logo

వనిత..చేయూత

స్త్రీలను సాహస గుణం మెండు. ప్రోత్సహిస్తే.. ఏ రంగంలోనైనా రాణించగలరు. పోటీ ప్రపంచంలో ఆర్థిక ప్రగతిని సాధించాలన్న తపన వారిలో పెరుగుతోంది. ఈ క్రమంలోనే స్వయం ఉపాధి వైపు పరుగులు తీస్తున్నారు. విభిన్న రంగాల్లో ప్రవేశించి.. విజయాలు సాధిస్తున్నారు. ఇలాంటి ఆలోచనా ధోరణిలో

Published : 22 Jan 2022 05:59 IST

ఎస్వీయూలో మహిళల అభ్యున్నతికి కృషి

లింగ నిష్పత్తిపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న మహిళా

అధ్యయన కేంద్రం అధికారులు (దాచిన చిత్రం)

స్త్రీలను సాహస గుణం మెండు. ప్రోత్సహిస్తే.. ఏ రంగంలోనైనా రాణించగలరు. పోటీ ప్రపంచంలో ఆర్థిక ప్రగతిని సాధించాలన్న తపన వారిలో పెరుగుతోంది. ఈ క్రమంలోనే స్వయం ఉపాధి వైపు పరుగులు తీస్తున్నారు. విభిన్న రంగాల్లో ప్రవేశించి.. విజయాలు సాధిస్తున్నారు. ఇలాంటి ఆలోచనా ధోరణిలో ఉన్న మహిళలకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రం. -న్యూస్‌టుడే, తిరుపతి(ఎస్వీయూ)

ఎస్వీయూలో 2007లో మహిళా అధ్యయన కేంద్రం ప్రారంభమైంది. 2009లో కేంద్రానికి యూజీసీ గుర్తింపు లభించింది. కేవలం పీజీ కోర్సును నడపడమే కాకుండా, సమాజంలో మహిళల ప్రగతికి నడుం బిగించాలన్నది కేంద్రం ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం విభాగంలో పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు 50 మంది ఉన్నారు. విద్యార్జనతో పాటుగా ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ చేయాల్సి ఉంటుంది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఇప్పటివరకు కేంద్రం ఆధ్వర్యంలో 50 ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు విభిన్న అంశాలపై ఇక్కడి విద్యార్థులు అవగాహన కల్పించారు. వీటితో పాటుగా అవగాహన ర్యాలీలు, కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు గత పదేళ్లలో ఏడాదికి 15 చొప్పున దాదాపు 150కి పైగా కార్యక్రమాలు నిర్వహించి మహిళల ప్రగతికి కృషిచేశారు.

సమాజాభివృద్ధిలో..

సమాజాభివృద్ధిలో స్త్రీల పాత్ర ఎంతో కీలకమన్నదే.. ఉమెన్‌ స్టడీస్‌ కోర్సు సిలబస్‌ సమగ్ర సారాంశం. లింగ సమానత్వం, లింగ నిష్పత్తి, మహిళా చట్టాలు, హక్కులు.. తదితర అంశాలపై కేంద్రం విద్యార్థులు విద్యార్జన చేస్తూ ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాల ద్వారా సంబంధిత అంశాల్లో మహిళలకు ప్రత్యక్ష అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా సమాజంలో అంటువ్యాధులను అరికట్టడంలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి. పిల్లలు, కుటుంబాన్ని అంటువ్యాధుల బారిన పడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను విద్యార్థులు తెలియజేస్తున్నారు. దాడులను ఎదుర్కోవడానికి మహిళలకు ఉన్న న్యాయపరమైన హక్కులను, చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నారు.

20 ప్రాజెక్టుల మంజూరు

గ్రామాల్లో పొదుపు మహిళా సంఘాలను సైతం కేంద్రం విద్యార్థులు కలుస్తూ ఆర్థిక క్రమశిక్షణ, నగదును పొదుపు చేసుకునే విధానంపైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పదేళ్లుగా ఆయా అవగాహన కార్యక్రమాల్లో ఐదువేల మంది మహిళలు పాల్గొన్నట్లు కేంద్రం అధ్యాపకులు పేర్కొంటున్నారు. సమాజాన్ని చైతన్య పరుస్తూ ముందుకెళ్తున్న ఈ విభాగానికి యూజీసీ ఇప్పటివరకు 20 ప్రాజెక్టులను మంజూరు చేసింది. వీటిని నిర్వహించిన కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య కృష్ణమూర్తి, అధ్యాపకులు రమణ, రాజరాజేశ్వరి, శ్రీలతకిషోరి, సునీత, జగదీశ్వరి క్షేత్రస్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను నివేదికల ద్వారా యూజీసీకి తెలియజేశారు.

క్షేత్రస్థాయిలో శిక్షణమహిళల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన అన్ని కార్యక్రమాలు ఉమెన్‌ స్టడీస్‌ ద్వారా చేపట్టాం. మేం నిర్వహించిన కార్యక్రమాలకు పెద్దసంఖ్యలో మహిళలు విచ్చేసి అవగాహన పొందారు. ఎక్కువగా ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు చేపట్టి క్షేత్రస్థాయిలో మహిళల ప్రగతికి కృషిచేస్తున్నాం. -ఆచార్య కృష్ణమూర్తి, డైరెక్టర్‌, మహిళా అధ్యయన కేంద్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని