logo

జూన్‌ ఒకటి నుంచి కొత్త బాదుడు

పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అన్ని ప్రాంతాలతో పాటు మేజర్‌ పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోనూ పెరిగిన విలువలపైనే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుముల్ని ఇక నుంచి వసూలు చేయనున్నారు. దీంతో చిన్నపాటి ఇల్లు కొనుక్కోవాలనుకునే పేద,

Published : 27 May 2022 05:41 IST

 నిర్మాణాల మార్కెట్‌ విలువ సవరణ
 ఉమ్మడి జిల్లాపై రూ.10 కోట్ల భారం

స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ క్రయవిక్రయాలు సాగించే వారిపై రాష్ట్ర ప్రభుత్వం మరో భారాన్ని మోపింది. మట్టి మిద్దెల నుంచి ఎత్తైన భవనాల వరకు అన్ని రకాల నిర్మాణాల మార్కెట్‌ విలువలు పెంచేసింది. సినిమాహాళ్లు, మిల్లులు, కర్మాగారాలు, కోళ్ల ఫారాల భవన నిర్మాణాలపై అదనపు వడ్డన విధించింది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా ప్రస్తుత విలువలపై సగటున 5 శాతం చొప్పున పెంచడం ద్వారా ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులపై అదనంగా రూ.10 కోట్ల భారం పడనుందని అంచనా. 

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అన్ని ప్రాంతాలతో పాటు మేజర్‌ పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోనూ పెరిగిన విలువలపైనే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుముల్ని ఇక నుంచి వసూలు చేయనున్నారు. దీంతో చిన్నపాటి ఇల్లు కొనుక్కోవాలనుకునే పేద, మధ్య తరగతి వర్గాలకు అదనపు భారం పడనుంది. సవరించిన విలువలపై ఇప్పటికే జిల్లా పరిషత్‌ ఆమోదం లభించింది. తర్వాత పట్టణాభివృద్ధి సంస్థల ఆమోదం దక్కడం ఇక లాంఛనమే. ఈ పెంపుదల జూన్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పటికే భూముల విలువల్ని పెంచిన విషయం విదితమే. ఇప్పుడు నిర్మాణాల మార్కెట్‌ విలువలూ పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాలు మరో బాదుడుని భరించాల్సిందే.
అదనపు భారమిలా..: గతంలో చదరపు అడుగు రూ.1,140 విలువతో 1,500 మొత్తం విస్తీర్ణం గల ఆర్‌సీసీ నివాస గృహం విలువ రూ.17 లక్షలు అనుకుంటే.. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుముగా రూ.1.28 లక్షలు చెల్లించాల్సి ఉండేది. కొత్త విలువ ప్రకారం రూ.1,200 విలువతో 1,500 మొత్తం విస్తీర్ణం గల ఆర్‌సీసీ నివాస గృహం విలువ రూ.18 లక్షలు కానుంది. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుముగా రూ.1.35 లక్షలు చెల్లించాలి. అంటే రుసుముల రూపంలో అదనంగా రూ.7 వేల వరకు చెల్లించాలని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని