logo

ఉరకలేసేఉత్సాహం

ఉరకలు వేసే ఉత్సాహం వారి సొంతం. రోజువారి వ్యాయామం వారి దినచర్యలో భాగం. ఎనిమిది పదుల వయసులోనూ.. అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నారు.. జిల్లాకు చెందిన మాస్టర్‌ అథ్లెట్లు. పరుగుపందెం, హైజంప్‌, లాంగ్‌జంప్‌, డిస్కస్‌త్రో, జావెలిన్‌ త్రో ఈవెంట్లలో రాణిస్తూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు. త్వరలో జరగనున్న

Published : 24 Jan 2022 05:01 IST

ఎనిమిది పదుల వయసులోనూ రాణిస్తున్న అథ్లెట్లు


గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతి అందుకున్న మాస్టర్‌ అథ్లెట్లు

ఉరకలు వేసే ఉత్సాహం వారి సొంతం. రోజువారి వ్యాయామం వారి దినచర్యలో భాగం. ఎనిమిది పదుల వయసులోనూ.. అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నారు.. జిల్లాకు చెందిన మాస్టర్‌ అథ్లెట్లు. పరుగుపందెం, హైజంప్‌, లాంగ్‌జంప్‌, డిస్కస్‌త్రో, జావెలిన్‌ త్రో ఈవెంట్లలో రాణిస్తూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. - న్యూస్‌టుడే, తిరుపతి(క్రీడలు)

వ్యాయామం చేయనిదే రోజు గడవదు

తిరుపతికి చెందిన ఎం.మునస్వామిరెడ్డి(84) ఎస్వీ పశువైద్య వర్సిటీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. విద్యార్థి దశలో క్రీడలపై మక్కువ పెంచుకుని రాణించారు. మొదట్లో ఫుట్‌బాల్‌, హాకీ ఆడేవారు. ఆ తరువాత అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్‌, లాంగ్‌జంప్‌, త్రిపుల్‌జంప్‌, 200మీ పరుగుపందెంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం లాంగ్‌జంప్‌ 4.5మీటర్లు, ట్రిపుల్‌జంప్‌ 9.08మీ రికార్డును తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు, రెండు వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. రోజువారీ వ్యాయామంలో తనకు శక్తి, ఓపిక లభిస్తోందని, వ్యాయామం చేయనిదే రోజు గడవదని చెబుతున్నారు.. మునస్వామిరెడ్ఢి

 ఆర్మీ, పోలీసు అభ్యర్థులకు శిక్షణ

తిరుపతి బాలాజీ కాలనీకి చెందిన నీరజ(72) వ్యాయామ ఉపాధ్యాయురాలిగా, అధ్యాపకురాలిగా పనిచేశారు. మాస్టర్‌ అథ్లెట్‌గా కొనసాగుతున్నారు. 100మీ, 200మీ పరుగుపందెం, హైజంప్‌, ట్రిపుల్‌జంప్‌, హర్డిల్స్‌, 5కిమీ, 10కిమీ నడక వంటి ఈవెంట్లలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని పలు బంగారు, వెండి, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 1990లో మలేషియా వేదికగా జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 5కిమీ నడక విభాగంలో రెండో స్థానం సాధించారు. ఇటీవల గుంటూరులో జరిగిన పోటీల్లో బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. తారకరామ స్టేడియంలో ఆర్మీ, పోలీసు ఉద్యోగాల కోసం సాధన చేసే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు మెలకువలు నేర్పిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఆటలు ఆడించడం ఇష్టం

తిరుపతి ఎల్‌ఐసీ నగర్‌కు చెందిన పుష్పకుమారి(83) చిన్నతనం నుంచి ఆటలంటే ఇష్టం. వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పలు పాఠశాల్లో పనిచేసి విద్యార్థినులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. 1997లో పదవీవిరమణ పొందారు. ప్రతిరోజూ మైదానంలో అథ్లెటిక్స్‌ సంబంధించిన వ్యాయామం చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర, స్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పతకాలు సాధించారు. ఇటీవల గుంటూరులో జరిగిన పోటీల్లో మూడు బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. మైదానంలో క్రీడాకారులను ఆటలాడించడం అంటే ఇష్టమని చెబుతున్నారు.. పుష్పకుమారి.

జాతీయ స్థాయి పోటీలకు అర్హత

చిత్తూరుకు చెందిన ఎల్‌.సుశీల(63) తిరుపతిలో నివాసం ఉంటున్నారు. పశుసంవర్ధక శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేసి 2019లో పదవీవిమరణ పొందిన సుశీల మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో పతకాల పంట పండిస్తున్నారు. అథ్లెటిక్స్‌లో హర్డిల్స్‌, లాంగ్‌జంప్‌, ట్రిపుల్‌జంప్‌, హైజంప్‌, జావెలిన్‌త్రో ఈవెంట్లలో రాణిస్తున్నారు. 2006లో బెంగళూరులో జరిగిన ఆసియా మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇటీల గుంటూరు వేదికగా జరిగిన పోటీల్లో బంగారు 2, వెండి 1 పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వ్యాయామంతోనే చక్కటి ఆర్యోగం లభిస్తోందని అభిప్రాయపడ్డారు సుశీల.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని