logo

ఇక్కడ దొరకదు.. కర్ణాటకకు కరవుండదు

ప్రజలకు ఇసుక ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. రీచ్‌ల ద్వారా నిర్మాణాలకు అందిస్తామని ప్రకటనలు గుప్పిస్తోంది. వాస్తవంగా చూస్తే.. ఇసుక ఇక్కడ కనిపించడం కష్టమవుతోంది. మొత్తం ఇసుక కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతోంది. ఇక్కడ ప్రజలు ఇసుక కోసం అవస్థలు పడుతున్నారు. వ్యాపారులు మాత్రం ఇబ్బడిముబ్బడిగా ప

Published : 22 May 2022 04:50 IST

యథేచ్ఛగా తరలిపోతున్న ఇసుక


కౌండిన్య నదిలో ఇసుక తోడుతున్న కూలీలు

ప్రజలకు ఇసుక ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. రీచ్‌ల ద్వారా నిర్మాణాలకు అందిస్తామని ప్రకటనలు గుప్పిస్తోంది. వాస్తవంగా చూస్తే.. ఇసుక ఇక్కడ కనిపించడం కష్టమవుతోంది. మొత్తం ఇసుక కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతోంది. ఇక్కడ ప్రజలు ఇసుక కోసం అవస్థలు పడుతున్నారు. వ్యాపారులు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పక్క రాష్ట్రానికి తరలించేస్తున్నారు.

-న్యూస్‌టుడే, పలమనేరు : ప్రభుత్వ గృహనిర్మాణాలకు అవసరమైన ఇసుకను తెప్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రవాణా ఛార్జీలు భరిస్తే చాలు.. నిజమైన లబ్ధిదారులకు ఉచితంగా సరఫరా చేస్తామని పేర్కొంటున్నారు. అధికారులు చెప్పేదానికి వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. ఇసుక అందుబాటులో లేక ప్రభుత్వ గృహనిర్మాణాలను లబ్ధిదారులు చేపట్టలేకపోతున్నారు. అక్రమంగా తరలిపోతున్న ఇసుక గురించి అధికారులు నోరు మెదపడం లేదు. సాధారణ ప్రజలు ట్రాక్టరు ఇసుక కావాల్సి ఉంటే రూ.4,500 చెల్లించాలి. అది కూడా అతి కష్టం మీద లభిస్తోంది. గత ప్రభుత్వం మీసేవలో ఆన్‌లైన్‌ ద్వారా రూ.800 చెల్లిస్తే ఇసుక లభించేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. ఇసుక మీద ఎవరికి అజమాయిషీ ఉందనే విషయాన్ని కూడా అధికారులు స్పష్టంగా చెప్పటం లేదు. ఎవరికి వారు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

టిప్పర్‌ ఇసుక రూ.1.25 లక్షలు

ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో టిప్పర్‌ ఇసుక రూ.50 వేల ధర పలుకుతోంది. 10 టైర్ల లారీలో ఇసుక రూ.1.25 లక్షలు. దీంతో వ్యాపారుల అడ్డగోలు వ్యవహారానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఇసుకను తోడేస్తున్నారు. ఇటీవల కౌండిన్య నదిలో నీటి నిల్వలు తగ్గడంలో యంత్రాలతో తోడేయడం మొదలు పెట్టారు. పట్టణానికి అత్యంత సమీపంలోని దండపల్లె రోడ్డు వద్ద బహిరంగంగా ట్రాక్టర్లలో ఇసుకను రవాణా చేస్తున్నారు. కొందరు రాజకీయ పలుకుబడి కలిగిన వారు గుండుగల్లు ప్రాంతంలో భారీ ఎత్తున నిలువ చేస్తున్నారు. అటు నుంచి కర్ణాటక రాష్ట్రానికి సులభంగా తరలించేస్తున్నారు.

ఒక రాత్రికి రూ.12.5 లక్షల ఆదాయం

ఒక రాత్రికి 10 లోడ్ల ఇసుక తరలిస్తే.. రూ.12.5 లక్షల ఆదాయాన్ని అందుకోవచ్ఛు ప్రస్తుతం ఇసుకను దండపల్లెరోడ్డు, గంగవరం, ఏడూరు, కాలోపల్లె, కలగటూరు ప్రాంతాల్లోని కౌండిన్య నది నుంచి తోడుకుంటున్నారు. హడావుడిగా ఇసుక తీయడం వల్ల ఇటీవల గంగవరం మండలం మేలుమాయి గ్రామం వద్ద ఇసుక తోడుతుంటే ఒక వ్యక్తి ఇసుక దిమ్మెలు పడి మృతిచెందాడు. అధికారులు ఈ వ్యవహారాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

దండపల్లెరోడ్డులో కౌండిన్య నదిలో ఇసుక బహిరంగంగా తోడుస్తున్న విషయమై భూగర్భగనులశాఖ అధికారి వేణుగోపాల్‌ స్పందిస్తూ అక్రమగా ఇసుక తోడుతున్న ప్రదేశాన్ని పరిశీలిస్తామన్నారు. అనుమతులు లేకుండా రవాణా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని