logo

రైతే బేజారు ?

అన్నదాతలు తాము పండించిన కూరగాయలను ఎటువంటి వ్యయప్రయాస పడకుండా, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేందుకు 1999లో నాటి ప్రభుత్వం రైతుబజార్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తద్వారా సామాన్యులకు తక్కువ ధరకే తాజా కూరగాయలు లభిస్తాయన్నది మరో లక్ష్యం. రైతుబజారులో కూ

Published : 23 May 2022 05:53 IST

డబ్బుల వసూళ్లతో కోల్పోతున్న ప్రాభవం

ప్రభుత్వ చర్యలతో దెబ్బతింటోన్న ప్రాథమిక లక్ష్యం

అన్నదాతలు తాము పండించిన కూరగాయలను ఎటువంటి వ్యయప్రయాస పడకుండా, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేందుకు 1999లో నాటి ప్రభుత్వం రైతుబజార్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తద్వారా సామాన్యులకు తక్కువ ధరకే తాజా కూరగాయలు లభిస్తాయన్నది మరో లక్ష్యం. రైతుబజారులో కూరగాయలు అమ్ముకున్నందుకు రైతుల నుంచి సేవా ఛార్జీలు, మార్కెట్‌ ఫీజు పేరిట ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదని అప్పట్లో నిర్ణయించారు. గ్రామాల నుంచి అన్నదాతలు తమ ఉత్పత్తులు తెస్తే మార్గం మధ్యలోని రైతుబజార్ల వద్ద ఆర్టీసీ బస్సులు నిలపాలని ఆదేశించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది కూరగాయలను తీసుకొచ్చి కొంత లాభసాటి ధరలకు అమ్ముకునేవారు. ఇటీవల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతుబజార్ల లక్ష్యమే దెబ్బతింటోంది.

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: చిత్తూరులో 0.90 ఎకరాల్లో 1999 జనవరి 26న రైతుబజార్‌ను స్థాపించారు. నగరానికి మధ్యలో ఉన్న ఈ రైతుబజార్‌లో ప్రస్తుతం 40 వరకు స్టాళ్లు ఖాళీగా ఉన్నాయి. గ్రామాల్లోని రైతుల వద్దకు వెళ్లి మాట్లాడి వారు ఏ పంటలు పండిస్తున్నారు? మార్కెట్‌లో ఏయే కూరగాయలకు డిమాండ్‌ ఉందనే విషయాలు వివరించాల్సిన బాధ్యత మార్కెటింగ్‌ శాఖపై ఉంది. ఈ శాఖలో సిబ్బంది కొరతతో వారు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. నష్టాలు వస్తున్నాయనే కారణంతో ఆర్టీసీ అధికారులు సైతం గతంలోలా సర్వీసులు నడపడం లేదు. అన్నదాతలే ఆటో ఛార్జీలు చెల్లించి రైతుబజార్‌కు తమ ఉత్పత్తులు తెస్తున్నారు. ఇవి భరించలేని కొందరు పల్లెల్లోనే అయిన కాడికి అమ్ముకుంటున్నారు. దీనికితోడు కొన్నినెలల కిందట రైతుబజార్‌లో కూరగాయాలు అమ్ముకునే రైతుల నుంచి రూ.750 వసూలు చేయాలని మార్కెటింగ్‌ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. వ్యాపారుల నుంచి రూ.వెయ్యి తీసుకోవాలని పేర్కొన్నారు. సుమారు 10 మంది వ్యాపారులు ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల చిత్తూరు కార్పొరేషన్‌కు ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ విజయానందరెడ్డి మొత్తం గేటు ఫీజు చెల్లించడంతో.. బయటి మార్కెట్‌లోని రైతులు, వ్యాపారులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో గతంలో రైతుబజార్‌లో అమ్ముకున్న కొందరు బయటి మార్కెట్‌కు వెళ్లారు.

ఇదీ దైన్యం.. రైతుబజార్‌లో 83 దుకాణాలున్నాయి. 40 దుకాణాల్లో మాత్రమే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పది చోట్ల రైతులు కాకుండా వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు. బయటి మార్కెట్‌తో పోలిస్తే ఇక్కడ కూరగాయల ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. మార్కెట్లలో కూరగాయాలు కొనుగోలు చేసి.. ఇక్కడ విక్రయిస్తుండటంతోనే ఈ పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని