logo

గదుల ఆధునికీకరణకు నిధుల కేటాయింపు

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం గదుల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేశామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో ఛైర్మన్‌ ఆధ్వర్యంలో బోర్డు సభ్యుల సమావేశం శనివారం జరిగింది.

Published : 25 Sep 2022 02:31 IST

ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం రూ.25 కోట్లు : తితిదే ఛైర్మన్‌

మాట్లాడుతున్న తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో భక్తుల సౌకర్యార్థం గదుల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేశామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో ఛైర్మన్‌ ఆధ్వర్యంలో బోర్డు సభ్యుల సమావేశం శనివారం జరిగింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య భక్తులకు వసతి సదుపాయం పెంపులో భాగంగా గదుల్లో రూ.7.20 కోట్లతో గీజర్లను ఏర్పాటు చేయడంతోపాటు ఫర్నిచర్‌, నందకంలోని 340 గదుల్లో నూతన ఫర్నిచర్‌ ఏర్పాటుకు రూ.2.45 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించామని తెలిపారు. వకుళమాత ఆలయం నుంచి జూపార్కు రోడ్డుకు కనెక్టివిటీ రింగ్‌రోడ్డును నిర్మించేందుకు రూ.30 కోట్లను కేటాయించామని పేర్కొన్నారు. తితిదే క్లాస్‌-4 ఉద్యోగులకు యూనిఫామ్‌ కోసం నగదుకు బదులుగా క్లాత్‌ కొనుగోలుకు రూ.2.50 కోట్లు కేటాయించినట్లు వివరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్‌ కళాశాలలో తరగతుల నిర్మాణానికి రూ.6.37 కోట్లు మంజూరుకు బోర్డు తీర్మానించిందని వివరించారు. భవిష్యత్‌లో తితిదే ఉద్యోగుల అవసరాల కోసం వడమాలపేట వద్ద 132 ఎకరాలను సేకరించేందుకు రూ.25 కోట్లు కేటాయించేందుకు బోర్డు సభ్యులు తీర్మానించారని వెల్లడించారు.

విభాగాల వారీగా ఈవో సమీక్ష
బ్రహ్మోత్సవాలకు విభాగాల వారీగా చేపట్టిన ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవనంలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి సమీక్షించారు. ప్రతి ఉద్యోగి బాధ్యతగా విధులు నిర్వహించాలని కోరారు. గరుడ సేవ నాడు మరింత అప్రమత్తంగా వ్యహరించాలని సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. జేెఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహకిశోర్‌, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్‌కుమార్‌, సీఈ  నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 జగదీశ్వర్‌రెడ్డి, తితిదే ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని