logo

పరిష్కరిస్తేనే పరిశ్రమించొచ్చు..!

రిలయన్స్‌ సంస్థ ఏర్పాటుకు వికృతమాల పరిధిలో 76.42 ఎకరాలు, కుర్రకాల్వ పరిధిలో 60.26 ఎకరాలు కేటాయించారు. ఇందుకోసం ఈ సంస్థ సైతం ప్రాథమికంగా రూ.4 కోట్లు ఏపీఐఐసీకి చెల్లించింది.

Published : 29 Jun 2022 02:24 IST
న్యాయ వివాదాలతో పరిశ్రమల ఏర్పాటులో జాప్యం
ఈనాడు-తిరుపతి
వికృతమాల పరిధిలోని ఏపీఐఐసీ భూములు

* రిలయన్స్‌ సంస్థ ఏర్పాటుకు వికృతమాల పరిధిలో 76.42 ఎకరాలు, కుర్రకాల్వ పరిధిలో 60.26 ఎకరాలు కేటాయించారు. ఇందుకోసం ఈ సంస్థ సైతం ప్రాథమికంగా రూ.4 కోట్లు ఏపీఐఐసీకి చెల్లించింది. ఇదే సమయంలో కొందరు పరిహారానికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు న్యాయస్థానంలో ఉండటంతో సంస్థ తమ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కు తీసుకుంది.

* రామిరెడ్డిపల్లెలోని పారిశ్రామికవాడలో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అప్రోచ్‌ రహదారి నిర్మించే సమయంలో 12 స్థలాలకు సంబంధించి పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం న్యాయస్థానంలో కేసులు నడుస్తుండటంతో పరిశ్రమలు ప్రారంభం కాని పరిస్థితి ఏర్పడింది.

* ఎలక్ట్రానిక్‌ పరికరాల ఉత్పత్తి కేంద్రంలో లిథియం బ్యాటరీ తయారీ పరిశ్రమకు భూమిని కేటాయించగా కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడు కేసు నడుస్తుండటంతో పరిశ్రమ ఏర్పాటులో జాప్యం నెలకొంది.

జిల్లా పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ పలు కారణాలతో ఆలస్యమవుతోంది. పారిశ్రామికవేత్తలకు అనువైన భూమి లభిస్తున్నా.. క్షేత్రస్థాయిలో వారికి భూముల కేటాయింపులు జరిగిన తర్వాత కొందరు రైతులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వివాదాలు  త్వరితగతిన పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటై నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే ఆస్కారం ఉంటుంది.

తిరుపతి పరిధిలోని రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, వరదయ్యపాళెం, పెళ్లకూరు, సూళ్లూరుపేట, తడ తదితర ప్రాంతాలు కృష్ణపట్నం, చెన్నై పోర్టులకు దగ్గరగా ఉన్నాయి. చెన్నై, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలు, జాతీయ రహదారులు అందుబాటులో ఉండటంతో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. పలు ప్రాంతాల్లో పారిశ్రామికవాడలు ఏర్పాటుకు ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. విశాఖ-చెన్నై  పారిశ్రామికవాడ ఏర్పాటుకు సుమారు 24 వేల ఎకరాలు సేకరిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కొన్ని పారిశ్రామికవాడల్లో పరిశ్రమలకు భూములు కేటాయించిన సమయంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. రైతులకు పరిహారం అందించే విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. కొందరికి పట్టాలు లేకున్నా.. కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తూ జీవిస్తుండటంతో తమకు ఇతరులకు ఇచ్చిన విధంగానే నగదు చెల్లించాలని కోరుతున్నారు. మరికొందరికి డీకేటీ పట్టాలు ఇవ్వగా తమ అవసరాల కోసం విక్రయిస్తూ వచ్చారు. అలాంటి క్రయవిక్రయాలు కాగితాలపైనే నడుస్తుండటంతో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వారి పేరుతోనే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొందరు తాము భూమిని కొనుగోలు చేశామని, పరిహారం తమకు నేరుగా అందించాలంటూ అడుగుతున్నారు. ఇటువంటి సమస్యలకు సంబంధించి న్యాయస్థానాలకు వెళ్తున్నారు. ఇలా జిల్లా పరిధిలో 13 పారిశ్రామికవాడల్లో 72 పిటిషన్లు న్యాయస్థానంలో దాఖలయ్యాయి. వీటిని పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కొన్ని కేసులను న్యాయస్థానం వెలుపలే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, సంయుక్త కలెక్టర్‌ బాలాజీలు సైతం భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని