logo

ఆయన ఆదేశించారు.. వీరు మార్చేశారు

అది చిత్తూరు నగరంలోని మురకంబట్టు నుంచి చెర్లోపల్లి వరకు వెళ్లే బైపాస్‌ రహదారి.. తిమ్మసముద్రం రెవెన్యూ గ్రామం.. అక్కడ ఎకరా విలువ రూ.కోట్లలోనే ఉంటుంది.. దీనికి సమీపంలోనే నియోజకవర్గంలోని ఓ కీలక ప్రజాప్రతినిధి సమీప బంధువుకు డీకేటీ భూమి ఉంది.. తన భూమిలో వెంచర్‌ వేయాలనుకున్నారు.

Published : 27 Sep 2022 02:19 IST

కీలక ప్రజాప్రతినిధి బంధువు కోసం ఎఫ్‌ఎంబీ తారుమారు

నామమాత్రపు విచారణతో చేతులు దులుపుకొన్న వైనం

అది చిత్తూరు నగరంలోని మురకంబట్టు నుంచి చెర్లోపల్లి వరకు వెళ్లే బైపాస్‌ రహదారి.. తిమ్మసముద్రం రెవెన్యూ గ్రామం.. అక్కడ ఎకరా విలువ రూ.కోట్లలోనే ఉంటుంది.. దీనికి సమీపంలోనే నియోజకవర్గంలోని ఓ కీలక ప్రజాప్రతినిధి సమీప బంధువుకు డీకేటీ భూమి ఉంది.. తన భూమిలో వెంచర్‌ వేయాలనుకున్నారు. అయితే కొంత భూమిలో వెంచర్‌ వేస్తే గిట్టుబాటు కాదని ఆలోచించారు. చుట్టుపక్కల ఉన్న డీకేటీ, పట్టా భూములనూ కలిపేస్తే వెంచర్‌ను వేసేయొచ్చని భావించి చకచకా పావులు కదిపారు.

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలోని తిమ్మసముద్రం రెవెన్యూలో కీలక ప్రజాప్రతినిధి బంధువుకు గతంలో డీకేటీ పట్టా ఇచ్చారు. ఇక్కడ ఎకరా రూ.5 కోట్ల వరకు పలుకుతోంది. ఇప్పుడు అక్కడ వెంచర్‌ వేయాలని ప్రజాప్రతినిధి బంధువు భావించి ఈ ఏడాది జులైలో గ్రామ కొలతల పటంలో తాత్కాలికంగా (టెంటేటీవ్‌) మార్పు చేశారు. దీంతో అతని అనుభవంలోకి అదనంగా మరో 15 సెంట్లు చేరాయి. మరో వ్యక్తికి చెందిన మరికొంత భూమి కూడా సదరు ప్రజాప్రతినిధి బంధువు ఖాతాలో చేరింది. వీటికి సమీపంలో సుమారు రెండు ఎకరాల గయ్యాళి భూమి కూడా ఉండటంతో దాన్ని కూడా కలుపుకోవాలని ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికితోడు ప్రైవేటు వ్యక్తుల అనుభవంలో ఉన్న ఆరు ఎకరాలను నయానో భయానో లాక్కుందామనే ఆలోచన చేస్తున్నారు. మొత్తంగా 15 ఎకరాల్లో వెంచర్‌ వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎఫ్‌ఎంబీ మార్పుపై తమను సంప్రదించకుండానే మార్పులు చేశారని భూమి కోల్పోయిన బాధితులు ఆర్డీవో, కలెక్టర్‌ ఎదుట గోడు వినిపించారు. ఓ సర్వేయర్‌, కొందరు రెవెన్యూ సిబ్బంది ఇందులో కీలక పాత్ర పోషించారని వారు చెబుతున్నారు. సదరు ప్రజాప్రతినిధి బంధువుకు మేలు చేసేందుకు తమకు అన్యాయం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఎఫ్‌ఎంబీ మార్పుపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో అదేరోజు సాయంత్రం ఆగమేఘాలపై రెవెన్యూ, సర్వే సిబ్బంది కదిలినా ఆ తర్వాత మిన్నకుండిపోయారు. వారి మౌనానికి కారణమేంటనే చర్చ రెవెన్యూ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.

ఏం చేశారంటే..
పెద్ద వెంచర్‌ వేసేందుకు తొలుత ప్రజాప్రతినిధి బంధువు తన స్థలానికి సమీపంలోని భూమిపై కన్నేశారు. కీలక ప్రజాప్రతినిధి ఒత్తిడి తేవడంతో యంత్రాంగం మూడు దశాబ్దాలుగా ఉన్న గ్రామ కొలతల పటం (ఎఫ్‌ఎంబీ)ని మార్చేసింది.  భూములు కోల్పోయినవారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే చేయాలని ఆయన ఆదేశించడంతో నామమాత్రంగా విచారణ చేసినట్లు సమాచారం.

సర్వే చేసి.. స్థలం చూపాలని ఆదేశించాం
ఎఫ్‌ఎంబీ మార్పు వ్యవహారం మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరపాలని సర్వే శాఖ సిబ్బందికి సూచించాం. సర్వే చేసి బాధితులకు స్థలం చూపాలని ఆదేశించాం. మరోసారి ఈ అంశంపై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేస్తాం.

- రేణుక, ఆర్డీవో, చిత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని