logo

ఎంత కష్టమొచ్చిందమ్మా..!

కటిక పేదరికం.. కష్టంలో ఉన్న వాళ్లపై కనికరం చూపించే వాళ్లు లేకుండా పోయారు. అప్పులిచ్చిన వాళ్ల సూటిపోటి మాటలతో ఇక ఆత్మహత్యే శరణ్యమని నిర్ధరించుకుంది ఆ మాతృమూర్తి. విషద్రావకం తాగడంతో మంగళవారం చావు,

Published : 29 Jun 2022 02:24 IST
రుణదాతల ఒత్తిళ్లు..
వైకాపా కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నం

ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బత్తెమ్మ

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: కటిక పేదరికం.. కష్టంలో ఉన్న వాళ్లపై కనికరం చూపించే వాళ్లు లేకుండా పోయారు. అప్పులిచ్చిన వాళ్ల సూటిపోటి మాటలతో ఇక ఆత్మహత్యే శరణ్యమని నిర్ధరించుకుంది ఆ మాతృమూర్తి. విషద్రావకం తాగడంతో మంగళవారం చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం కొత్తపేటకు చెందిన బత్తెమ్మ, సుబ్రహ్మణ్యం భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలు. సుబ్రహ్మణ్యం ఏళ్ల క్రితమే భార్యను వదలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుమార్తెల భవిష్యత్తుతో పాటు కుటుంబ పోషణను భుజస్కంధాలపై ఎత్తుకుంది. ఇస్త్రీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తోంది. మొదటి కుమార్తెకు ఎప్పుడో పెళ్లి చేసింది. రెండో కుమార్తెకు నాలుగు నెలల క్రితం వివాహం చేసింది. మూడో కుమార్తె ఇంటర్‌ చదువుతోంది. వీరి వివాహాలకు సుమారు రూ.1.5 లక్షలు అప్పు చేసింది. అది కాస్త వడ్డీలతో కలుపుకుని రూ.2 లక్షలైంది. అయితే ఇటీవల అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో అయినవాళ్లు అండ లేక పోవడంతో తమ గోడును ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి చెప్పుకుందామని మంగళవారం మధ్యాహ్నం వైకాపా కార్యాలయానికి వెళ్లింది. తీరా అక్కడ ఎవ్వరూ లేక పోవడంతో తన వెంట తెచ్చుకున్న విషద్రావకాన్ని అక్కడే తాగి సొమ్మసిల్లి పడిపోయింది. అక్కడి వాళ్లు 108కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఆమెను స్థానికంగా ఉన్న ఏరియా ఆస్పత్రికి తరలించారు. ద్రావకం ఎక్కువ మోతాదులో తాగడంవల్ల పరిస్థితి విషమించిందని వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి రెఫర్‌ చేశారు. తమ కష్టాలు తీర్చేందుకు కన్నతల్లి ఇలా ఆత్మహత్యకు ప్రయత్నించడం పట్ల కుమార్తెలు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని