా ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ ఎక్కువ ఇస్తుంది. 27 శాతం ఐఆర్‌ కన్నా నాలుగు శాతం తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. పింఛనుదారులకు ఇచ్చే సొమ్ములోనూ కోత విధిస్తున్నారు. - రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్‌ 


తిరుపతి గ్రామీణ మండలం చిగురువాడలో నినాదాలు చేస్తున్న తిరుపతి, పుత్తూరు డివిజన్ల ప్రధానోపాధ్యాయులు

 ఐసీడీఎస్‌ ఉద్యోగుల నిరసన
చిత్తూరు(జిల్లా పంచాయతీ): పీఆర్‌సీని వ్యతిరేకిస్తూ స్త్రీ శిశు సంక్షేమశాఖ ఉద్యోగులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో ఆ శాఖ జిల్లా కార్యాలయం ఎదుట ఐసీడీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజరత్నం ఆధ్వర్యంలో పీఆర్‌సీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. సీపీఎస్‌ రద్దు చేయాలని కోరితే ఉన్న సీసీఏను  రద్దు చేశారని, చరిత్రలో ఎన్నడూ ఉద్యోగులు ప్రభుత్వానికి మళ్లీ అరియర్సు చెల్లించిన దాఖలాలు లేవన్నారు. 
కళ్లు గప్పి.. గళం విప్పి

చిత్తూరు: కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో పాల్గొన్న  శ్రీకాళహస్తి ఫ్యాప్టో నేతలు 

ముందస్తు అరెస్టులను గమనించిన ఫ్యాప్టో నేతలు ఎంతో చాకచక్యంతో పోలీసుల కళ్లుగప్పి జిల్లా కేంద్రం కలెక్టరేట్‌ వద్ద జరిగిన ముట్టడి కార్యక్రమానికి హాజరయ్యారు. పంచలు కట్టుకుని, నుదుట విది రాసుకుని భక్తుల్లా.. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సుల్లో ఉద్యమనేతలు జిల్లా కేంద్రం చిత్తూరు చేరుకున్నారు.  - న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు