logo

RK Roja: కోనసీమకు అంబేడ్కర్‌ పేరు ఉంచాలా? వద్దా?: రోజా

కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు ఉంచాలా? వద్దా? అనే విషయాన్ని తెదేపా, భాజపా, జనసేన పార్టీలు చెప్పాలని మంత్రి ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన

Updated : 29 May 2022 11:29 IST


మాట్లాడుతున్న మంత్రి రోజా

తిరుపతి(గాంధీరోడ్డు), తిరుమల, న్యూస్‌టుడే: కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు ఉంచాలా? వద్దా? అనే విషయాన్ని తెదేపా, భాజపా, జనసేన పార్టీలు చెప్పాలని మంత్రి ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహానాడులో ఎన్టీఆర్‌ గొప్పతనాన్ని, రాజకీయ మార్పు తెలియజేయకుండా సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మహిళలతో జగన్‌ను తిట్టిస్తూ సంబరపడుతున్నారని విమర్శించారు. కుప్పం, వైఎస్‌ఆర్‌, కృష్ణా జిల్లాల్లో తెదేపా కార్యకర్తల్వెరూ లాభపడ్డ దాఖలాలు లేవని.. నేడు వైకాపా ప్రభుత్వంలో తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలందరూ లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 30 నియోజకవర్గాల్లో తమ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థులు లేరని స్వయాన లోకేశ్‌ చెప్పడం విచారకరమన్నారు. అభ్యర్థులను పెట్టుకోలేని స్థాయిలో తెదేపా ఉంటే.. 2024లో చంద్రబాబు సీఎం అవుతారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ముందుగా ఆమె తిరుమలలో మాట్లాడుతూ ఏదైనా ఒక జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టమని చెప్పిన తెదేపా, జనసేన నాయకుల విజ్ఞప్తిని మన్నించి సీఎం జగన్‌ ఆ పేరుపెడితే దాన్ని రాజకీయం చేసి మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లనే తగలబెట్టించి రౌడీయిజం చేశారని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని