logo

విత్తన విలాపం..కేటాయింపుల్లో కోతలు

జిల్లాలో ఖరీఫ్‌ సాగు రైతులకు వేరుసెనగ విత్తన విలాపం తప్పేలా లేదు.. ముందస్తు తొలకరి వర్షాలతో రైతులు ఖరీఫ్‌ సాగుకు సమాయత్తమవుతున్నారు.. ఇప్పటికే పొలాలను దుక్కులు చేయడం కొందరు రైతులు మొదలు పెట్టగా.. మరికొందరు ముందస్తుగానే విత్తుకు సన్నద్ధమవుతున్నారు..

Published : 27 May 2022 05:43 IST

 సరఫరాలో తీవ్ర జాప్యం 
 అవస్థల్లో వేరుసెనగ రైతులు

జిల్లాలో ఖరీఫ్‌ సాగు రైతులకు వేరుసెనగ విత్తన విలాపం తప్పేలా లేదు.. ముందస్తు తొలకరి వర్షాలతో రైతులు ఖరీఫ్‌ సాగుకు సమాయత్తమవుతున్నారు.. ఇప్పటికే పొలాలను దుక్కులు చేయడం కొందరు రైతులు మొదలు పెట్టగా.. మరికొందరు ముందస్తుగానే విత్తుకు సన్నద్ధమవుతున్నారు.. వ్యవసాయ శాఖ అందజేసే రాయితీ వేరుసెనగ విత్తు కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.. 

న్యూస్‌టుడే,చిత్తూరు(మిట్టూరు) విత్తు పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో తెలియకపోగా.. కేటాయింపుల్లో భారీగా కోత విధిస్తున్నారు.. విత్తన కేటాయింపులను తగ్గించడంతో ఇటు వ్యవసాయాధికారుల్లో.. అటు రైతుల్లో ఆందోళన మొదలైంది.. ప్రస్తుతం కేటాయించిన విత్తనం  సరిపోయే పరిస్థితి లేదంటూ ఆ శాఖ అధికారులే చర్చించుకోవడం గమనార్హం.
33,700 క్వింటాళ్ల విత్తనమే..
జిల్లాకు కేవలం 33,700క్వింటాళ్ల రాయితీ వేరుసెనగ విత్తనాన్ని కేటాయించారు. కేటాయింపుల్లో భారీగా కోత విధించారు. జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా 31 మండలాలకే పరిమితం కాగా.. ఖరీఫ్‌లో వేరుసెనగ సాధారణ సాగు విస్తీర్ణం 55,661 హెక్టార్లకు తగ్గింది. ఈ విస్తీర్ణానికి సరిపడా విత్తన కేటాయించకపోవడం శోచనీయం. గతేడాది అధిక వర్షాల వల్ల వేరుసెనగ పంట నష్టపోయి చేతికి రాలేదు. దీంతో రాయితీ విత్తనంపైనే రైతులు ఆధారపడాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కేటాయింపుల్లో భారీ కోత వల్ల విత్తన కాయల కోసం రైతులకు పాట్లు తప్పేలా లేదు. 
సరఫరాలో తీవ్ర జాప్యం..
జిల్లాలోని 502 ఆర్‌బీకేలకు ఏపీ విత్తన సంస్థ విత్తన కాయలు సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 12,550 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేసింది. విత్తన సరఫరాలో ఏపీ విత్తన సంస్థ తీవ్ర జాప్యం చేస్తోందనే బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది ప్రణాళికాబద్ధంగా సరఫరా చేస్తే.. ఈ ఏడాది నిర్దిష్ట ప్రణాళిక కొరవడింది. ఉన్నతాధికారులు స్పందించి జిల్లాకు సరిపడా విత్తన కేటాయింపులతో పాటు సకాలంలో ఆర్‌బీకేలకు విత్తన సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

వేరుసెనగ సాగు విస్తీర్ణం, విత్తన కేటాయింపులు ఇలా..
జిల్లాలో సాగు విస్తీర్ణం: 55,661హెక్టార్లు
రాయితీతో 30 కిలోల బస్తా ధర: రూ.1544.40
మళ్లీ కోత విధించి.. మూడో విడత కేటాయింపు:33,700 క్వింటాళ్లు
కోత విధించి రెండో విడత కేటాయింపు:41 వేల క్వింటాళ్లు
తొలుత విత్తన కేటాయింపు:48,800 క్వింటాళ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని