logo

గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి రావాలి: మంత్రి

ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేసవి శిబిరాలు నిర్వహిస్తోందని పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్‌.కె.రోజా పేర్కొన్నారు. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. పల్లెల్లోని

Published : 23 May 2022 05:53 IST


బ్యాటింగ్‌ చేస్తున్న రోజా

 

నగరి, న్యూస్‌టుడే: ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేసవి శిబిరాలు నిర్వహిస్తోందని పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్‌.కె.రోజా పేర్కొన్నారు. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. పల్లెల్లోని క్రీడా మాణిక్యాలను వెలుగులోకి తెచ్చేందుకు సీఎం జగన్‌ ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,769 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పేదరికం అడ్డు రావడంతో ఎందరో క్రీడాకారులు వార్డు, గ్రామ పరిధి దాటి బయటకు రాలేకున్నారని, అలాంటి వారిని గుర్తించడానికి ప్రత్యేక క్రీడా క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నామని వివరించారు. నగరి నియోజకవర్గంలో ఎనిమిదేళ్లుగా గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంతో వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారన్నారు. క్రీడారంగ అభివృద్ధికి, క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ మాట్లాడుతూ యువత టీవీలు, సెల్‌ఫోన్లకు పరిమితం కాకుండా చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా క్రికెట్‌ నెట్‌ ప్రాక్టీస్‌, వాలీబాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌ ఆడి శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్డీవో సుజన, సెట్విన్‌ సీఈవో మురళీకృష్ణారెడ్డి, జిల్లా ముఖ్య శిక్షకుడు బాలాజీ, నగరి కమిషనర్‌ నాగేంద్రప్రసాద్‌, ఎంఈవో శ్రీదేవి, పుత్తూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ హరి, నగరి మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్లు బాలన్‌, వెంకటరత్నంరెడ్డి, నగరి, నిండ్ర, విజయపురం, పుత్తూరు మండలాల ఎంపీపీలు భార్గవి, దీప, సరిత మునివేలు, ప్రజాప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని