logo

ఆ కర్షకులు.. ఆదర్శకులు

పంటలకు చీడపీడలు సోకితే ఏ రైతైనా తొలుత తనకున్న అనుభవంతో క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తారు. అప్పటికీ నశించకపోతే వేల రూపాయలు ఖర్చు చేసి పురుగు

Published : 10 Aug 2022 02:49 IST

స్ఫూర్తిగా నిలిచినచెల్దిగానిపల్లె రైతులు

చెల్దిగానిపల్లె సహకార రైతులకు సూచనలు ఇస్తున్న శాస్త్రవేత్తలు

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: పంటలకు చీడపీడలు సోకితే ఏ రైతైనా తొలుత తనకున్న అనుభవంతో క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తారు. అప్పటికీ నశించకపోతే వేల రూపాయలు ఖర్చు చేసి పురుగు మందుల దుకాణ విక్రయదారుడి సలహా మేరకు క్రిమి సంహారకాలు వాడతారు. అతి తక్కువ మంది రైతులు మాత్రమే వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది వద్దకు వెళ్లి వారి సూచనల మేరకు మందులు వినియోగించి పంటలను కాపాడుకుంటారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె రైతులు మాత్రం ఇందుకు భిన్నమైన పంథాను అనుసరిస్తూ అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలపై దశాబ్దాల పాటు పరిశోధన చేసి.. బోలెడంత అనుభవం సాధించిన శాస్త్రవేత్తలనే తమ గ్రామానికి రప్పించుకుంటున్నారు. పొలాల్లోనే పాఠాలు చెప్పించుకుంటున్నారు. తద్వారా సేద్యంలో పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గాయి.. దిగుబడులు పెరిగాయి. వీటికితోడు మార్కెటింగ్‌ పరంగా జాగ్రత్తలు తీసుకోవడంతో ఒకప్పుడు అప్పులపాలైన రైతులు ఇప్పుడు లాభాల బాట పట్టారు.

సంఘమే శాస్త్రవేత్తలకు ఫీజులు చెల్లించి

అంతంతమాత్రమే వర్షాలు పడే కుప్పం నియోజకవర్గంలో సాగు అంటే కష్టాలతో కూడుకున్న వ్యవహారం. రూ.లక్షలు వెచ్చించి వేలాది అడుగుల్లో బోర్లు తవ్వినా నీళ్లు పడతాయా? అన్నది సందేహమే. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో నీటి వాడకాన్ని తగ్గించేందుకుగాను 1997లో తొలుత కుప్పం నియోజకవర్గంలోని చెల్దిగానిపల్లెలో అప్పటి ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు ప్రయోగాత్మకంగా ఇజ్రాయెల్‌ సాంకేతికతను పరిచయం చేశారు. ఈ విధానం సత్ఫలితాన్ని ఇచ్చింది. ఇదే సమయంలో చెల్దిగానిపల్లె రైతులను ప్రభుత్వం సంప్రదాయ పంటల నుంచి మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల వైపు మళ్లించింది. ఈ క్రమంలోనే 2003లో 17 మంది రైతులతో కలిసి ‘చైతన్య రైతు మిత్ర’ గ్రూపును ప్రారంభించగా.. కొంతకాలానికి పక్క మండలాల్లోని కర్షకులను కలుపుకొని ‘చెల్దిగానిపల్లె ఉద్యాన రైతుల పరస్పర సహాయక సహకార సంఘం’ను ఏర్పాటు చేశారు. ఒక్కో రైతు నుంచి సభ్యత్వ రుసుము రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘం ఆధ్వర్యంలోనే చెల్దిగానిపల్లెలో ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో రెండు-మూడు సార్లు బెంగళూరు నుంచి శాస్త్రవేత్తలు వచ్చి సాగులో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకుగాను రూ.4 వేలు ఖర్చవుతుండగా సంఘమే ఈ ఫీజును చెల్లిస్తోంది. శాస్త్రవేత్తలను అన్నదాతలు ‘మొక్కల వైద్యులు’గా సంబోధించడం కొసమెరుపు. పంటలకు చీడపీడలు సోకితే అన్నదాతలు మొక్క ఫొటో తీసి శాస్త్రవేత్తలకు వాట్సప్‌ చేస్తున్నారు. వారు అక్కడి నుంచే ఏ రసాయనాలు వాడాలనే అంశంపై సూచనలు ఇస్తుంటారు. సందేహాలుంటే వీడియో కాల్‌ ద్వారా నివృత్తి చేస్తున్నారు. దీంతో రసాయనాలపై పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గి లాభాలు కళ్ల జూస్తున్నామని రైతులు అంటున్నారు.

ఏ సందేహాలున్నా వెంటనే సంప్రదిస్తాం

గతంలో మా గ్రామంలో వ్యవసాయం చేసి చాలా వరకు నష్టపోయాం. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో వలస వెళ్లాం. చెల్దిగానిపల్లె ఉద్యాన రైతుల పరస్పర సహాయక సహకార సంఘం ద్వారా మా స్థితిగతుల్లో మార్పులు వచ్చాయి. పంటలపై ఎటువంటి సందేహాలున్నా శాస్త్రవేత్తలతో నివృత్తి చేసుకుంటున్నాం. విభిన్న పంటలు పండిస్తున్నాం. దుకాణదారుల సూచనల మేరకు వేలాది రూపాయల మందులు ఇప్పుడు కొట్టడం లేదు. ఫలితంగా పెట్టుబడులు తగ్గాయి. వినూత్న విధానాలు అనుసరిస్తుండటంతో ఆదాయమూ పెరిగింది.

- ఉమాపతి, సహకార సంఘం అధ్యక్షుడు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని