logo

కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లోఆకలి కేకలు

కొవిడ్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో తిరిగి నియోజకవర్గానికో కొవిడ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పీలేరు, శ్రీకాళహస్తితోపాటు మరో మూడు కేంద్రాలను ప్రారంభించగా.. మరో 12 కేంద్రాలను త్వరలోనే బాధితులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కేంద్రాలకు ఇన్‌ఛార్జుల

Published : 22 Jan 2022 05:59 IST

ఆహారం సక్రమంగా లేదంటూ నిరసన

గతేడాది భోజన బకాయిలు రూ.5 కోట్లకుపైనే


విష్ణు నివాసం వద్ద ఆందోళన చేస్తున్న కొవిడ్‌ బాధితులు

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు, తిరుపతి వైద్య విభాగం : కొవిడ్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో తిరిగి నియోజకవర్గానికో కొవిడ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పీలేరు, శ్రీకాళహస్తితోపాటు మరో మూడు కేంద్రాలను ప్రారంభించగా.. మరో 12 కేంద్రాలను త్వరలోనే బాధితులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కేంద్రాలకు ఇన్‌ఛార్జులను సైతం నియమించారు. అక్కడ వసతుల కల్పన, బాధితుల బాగోగులను పర్యవేక్షించే బాధ్యతను వీరు నిర్వర్తించనున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. బాధితులకు ఇచ్చే ఆహారం విషయంలో అడపాదడపా విమర్శలు వస్తున్నాయి. గతేడాది భోజనాలు సరఫరా చేసిన వ్యక్తులకు బిల్లులు చెల్లించకపోవడంతో.. ఈదఫా వారు ముందుకు రావడానికి ఆసక్తి చూపడం లేదు.

కొవిడ్‌ బాధితులు నాణ్యమైన భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. పురుగులు పట్టిన అన్నం.. నాణ్యతలేని చపాతి, సాంబారు అందిస్తున్నారంటూ తిరుపతి విష్ణు నివాసంలోని బాధితులు ఇటీవల కాలంలో పలుమార్లు ఆందోళనకు దిగారు. మిగిలిన ఆస్పత్రులు, కేంద్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. పర్యవేక్షిస్తున్న అధికారులు స్పందించడం లేదు. ఆందోళనకు కారణాలు విశ్లేషిస్తే.. కొన్ని నెలలుగా ఆహార సరఫరాదారులకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకపోవడమేనని తెలిసింది.

అప్పటి బిల్లులు చెల్లిస్తేనే..

గతేడాది బిల్లులే ఇప్పటివరకూ చెల్లించకపోవడంతో.. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో ఆహారం అందించడానికి కొందరు ముందుకు రావడంలేదు. ప్రస్తుతం తిరుపతిలో పర్యాటక శాఖ ద్వారా భోజనాలు అందిస్తుండగా, మరికొన్నిచోట్ల స్థానిక హోటళ్ల నిర్వాహకులతో మాట్లాడి అక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు. దీంతో నాణ్యత దెబ్బతిందనే విమర్శలు వస్తున్నాయి. ఈవిషయమై జేసీ (అభివృద్ధి) శ్రీధర్‌ స్పందిస్తూ.. ఇప్పటికే బిల్లులను అప్‌లోడ్‌ చేశామని, మరో అయిదారు రోజుల్లో బకాయిలు విడుదలవుతాయని పేర్కొన్నారు.

పద్మావతి నిలయంలోనే రూ.2 కోట్లకుపైగా

జిల్లాలో అత్యధికంగా తిరుపతిలోని కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో బాధితులను ఉంచారు. దీనికితోడు నియోజకవర్గానికో కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిలో మెనూ రూపొందించి.. ఆమేరకు అల్పాహారం, భోజనాలు అందించారు. ఆహారం సరఫరా చేసే బాధ్యతను కొందరు హోటళ్ల నిర్వాహకులు, అప్పటికే ఆసుపత్రుల్లో ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి అప్పగించారు. తిరుపతిలో రోజు మార్చి రోజు రోజు బిల్లులు చెల్లిస్తామని అప్పట్లో అధికారులు తెలిపారు. ప్రారంభంలో ఒక్కో బాధితుడికి రోజుకు రూ.500 చొప్పున బిల్లు ఇస్తామని పేర్కొనగా.. ఆ తర్వాత ప్రభుత్వం మరో ధరను నిర్ణయించింది. ఈమేరకు తిరుపతిలోని ఒక్క పద్మావతి నిలయంలో భోజనాలు అందించిన వ్యక్తికే రూ.2 కోట్లకుపైగా బిల్లులు రావాల్సి ఉంది. విష్ణు నివాసం రూ.1.25 కోట్లు, పీలేరు రూ.28 లక్షలు, పలమనేరు రూ.13 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇలా జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో కలిపి సుమారు రూ.5 కోట్లకుపైగానే బిల్లులు రావాల్సి ఉందని తెలుస్తోంది.

జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు 15

మొత్తం పడకలు 3,444

ప్రస్తుతం ప్రారంభమైనవి 15 

చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 594

జిల్లా వ్యాప్తంగా గతేడాది భోజన బకాయిలు రూ.5 కోట్లకుపైగా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని