logo

ఈ దసరాకు ఇంతేనా..!

పేద కుటుంబాలకు అసరాగా నిలిచే చౌకధరల దుకాణాల్లో నిత్యావసరాలకు కోత పడుతోంది. మూడు నెలలుగా చక్కెర, కందిపప్పు అరకొరగా అందజేస్తుండగా.. రానున్న అక్టోబరు నెల కోటాకు చక్కెర, కందిపప్పు కోత పడింది.

Published : 25 Sep 2022 02:31 IST

తీపి.. పప్పన్నం లేనట్లే
బియ్యానికే పరిమితం
ఆందోళనలో కార్డుదారులు

చిత్తూరు(మిట్టూరు): పేద కుటుంబాలకు అసరాగా నిలిచే చౌకధరల దుకాణాల్లో నిత్యావసరాలకు కోత పడుతోంది. మూడు నెలలుగా చక్కెర, కందిపప్పు అరకొరగా అందజేస్తుండగా.. రానున్న అక్టోబరు నెల కోటాకు చక్కెర, కందిపప్పు కోత పడింది. ఫలితంగా ఒక బియ్యం పంపిణీతోనే సరిపెట్టనున్నట్లు సమాచారం. దీంతో పేదలు ఘనంగా జరుపుకొనే దసరా పండగకు తీపి అందకపోగా పప్పన్నం దూరం కానుంది. తీపి వంటకాలకు అవకాశం లేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 5,31,264 కార్డులు.. 1379 చౌక దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా కార్డుదారులకు బియ్యంతో పాటు అర కిలో చక్కెర రూ.17, కిలో కందిపప్పు రూ.67కు పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ నిమిత్తం నెలకు నెలకు 270 టన్నుల చక్కెర, 550 టన్నుల కందిపప్పు అవసరం. ప్రస్తుతం గోదాముల్లో 25 టన్నుల చక్కెర, 100 టన్నుల కందిపప్పు మాత్రమే అందుబాటులో ఉంది. డిమాండుకు అనుగుణంగా చక్కెర, కందిపప్పు జిల్లాకు చేరకపోగా రెండు నెలలుగా పూర్తిగా సరఫరా ఆగిపోయింది.  

చెల్లింపులు లేకపోవడంతోనే.. చక్కెర, కందిపప్పు సరఫరా గుత్తేదారుకు భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో సరఫరా చేయలేమంటూ చేతులెత్తేసినట్లు సమాచారం. గత నెలలో డీడీలు చెల్లించిన డీలర్లకు సైతం  అందజేయలేదు. ఏ సరకుకు డీడీలు తీయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

సరకులు రాగానే అందజేస్తాం..
చక్కెర, కందిపప్పు జిల్లాకు చేరగానే వెంటనే దుకాణాలకు సరఫరా చేస్తాం. కొరత సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. లబ్ధిదారులందరికీ సరకులు అందేలా చర్యలు తీసుకుంటాం. - మోహన్‌బాబు, డీఎం, పౌరసరఫరాల సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని