logo

అతివేగం..అవగాహన రాహిత్యం

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, వ్యాన్లలో భారీగా భక్తులు వస్తుంటారు. కొండకు ప్రస్తుతం రోజుకు సుమారుగా 800 ద్విచక్రవాహనాలు, 170 నుంచి 180 ఆర్టీసీ బస్సులు.. కార్లు సుమారుగా 5 వేల నుంచి 7వేల వరకు వస్తున్నాయి. మొదటి ఘాట్‌రోడ్డు పొడవు 19

Published : 24 Jan 2022 05:01 IST

ఘాట్‌రోడ్డు మలుపుల్లో ప్రమాదాలు

 తిరుమల రెండో ఘాట్‌రోడ్డు

న్యూస్‌టుడే, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, వ్యాన్లలో భారీగా భక్తులు వస్తుంటారు. కొండకు ప్రస్తుతం రోజుకు సుమారుగా 800 ద్విచక్రవాహనాలు, 170 నుంచి 180 ఆర్టీసీ బస్సులు.. కార్లు సుమారుగా 5 వేల నుంచి 7వేల వరకు వస్తున్నాయి. మొదటి ఘాట్‌రోడ్డు పొడవు 19 కిలోమీటర్లు ఉండగా.. తిరుమల నుంచి తిరుపతికి 58 మలుపులు ఉన్నాయి. రెండో ఘాట్‌రోడ్డు పొడవు 18 కిలోమీటర్లు ఉండగా 6 మలుపులు ఉన్నాయి. కనుమ రహదారిలో మలుపుల వద్ద రహదారిపై సరైన అనుభవం, అవగాహన లేని డ్రైవర్లు, సొంత వాహనదారులు తరచూ రోడ్డుప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతినెలా సుమారు నాలుగు నుంచి ఐదు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

తనిఖీలు కట్టుదిట్టం చేస్తే..

తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమల జీఎన్‌టీ టోల్‌గేట్‌ వరకు ఓ వాహనం ప్రయాణించడానికి తితిదే, ఆర్టీవో అధికారులు నిర్ణీత సమయాన్ని నిర్దేశించారు. వాహనదారుడు అలిపిరి టోల్‌గేట్‌లో టోకెన్‌ తీసుకున్న సమయంలో అందులో నమోదుచేసి ఉంటుంది. అదేవిధంగా తిరుమలలో జీఎన్‌ఎసీ టోల్‌గేట్‌ చేరుకున్న సమయాన్ని తనిఖీ చేస్తారు. ఈ తనిఖీలను మరింత పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొదటి, రెండో ఘాట్‌రోడ్ల మధ్యలో మరో తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని గుర్తించే ఏర్పాట్లు చేయాలి. తద్వారా వాహనచోదకులు సమయపాలన పాటించి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డుప్రమాదాలను నివారించే అవకాశం ఉంది.

బోల్తాపడిన కారు

నిబంధనలు పాటించని డ్రైవర్లు

ఘాట్‌రోడ్లలో మలుపులు అధికంగా ఉండడంతో తితిదే నియమిత సమయాన్ని నిర్దేశించి వాహనాలను తిరుమలకు అనుమతిస్తోంది. ఈ సూచనలు పట్టించుకోని కొంత మంది డ్రైవర్లు అతివేగంగా కనుమదారిలో ప్రయాణించడం, ముందు వచ్చే మలుపులపై సరైన అవగాహన లేక రోడ్డుప్రమాదాలు చేస్తున్నారు. ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడంతో పలువురు గాయపడటంతోపాటు మృతిచెందుతున్నారు. కనుమదారిలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డుప్రమాదాల నివారణపై తితిదే నిఘా, భద్రతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వేగనియంత్రణకు చర్యలు

ఘాట్‌రోడ్లలో ప్రమాదాల నివారణకు వాహనాల వేగనియంత్రణకు స్పీడ్‌గన్లు, వేగ నిరోధకాలు ఏర్పాటు చేసేందుకు తితిదే చర్యలు తీసుకుంటోంది. నిర్ణీత వేగం నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను స్పీడ్‌ గన్‌ల ద్వారా గుర్తించి జరిమానాలు విధిస్తామన్నాం. - కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ఈవో, తితిదే

2019 నుంచి నమోదైన ప్రమాదాలు

సంవత్సరం రోడ్డు గాయపడిన మృతులు

ప్రమాదాలు వారు

2019 24 72 5

2020 8 11 --

2021 30 20 2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు