logo

కలియుగ నాథుని వేడుక.. రారండి కానగ..!

కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. కరోనా అనంతరం భక్తుల మధ్య  బ్రహ్మోత్సవాలు భారీగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో స్వామివారి వాహనసేవలను దర్శించుకునేందుకు భక్తులు రానున్నారు.

Published : 25 Sep 2022 02:31 IST

భక్తుల మధ్య శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపు అంకురార్పణ

శ్రీవారి ఆలయంపై దశావతారాల విద్యుత్తు సెట్టింగ్‌

తిరుమల, న్యూస్‌టుడే: కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. కరోనా అనంతరం భక్తుల మధ్య  బ్రహ్మోత్సవాలు భారీగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో స్వామివారి వాహనసేవలను దర్శించుకునేందుకు భక్తులు రానున్నారు. గరుడోత్సవం రోజున ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకోనున్నారని అంచనాతో దాదాపు ఆరు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది. తితిదే, పోలీసు, రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో ఆలయ మాడవీధుల్లో గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను సిద్ధం చేశారు. మాడవీధుల్లోకి క్యూలైన్ల ద్వారా ప్రవేశించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

లేపాక్షి కూడలి సమీపంలో విద్యుత్‌ అలంకరణ

* బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు అంగరంగవైభవంగా జరగనున్నాయి. శ్రీనివాసుని అవతార నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యేలా తితిదే ముహూర్తం నిర్ణయించింది. ధ్వజారోహణానికి ముందురోజు సాయంకాలం సోమవారం భగవన్నారాయణుని సేనాధిపతి విష్వక్సేనుడు ఆలయంలోకి ప్రవేశిస్తారు. అనంతరం అంకురార్పణ జరుగుతుంది.

రాంభగీచా కూడలిలో విద్యుత్‌ అలంకరణ

* మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మాడవీధుల్లో పెద్దశేషవాహనంలో ఊరేగే ఉత్సవమూర్తిని దర్శించుకుంటారు. ఈ ఘట్టంతో పూర్తిస్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
* బ్రహ్మోత్సవాల వేళ తిరుమలక్షేత్రం విద్యుత్తు కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతోంది. తితిదే ఉద్యాన, విద్యుత్‌శాఖలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణలు పూర్తిచేశాయి. కల్యాణ వేదికలో ఫల, పుష్పప్రదర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి ప్రత్యేకంగా అనంతపద్మనాభస్వామి నమూనాతో సెట్టింగ్‌, ఆలయానికి శ్రీవారి పలు అవతారాలు ఏర్పాటు చేస్తున్నారు.


పెరటాసి నెల సందడి

పెరటాసి మాసం సందర్భంగా శనివారం శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రద్దీ నెలకొంది. తొలి శనివారం సందర్భంగా శ్రీనివాసమంగాపురం వద్ద శ్రీవారి ధర్మరథాలు, వాహనాల్లో భక్తులు కిక్కిరిసి వెళ్తూ కన్పించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ కాలినడకన తిరుమలకు వెళ్లారు. - ఈనాడు, తిరుపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని