logo

గోదాములోనే నియంత్రికలు

జిల్లాలో విద్యుత్తు నియంత్రికల(ట్రాన్స్‌ఫార్మర్లు)కు అనుబంధ(మ్యాచింగ్‌) పరికరాల కొరత నెలకొంది.. ఆయా పరికరాల సరఫరాలో తీవ్ర జాప్యంతో చిత్తూరులోని విద్యుత్తు శాఖ పరికరాల జిల్లా గోదాము (నిల్వ కేంద్రం)లో 25 హెచ్‌పీ నియంత్రికలు సుమారు ఐదు వేలు అలాగే ఉండిపోయాయి..

Published : 22 Jan 2022 05:59 IST

అనుబంధ పరికరాలొస్తేనే కదలిక

అన్నదాతలకు తప్పని నిరీక్షణ

న్యూస్‌టుడే, చిత్తూరు (మిట్టూరు): జిల్లాలో విద్యుత్తు నియంత్రికల(ట్రాన్స్‌ఫార్మర్లు)కు అనుబంధ(మ్యాచింగ్‌) పరికరాల కొరత నెలకొంది.. ఆయా పరికరాల సరఫరాలో తీవ్ర జాప్యంతో చిత్తూరులోని విద్యుత్తు శాఖ పరికరాల జిల్లా గోదాము (నిల్వ కేంద్రం)లో 25 హెచ్‌పీ నియంత్రికలు సుమారు ఐదు వేలు అలాగే ఉండిపోయాయి.. అనుబంధ పరికరాల సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది.. కొత్త కనెక్షన్లు మంజూరు చేయండి మహాప్రభో అంటూ విద్యుత్తుశాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం లేదు.

వ్యవసాయ సర్వీసులకు కొత్తగా నియంత్రికలు అమర్చాలంటే 50-80 రకాల అనుబంధ పరికరాలు అవసరమవుతాయి. ఇవి లేకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కనీసం ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేసి రైతులకు కాసింత ఊరట కల్పించాలనుకున్నా సాంకేతిక నిబంధనలు అడ్డంకిగా మారాయి. గోదాము నుంచి వీటిని అందజేయాలంటే 80 శాతం అనుబంధ పరికరాలు తప్పనిసరి. అవి ఇచ్చాక ఆయా వివరాలు అంతర్జాలంలో నమోదు చేయాలి. లేనిపక్షంలో ఒక్క పరికరం కూడా బయటకు ఇచ్చే పరిస్థితి ఉండదు. దీంతో అందుబాటులో ఉన్న అనుబంధ పరికరాలతో కేవలం కొన్ని నియంత్రికలనే డివిజన్ల వారీగా సరఫరా చేస్తున్నారు.

అధికారుల అలసత్వంతో..

జిల్లాలో ఎలాంటి సాగునీటి వనరులు లేవు. ఖరీఫ్‌, రబీ సీజన్లలో పంటల సాగుకు జిల్లాలోని రైతులకు అందుబాటులో ఉన్న బోరు బావులే ఆధారం. విద్యుత్తు అధికారుల అలసత్వంతో దరఖాస్తు చేసుకున్న కర్షకులకు ఆరు నెలల నుంచి ఏడాది గడిచినా నేటికీ సంబంధిత కనెక్షన్‌ ఇవ్వనేలేదు. సాగుకు బోర్లలో నీరున్నా పంటలు వేయలేయని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని సరఫరా చేస్తున్న గుత్తేదారుకు విద్యుత్తు శాఖ చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోవడం వల్లే పరికరాల సరఫరా ఆగిపోయిందని అధికారులే చెబుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం.. నియంత్రికల అనుబంధ పరికరాల సరఫరాకు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. అవి త్వరలో జిల్లాకు చేరనున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనుబంధ పరికరాలతో డివిజన్ల వారీగా నియంత్రికలు అందజేస్తున్నాం. - చలపతి, ఎస్‌ఈ, విద్యుత్తు శాఖ

జిల్లాలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు - 2.93 లక్షలు

పెండింగ్‌ దరఖాస్తులు 10 - 11 వేలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని