logo

నాణ్యత ముసుగులో నిర్వాకం

చిత్తూరు కట్టమంచిలోని మార్కెట్‌ యార్డులో మామిడి సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు గడిచింది. వాతావరణ మార్పులతో ఈ ఏడాది దిగుబడులు 20-25 శాతానికి మించే పరిస్థితి లేదు.. ఉత్పత్తి తగ్గడంతో మంచి ధరలు లభిస్తాయన్న రైతుల ఆశలపై వ్యాపారులు మూకుమ్మడిగా నీళ్లు చల్లుతున్నారు.. నాణ్యత పేరుతో బేనీషా రకం

Published : 23 May 2022 05:53 IST

తగ్గుతున్న బేనీషా ధరలు

మండీల్లో వ్యాపారుల దందా

ఫలాలకే రారాజు మామిడి వ్యాపారం రోజురోజుకు పుంజుకుంటోంది..ధరలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి..

యార్డులో బేనీషా రకం మామిడి

 

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: చిత్తూరు కట్టమంచిలోని మార్కెట్‌ యార్డులో మామిడి సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు గడిచింది. వాతావరణ మార్పులతో ఈ ఏడాది దిగుబడులు 20-25 శాతానికి మించే పరిస్థితి లేదు.. ఉత్పత్తి తగ్గడంతో మంచి ధరలు లభిస్తాయన్న రైతుల ఆశలపై వ్యాపారులు మూకుమ్మడిగా నీళ్లు చల్లుతున్నారు.. నాణ్యత పేరుతో బేనీషా రకం మామిడి ధరలు రోజురోజుకు తగ్గిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు.

చిత్తూరు మార్కెట్‌ యార్డులో బేనీషా ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. యార్డులో వ్యాపారం ప్రారంభంలో టన్ను 45-50వేలు పలికిన ధర వారం తర్వాత రూ.35-40 వేలకు చేరింది. ప్రస్తుతం టన్ను ధర రూ.20-30వేలకు దిగజారింది. యార్డు నుంచి ఏటా బేనీషా కాయలు రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, న్యూదిల్లీ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాల వ్యాపారులు చిత్తూరు చేరుకున్నారు. ప్రస్తుతం వ్యాపార లావాదేవీలు చేపడుతున్నారు. కాయపై మచ్చలున్నాయి.. నాణ్యత లేదు.. తదితర కారణాలు చూపి బేనీషా కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు.

ఓపెన్‌ మార్కెట్‌లో కొంటేనే..

బెల్లం ఉత్పత్తుల తరహాలో మామిడి కాయలను ఓపెన్‌ మార్కెట్‌ విధానంలో కొనుగోలు చేయాలని రైతులు డిమాండు చేస్తున్నారు. యార్డుకు కాయలు రాగానే వ్యాపారులు వేలం పాట ద్వారా కొనుగోలు చేపట్టాలి. కాయ నాణ్యత బట్టి ధర దక్కడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. బేనీషా, కాదర్‌, పులేరా, మలగూబ తదితర టేబుల్‌ రకాలతో పాటు గుజ్జుకు ఉపయోగించే తోతాపురి కొనుగోలును ఓపెన్‌ మార్కెట్‌ విధానంలో కొనుగోలు చేయాలని పలువురు కోరుతున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే తప్ప మామిడికి మంచి ధర లభించే పరిస్థితులు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మామిడి ధరలు ఇలా..

చిత్తూరు మామిడి కాయల యార్డులో ఆదివారం టన్ను తోతాపురి ధర రూ.16-27 వేలు, బేనీషా రూ.20.30వేలు, పులేరా రూ.18-25 వేలు, మలగూబ రూ.60-70 వేలు, కాదర్‌ రూ.28-35 వరకు ధర పలుకుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని