logo

ధీర.. రుధిర ధార...

యువశక్తిపైనే దేశం పురోగమిస్తుంది. ఎందరో యువజనులు నాడు స్వాతంత్య్రం కోసం పోరాడినందునే నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. అమృత మహోత్సవాల వైపు అడుగులు వేస్తున్నాం. యువశక్తి ప్రాధాన్యాన్ని గుర్తించి ఐక్యరాజ్య సమితి ఆగస్టు 12ను అంతర్జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో

Updated : 12 Aug 2022 06:19 IST

నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం

దేశ రక్షణలో అసువులు బాసిన, గాయాలపాలైన యువకులు

- ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, పలమనేరు, ఐరాల, పాకాల, రేణిగుంట

యువశక్తిపైనే దేశం పురోగమిస్తుంది. ఎందరో యువజనులు నాడు స్వాతంత్య్రం కోసం పోరాడినందునే నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. అమృత మహోత్సవాల వైపు అడుగులు వేస్తున్నాం. యువశక్తి ప్రాధాన్యాన్ని గుర్తించి ఐక్యరాజ్య సమితి ఆగస్టు 12ను అంతర్జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కంటి మీద కునుకు లేకుండా పహారా కాసి గాయాలపాలైన, అసువులు బాసిన జిల్లాలోని కొందరు యువ సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుందాం.


ఉగ్ర పోరులో.. అమరుడై  

ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన సుగుణమ్మ, ప్రతాప్‌రెడ్డి కుమారుడు చీకల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(35). డిగ్రీ పూర్తి కాగానే సైన్యంలో చేరారు. 19 ఏళ్ల క్రితం సైన్యంలోకి ప్రవేశించిన ఆయన కమాండో శిక్షణ తీసుకున్నారు. 2020 నవంబరులో సరిహద్దుల్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో ఆయన బృందంతో కలిసి వారిని ఎదుర్కొనేందుకు గడ్డ కట్టే మంచులోనే ధైర్యంగా అడుగులు వేశారు. తమను తుద ముట్టడించేందుకు సైన్యం వచ్చిందని గ్రహించిన ముష్కరులు కాల్పులు జరిపారు. దేశంలోకి వారు ప్రవేశించకూడదనే కృతనిశ్చయంతో సైనికులు ప్రతిగా ఎదురుకాల్పులకు దిగారు. ఈ క్రమంలోనే నవంబరు 8న జరిగిన పోరులో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఆ వీరుడి మృతదేహాన్ని చూసి నివాళులర్పించేందుకు ఆయన స్వస్థలానికి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి భార్య రజిత, ఇద్దరు పిల్లలున్నారు.


 కార్గిల్‌లో.. శత్రు సైన్యానికి ఎదురొడ్డి

చౌడేపల్లె మండలం చారాల గ్రామానికి చెందిన వినాయకరెడ్డి 1996లో చిత్తూరు నగరం కన్నన్‌ కళాశాలలో జరిగిన ఆర్మీ ర్యాలీలో ఎన్నికయ్యారు. తమిళనాడులోని ఊటీ మద్రాస్‌ రెజిమెంటులో శిక్షణ పొందారు. రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, చైనా సరిహద్దుల్లోని సెక్టార్లలో విధులు నిర్వర్తించారు. 1999 మే నెలలో పాకిస్థాన్‌ సైన్యం మన దేశంలోకి ప్రవేశించడంతో కార్గిల్‌ యుద్ధం మొదలైంది. దీంతో ఆయన్ను కశ్మీర్‌కు పంపారు. ఇరు దేశాల సైనికుల మధ్య భీకరమైన కాల్పులు జరుగుతుండగా.. పాక్‌ సైనికులు ఎక్కుపెట్టిన తుపాకీ గుండ్లు వినాయకరెడ్డి కుడిచేతి వేలికి, భుజానికి తగిలాయి. దీంతో ఆయన ఆర్మీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ప్రస్తుతం చిత్తూరులోని సైనిక సంక్షేమ కార్యాలయంలో పనిచేస్తున్నారు. యుద్ధంలో ఎంతోమంది శత్రు సైనికులను మట్టుబెట్టి.. కశ్మీరును వారి పరం కాకుండా చూడటంలో చిన్న పాత్రైనా పోషించినందుకు గర్వంగా ఉందని 35 ఏళ్ల వినాయకరెడ్డి చెబుతున్నారు.


గ్రెనేడ్‌ పేలి.. వేళ్లు తెగి

పాకాల మండలం కొత్తకోట పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన బాలాజీ(38).. 20 ఏళ్ల క్రితం సైన్యంలో చేరారు. కార్గిల్‌ యుద్ధంలో పోరాడిన సైనికుల స్ఫూర్తితో.. తనవంతుగా దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్మీలో అడుగుపెట్టారు. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పగా వారూ ప్రోత్సహించారు. అసోంలో చైనాకు సరిహద్దుగా ఉన్న ప్రాంతంలో, అరుణాచల్‌ప్రదేశ్‌లో విధులు నిర్వర్తించారు. 2011లో వాస్తవాధీన రేఖ(ఎల్‌వోసీ) వద్ద రాత్రి పహారా కాస్తుండగా.. చేతిలోని గ్రెనైడ్‌ పేలింది. దీంతో ఆయన కుడి కన్ను, కుడి చేతికి గాయాలయ్యాయి. ఆరు నెలలు చికిత్స తీసుకున్న తర్వాత పరిస్థితి మెరుగుపడింది. ఈ క్రమంలోనే చేతి వేళ్లు తీసేయాల్సి వచ్చింది. తీవ్రంగా గాయపడినా వెరువకుండా సైన్యంలోనే కొనసాగారు.


శరీరంలోనే బాంబు విడిభాగం

తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె కొత్తపల్లెకు చెందిన వి.వెంకటరెడ్డి, వెంకటసుబ్బమ్మ కుమారుడు సుబ్బారెడ్డి. ప్రస్తుతం ఆయన తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్నారు. సుబ్బారెడ్డి తండ్రి వెంకటరెడ్డి 1939-1945 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. తమ్ముడు రమణారెడ్డి సైతం మిలటరీలో చేరారు. చిన్నప్పటి నుంచే సైన్యంలోకి వెళ్లాలని సుబ్బారెడ్డి తహతహలాడేవారు. 1993లో సైన్యంలో చేరిన ఆయన.. కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నారు. 2004లో పాక్‌ సైన్యం బాంబు వేయడంతో శరీరం మొత్తం రక్తసిక్తంగా మారింది. మోకాలుకు శస్త్రచికిత్స జరిగినప్పటికీ.. ఇప్పటికీ బాంబు విడిభాగం ఒకటి అలానే ఉందని ఆయన చెబుతున్నారు.

Read latest Chittoor News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts