logo

ఇల్లు కట్టకుంటే ..పట్టా రద్దు !

‘ఇంటి పట్టాలు ఇచ్ఛి. ఏడాదిన్నర గడిచినా గృహ నిర్మాణాలు ఎందుకు ప్రారంభించలేదు? మీ గ్రామంలోనే కొందరు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మీరు త్వరగా మొదలుపెట్టకపోతే మీ పట్టాలు రద్దు చేసి.. వారికి ఇస్తాం’ ఇదీ చిత్తూరు జిల్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులు లబ్ధిదారులకు చేస్తు

Updated : 22 May 2022 11:41 IST

పేదలను హెచ్చరిస్తున్న రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు


చిత్తూరు గ్రామీణ మండలం తుమ్మిందలో గృహ నిర్మాణ లేఔట్‌ను

పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

‘ఇంటి పట్టాలు ఇచ్ఛి. ఏడాదిన్నర గడిచినా గృహ నిర్మాణాలు ఎందుకు ప్రారంభించలేదు? మీ గ్రామంలోనే కొందరు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మీరు త్వరగా మొదలుపెట్టకపోతే మీ పట్టాలు రద్దు చేసి.. వారికి ఇస్తాం’ ఇదీ చిత్తూరు జిల్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులు లబ్ధిదారులకు చేస్తున్న హెచ్చరిక.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లోనూ కొందరు అధికారులు.. లబ్ధిదారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. త్వరగా నిర్మాణాలు ప్రారంభించాలంటూ హెచ్చరిస్తుండటంతో వారికి ఏం చేయాలో అర్థం కావడంలేదు. పురపాలికల్లో ఈ తరహా ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి.

‘కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదు’ ఇదీ లబ్ధిదారులు.. అధికారులకు చేసుకుంటున్న విన్నపం. ఈనాడు డిజిటల్‌, చిత్తూరు, న్యూస్‌టుడే, తిరుపతి(నగరపాలిక)

‘పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించాలని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. లబ్ధిదారులను గృహ నిర్మాణాల వైపు మళ్లించాలంటూ.. గృహ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి తిరుపతి, చిత్తూరు జిల్లాల అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేస్తోంది. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది.. పట్టాలు రద్దు చేస్తామంటూ పేదలను హెచ్చరిస్తుండటంతో హడలిపోతున్నారు.

రఖాస్తుదారులు పట్టాలు అడుగుతున్నారంటూ..

అర్హత ఉండి గతంలో దరఖాస్తు చేసుకోని పేదలెవరైనా పట్టాల కోసం అర్జీ ఇస్తే 90 రోజుల్లోపు వారికి స్థలం చూపాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేషన్లు, పురపాలికలు, గ్రామాల్లో ప్రస్తుతం ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేవు. ప్రత్యామ్నాయంగా ప్రైవేటు భూములను సేకరించాల్సిందే. 90 రోజులు దాటినా పట్టాలు ఇవ్వడంలేదంటూ కొందరు ‘స్పందన’లో అర్జీలు ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల వద్దకు అధికారులు వెళుతున్నారు. మీ వార్డు/ గ్రామంలోనే కొందరు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారని.. మీరు త్వరగా నిర్మాణాలు ప్రారంభించకపోతే ఇచ్చిన పట్టాలు రద్దు చేస్తామని మౌఖికంగా చెబుతున్నారు.

రూ.35 వేల రుణం ఇవ్వాలని ఆదేశించినా..

ప్రధానంగా చిత్తూరు, పెద్దపంజాణి, పలమనేరు, పూతలపట్టు మండలాలతోపాటు సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో అధికారుల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. చిత్తూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట మున్సిపాలిటీల్లో ఒత్తిళ్లు మరింత అధికంగా ఉన్నాయి. కొందరు లబ్ధిదారులు పట్టాలు వెనక్కు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఇళ్లు నిర్మించుకుంటే వడ్డీ లేకుండా ప్రత్యేకంగా రూ.35వేల రుణం మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సాధారణంగా ఇచ్చే రుణాలనే వీటి కింద బ్యాంకర్లు చూపుతున్నారు. గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించేందుకు ఇటీవల చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్‌ గ్రామాలకు వెళ్లినప్పుడు లబ్ధిదారులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇంటి పనులు ప్రారంభం కాకపోవడానికి ఇది కూడా ఓ కారణమని గుర్తించిన ఆయన.. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.●

చిత్తూరు జిల్లాకు మంజూరైన గృహాలు: 72,272

నిర్మాణాలు ప్రారంభంకానివి : 10,290

పునాదుల దశ దాటనవి : 20,547

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని