logo

మృగరాజు తోడు.. మురిపాల రేడు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్పస్వామి యోగనరసింహుని అలంకారంలో సింహ వాహనంపై గురువారం దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి గంటల నుంచి 10 గంటల వరకు

Updated : 30 Sep 2022 05:53 IST

ఉదయం.. సింహవాహనంపై.. యోగనరసింహుడిగా, రాత్రి.. ముత్యపు పందిరిపై

రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలుడిగా దర్శనమిస్తున్న మలయప్పస్వామి

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్పస్వామి యోగనరసింహుని అలంకారంలో సింహ వాహనంపై గురువారం దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి గంటల నుంచి 10 గంటల వరకు నాలుగు మాడవీధుల్లో విహరించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు సింహంపై ఊరేగారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహం సమాన ప్రయత్నంలో ఉంటామని సింహవాహనం ద్వారా శ్రీవారు నిరూపించారు. రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై శ్రీ మలయప్పస్వామి వారు రుక్మిణి, సత్యభామ సమేతంగా వేణుగోపాలస్వామి అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీ చిన్నజీయర్‌ స్వామి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు రాములు, అశోక్‌కుమార్‌, జేెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిశోర్‌, సీఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు: శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనసేవ, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనసేవ జరగనుంది.

మూడు లోకాలు.. మురిసిన భక్తులు
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్థానిక కల్యాణవేదికలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, తితిదే వివిధ విభాగాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్న భక్తులు ప్రదర్శనశాలను సందర్శిస్తున్నారు.పిల్లలకు పురాణాల ప్రాశస్త్యాన్ని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువైన మూడులోకాల వైభవాన్ని వివరిస్తున్నారు. ఆయా ప్రదర్శన సెట్టింగ్‌ల వద్దకు చేరుకుని సెల్ఫీలు దిగుతూ తమ సెల్‌ఫోన్లలో భద్రపరుచుకుంటున్నారు.


శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారి వేషధారణలో కళాకారులు

అఘోరాల వేషధారణలో తూర్పుగోదావరి జిల్లా కళాకారుల నృత్యం

ఫల, పుష్ప ప్రదర్శన వద్ద సందర్శకుల సందడి

పాండురంగస్వామి వద్ద భక్త తుకారం భక్తిని పరిశీలిస్తున్న ఛత్రపతి శివాజీ సెట్టింగ్‌


8 గంటల్లో  శ్రీవారి దర్శనం

తిరుమల, న్యూస్‌టుడే: బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి ధర్మదర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. గురువారం సాయంత్రానికి భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 15 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి ఎనిమిది గంటల్లో స్వామివారి దర్శనం లభించనుందని తితిదే అధికారులు తెలిపారు.

పెరుగుతున్న రద్దీ..

గురువారం ఉదయం 10 గంటలకు వచ్చిన భక్తులకు గంటలోనే శ్రీవారి దర్శనం లభించింది. ఆ తర్వాత రద్దీ పెరిగింది. శనివారం గరుడ వాహనసేవ నేపథ్యంలో తమిళనాడు నుంచి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున బ్రహ్మోత్సవాల రద్దీ ఇకపై పెరిగే అవకాశం ఉంది. శ్రీవారిని బుధవారం 64,823 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.03 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని