logo

నకిలీ కంపెనీలో పెట్టుబడులు

‘హలో..నాది మలేషియా, నాపేరు ఇమిలీ చాన్‌.. నాకు కెప్పల్‌ డైమండ్‌ కంపెనీ ఉంది. సింగపూర్‌లోని కెప్పల్‌ కార్పొరేషన్‌లో డైమండ్‌, ప్లాస్టిక్‌ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ బిజినెస్‌ ఎనాలసిస్‌ చేస్తుంటా. ఇందులో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయి..

Updated : 29 Jun 2022 04:44 IST

రూ.14.40 లక్షలు మాయం
తడలో మోసపోయిన ప్రైవేటు ఉద్యోగి

తడ, న్యూస్‌టుడే: ‘హలో..నాది మలేషియా, నాపేరు ఇమిలీ చాన్‌.. నాకు కెప్పల్‌ డైమండ్‌ కంపెనీ ఉంది. సింగపూర్‌లోని కెప్పల్‌ కార్పొరేషన్‌లో డైమండ్‌, ప్లాస్టిక్‌ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ బిజినెస్‌ ఎనాలసిస్‌ చేస్తుంటా. ఇందులో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయి.. కావాలంటే వెబ్‌సైట్‌ తనిఖీ చేసుకోండి.. కంపెనీ వృద్ధి ఎలా ఉందో తెలుస్తుంది’ అంటూ ఓ మహిళ వాట్సాప్‌ కాల్‌ చేసింది. తొలుత అనుమానం వచ్చినా.. తరువాత వెబ్‌సైట్‌ పరిశీలిస్తే కంపెనీ లాభాల భాటలో ఉన్నట్లు చూపించడంతో విడతల వారీగా రూ.14,40,000 పెట్టుబడి పెట్టాడు. తీరా అవసరం నిమిత్తం కొంత మొత్తం ఉపసంహరించుకుంటానని చెప్పిన కొంతసేపటికే వెబ్‌సైట్‌ పనిచేయడం లేదు. వాట్సాప్‌ నంబరు స్విచ్ఛాఫ్‌ అయ్యింది. అప్పుడు తెలిసింది తను మోసపోయానని, తాను పెట్టుబడి పెట్టింది నకిలీ కంపెనీలో అని.. తడకు చెందిన బాధితుడు కె.విశ్వనాథ్‌ జరిగిన ఘటనపై మంగళవారం ఫిర్యాదు చేయడంతో ఎస్సై జేపీ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమిళనాడు పరిధిలోని కాంచీపురం జిల్లా మాంబాక్కం తాలూకా, పోలాచేరి గ్రామానికి చెందిన కె.విశ్వనాథ్‌ తడ మండలంలోని పూడి గ్రామంలో రాయల్‌ టూల్స్‌ కంపెనీలో మేనేజరుగా పనిచేస్తున్నారు. అక్కడే లేక్‌వ్యూ అతిథి గృహంలో ఉంటున్నారు. ఈ ఏడాది మార్చి 30న గుర్తుతెలియని మహిళ తనను తాను పరిచయం చేసుకుని ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టాలని వాట్సాప్‌ కాల్‌ చేసింది. ఆమె మాటలు నమ్మిన విశ్వనాథ్‌ తొలుత ఏప్రిల్‌ 12న రూ.15 వేల పెట్టుబడి పెట్టారు. తమ కంపెనీలో రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టాలని, ఎంత ఎక్కువ పెడితే అంత లాభం పొందొచ్చని కంపెనీ నుంచి ఫోన్‌ చేశారు. అప్పటి నుంచి విశ్వనాథ్‌ కంపెనీ సూచించిన బ్యాంకు ఖాతాలకు నగదును విడతల వారీగా రూ.14.40 లక్షలు జమ చేశారు. ఏప్రిల్‌ నెలాఖరుకు కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచిన తన ఖాతాలో అప్పటివరకు పెట్టిన పెట్టుబడి కాకుండా ఆదాయం రూ.12,28,350 ఉన్నట్లు చూపించింది. ఈ క్రమంలో అవసరాల కోసం విశ్వనాథ్‌ రూ.4.75 లక్షలు నగదు తీసుకుంటానని అనుమతి కోరారు. అందుకువారు సరేననడంతో వెబ్‌సైట్‌ నుంచి తన బ్యాంకు ఖాతాకు నగదు మళ్లించినట్లు చెప్పారు. కానీ నగదు జమ కాలేదు. దాంతో సదరు కంపెనీకి ఫోన్‌ చేయగా రెండుమూడు రోజులు పడుతుందన్నారు. అయినా నగదు జమ కాకపోవడంతో అనుమానం వచ్చి వెబ్‌సైట్‌ పరిశీలిస్తే మూతవేసినట్లు (క్లోజ్‌) చూపించింది. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ రావడంతో మోసపోయినట్లు భావించి పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తడ ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని