logo

కొండచిలువలకు ఆవాసంగా కౌండిన్య

కుప్పం, పలమనేరు అడవి కౌండిన్యలో కొండచిలువలు అధికంగా ఉన్నాయని ఇటీవల సర్వే ద్వారా నిర్ధారణైంది. అందులో గుడుపల్లె మండలం నడుమూరు అడవిలో విపరీతంగా ఉండటం చూసి అధికారులే

Updated : 30 Sep 2022 06:16 IST

నడుమూరు అడవిలో అధికంగా సంచారం

కుప్పం, పలమనేరు అడవి కౌండిన్యలో కొండచిలువలు అధికంగా ఉన్నాయని ఇటీవల సర్వే ద్వారా నిర్ధారణైంది. అందులో గుడుపల్లె మండలం నడుమూరు అడవిలో విపరీతంగా ఉండటం చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. తమ ఇళ్ల పరిసరాల్లో సంచరిస్తున్నా గ్రామస్థులు అలవాటు పడిపోయారు. ఏడాది కాలంలో వ్యవసాయ పొలాల్లోకి వచ్చిన 100 కొండచిలువలను అటవీశాఖ అధికారులు, గ్రామస్థుల సహకారంతో పట్టుకుని అడవిలోకి వదిలిపెట్టారు. మిగిలిన అడవిలో అతి తక్కువగా కనిపించే ఇవి ఇక్కడే ఎందుకున్నాయన్న దానికి అనుకూల వాతావరణమే కారణమని అధికారులు భావిస్తున్నారు.

- న్యూస్‌టుడే, పలమనేరు

ఎక్కడెక్కడ ఉంటాయి..?

సహారా ఎడారికి దక్షిణాన, ఆఫ్రికాలోని ఉష్ణప్రాంతాల్లో ఇవి ఉంటాయి. మడగాస్కర్‌ ప్రాంతంలోనూ కనిపిస్తాయి. ఆసియా దేశాలైన పాకిస్థాన్‌, భారతదేశం, శ్రీలంక, నికోబార్‌ దీవులతో పాటు మయన్మార్‌, హాంకాంగ్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లోని వమలయా ప్రాంతాల్లో జీవిస్తాయి. అడవుల్లో నివసిస్తూ జంతువులను మింగి ఆకలి తీర్చు కుంటాయి. అలాంటి కొండ చిలువలు ఎక్కువగా మన జిల్లాలోని అడవిలో ఉండటం గమనార్హం. ఆ తరువాత శేషాచలం అడవిలో కూడా వీటి జాడ కనిపిస్తోంది.

వాటికి తోడు ఇవీ..
80 వేల హెక్టార్ల అడవిలో ప్రభుత్వం ఇప్పటికే 40 వేల హెకార్లను కౌండిన్య ఏనుగుల అభయారణ్యంగా ప్రకటించింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఏనుగులు 72 వరకు ఉన్నాయి. వీటితో పాటు చిరుతలు, ఎలుగబంట్లు, వేల సంఖ్యలో లేళ్లు ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు కొండ చిలువలు కూడా వేల సంఖ్యలోనే ఉన్నాయి. అది కూడా ఎక్కువ గుడుపల్లె మండలం నడుమూరు ప్రాంతంలోనే ఉండటం విశేషం.

అడవులకు రక్షణ
కొండచిలువలు ఉన్నాయని తెలిస్తే.. మేకలు, గొర్రెలు, పశువులను మేపేవారు అడవుల్లోకి రావడం మానేస్తారు. దాని వల్ల అడవిలోని వృక్షాలు, చెట్లు వృద్ధి చెందుతాయి. రకరకాల పాములు, విష సర్పాలను కూడా ఇవి తినేస్తాయి. ఎంతో అరుదుగా ఉండే వీటి సంఖ్య అనూహ్యంగా ఇక్కడ పెరగటం అటవీ అధికారులనే ఆశ్చర్యపరుస్తోంది. వ్యవసాయ పొలాల్లోకి ఇవి వస్తుండటంతో అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అవి విషసర్పాలు కావని, వాటిని పట్టుకుని అడవిలో వదిలేయాలని సూచిస్తున్నారు. దాంతో ప్రస్తుతం రైతులు కూడా వాటిని అడవిలో వదలడానికి సహకరిస్తున్నారు.

అనుకూల వాతావరణం
కొండచిలువలకు గుడుపల్లె అడవి ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉందని తెలుస్తోంది. అక్కడే వీటి కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిత్తూరు పశ్చిమ విభాగంలో మరెక్కడా వీటి కదలికలు కనిపించలేదు.

- మదన్‌మోహన్‌రెడ్డి, అటవీశాఖ అధికారి, కుప్పం


కొండచిలువల జీవితకాలం : 25-30 సంవత్సరాలు
వాటి పొడవు : 6-20 అడుగులు
జిల్లాలో వీటి సంఖ్య : 2000 వరకు
సగటు బరువు ఒక్కొక్కటి : 50-120 కిలోలు
ఇష్టపడే ఆహారం   :  కుందేళ్లు, కోళ్లు, మేకలు, పుట్టచెదలు, కోతులు, జింకలు
చనిపోయిన జంతువులు : గుడుపల్లె మండలంలో 20 మేకలు. మంగళం ప్రాంతంలో 30 కోళ్లను తినేశాయి


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని