logo

లేని భూమికి దస్త్రాలు సృష్టించి..

తమిళనాడుకు సరిహద్దుగా ఉన్న పాలసముద్రం మండలంలో లేని భూమికి నకిలీ సర్వే నంబర్లు సృష్టించి.. పాస్‌ పుస్తకాలు పొందిన వ్యవహారం కలకలం రేపుతోంది.  పాస్‌ పుస్తకాలను తాకట్టు పెట్టి అక్రమార్కులు బ్యాంకులో రుణాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated : 24 May 2022 11:37 IST

 బ్యాంకు రుణాలు పొందిన వైనం
 పాలసముద్రం మండలంలో వెలుగు చూస్తున్న అక్రమాలు

ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్‌టుడే, పాలసముద్రం: తమిళనాడుకు సరిహద్దుగా ఉన్న పాలసముద్రం మండలంలో లేని భూమికి నకిలీ సర్వే నంబర్లు సృష్టించి.. పాస్‌ పుస్తకాలు పొందిన వ్యవహారం కలకలం రేపుతోంది.  పాస్‌ పుస్తకాలను తాకట్టు పెట్టి అక్రమార్కులు బ్యాంకులో రుణాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వనదుర్గాపురం పంచాయతీలో సైతం ఇదే తరహాలో నకిలీ సర్వే నంబర్లు సృష్టించిన బాగోతం వెలుగులోకి వచ్చినా.. యంత్రాంగం విచారణ జరపకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా నరసింహాపురం పంచాయతీలో సైతం ఇలాంటి వ్యవహారం బయటకు వచ్చింది. సమీపంలోని తిరుమలరాజుపురం, గంగమాంబపురంలో కూడా నకిలీ దందా జరిగినట్లు సమాచారం. మండల కేంద్రానికి దూరంగా ఉన్న, అధిక విస్తీర్ణం ఉన్న రెవెన్యూ గ్రామాలనే అక్రమార్కులు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 2016-18 మధ్య ఎక్కువగా ఇటువంటి అక్రమాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో పనిచేసిన రెవెన్యూ యంత్రాంగం ప్రమేయంతోనే ఈ వ్యవహారాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. 
నరసింహాపురం పంచాయతీలోని 248 సర్వే నంబరు ఆధారంగా 2016-18 మధ్యకాలంలో విధులు నిర్వర్తించిన రెవెన్యూ సిబ్బంది సహకారంతో అక్రమార్కులు నకిలీ రికార్డులు సృష్టించారు. సదరు సర్వే నంబరులో నాలుగు ఎకరాలు ఉండగా.. అదనంగా 20 ఎకరాలు (248/1 ఎఫ్‌1, ఏ1, ఈ, బి, డి) సృష్టించారు. పాస్‌ పుస్తకాలు సైతం పొందారు. ప్రస్తుతం ప్రభుత్వం అందించే సాయాన్ని సైతం పొందుతున్నారు.  మరోవైపు బ్యాంకులో సైతం పాస్‌ పుస్తకాలను తాకట్టు పెట్టి రుణాలు పొందినట్టు తెలుస్తోంది. మండలంలో పెద్ద ఎత్తున నకిలీ వ్యవహారాలు జరుగుతున్నా.. ఉన్నతాధికారులు ఎందుకు మిన్నకుండిపోయారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నకిలీ సర్వే నంబర్లు సృష్టించడానికి రెవెన్యూ యంత్రాంగం ఏమైనా సహకరించిందా? అనే కోణంలో విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

విచారించి.. చర్యలు తీసుకుంటాం
పాలసముద్రం మండలంలోని భూ అక్రమాలపై స్థానిక రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి.. విచారిస్తాం. అక్రమాలు జరిగినట్టు తేలితే అందుకు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
 - వెంకటేశ్వర్, జేసీ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని