logo

అత్యవసరం పేరుతో హారతి కర్పూరం

రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా సూళ్లూరుపేట పురపాలక సంఘంలో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. ఇక్కడి అధికారులు, కౌన్సిల్‌ సభ్యులు నిబంధనలకు తిలోదకాలు పలుకుతూ

Published : 30 Sep 2022 02:19 IST

పురపాలికలో నిబంధనలకు తిలోదకాలు
ఇష్టానుసారంగా రూ.లక్షల ఖర్చు

సూళ్లూరుపేట పురపాలక సంఘం కార్యాలయం

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా సూళ్లూరుపేట పురపాలక సంఘంలో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. ఇక్కడి అధికారులు, కౌన్సిల్‌ సభ్యులు నిబంధనలకు తిలోదకాలు పలుకుతూ రూ.లక్షల నిధులను హారతి కర్పూరంలా ఖర్చు చేస్తున్నారు. ఓవైపు అనిశా తనిఖీలు జరిగినా.. మరోవైపు విజిలెన్సు అధికారులు వివరాలు కోరినా, ఉన్నతాధికారులు తరచూ అక్షింతలు వేస్తున్నా.. తమకేమీ కాదులే.. అనే ధైర్యంతో స్థానిక అధికారులు ముందుకెళ్తున్నారు. తాజాగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వివిధ పనులకు కేటాయింపులు, చెల్లింపులు చేస్తూ శుక్రవారం కౌన్సిల్‌ సమావేశం పెట్టేందుకు సిద్ధమయ్యారు.

రాష్ట్రంలో 17 నగరపాలక సంస్థలు, స్పెషల్‌ గ్రేడ్‌ పురపాలక సంఘాలు 8, సెలక్షన్‌ గ్రేడు మున్సిపాలిటీలు ఆరు, గ్రేడ్‌-1 15, గ్రేడు-2 29, గ్రేడు-3 18, నగర పంచాయతీలు 31 వరకు ఉన్నాయి. వీటన్నింటిలో లేని పురపాలన సూళ్లూరుపేటలో మాత్రమే కొనసాగుతోంది. పురపాలక సంఘంలో ఏ విభాగంలో చూసినా లోపాలే! ఇటీవల అవినీతి నిరోధక శాఖ తనిఖీల్లో లోటుపాట్లు వెలుగు చూశాయి. ఫాగింగ్‌ యంత్రం మరమ్మతుకు గురై ఏడాదిగా మూలనపడినా అది వినియోగంలో ఉన్నట్లు డీజిల్‌ బిల్లులు దస్త్రాల్లో రాసేస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణంలో పురపాలక అధికారులు ఇచ్చిన నిబంధనలకు తిలోదకాలు పలికి ఇష్టానుసారంగా నిర్మించేస్తున్నారు. ఇదంతా పుర అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పురపాలక సంఘంలో ప్రతి విభాగానికి ఓ అధికారి ఉండగా వారుచేసే పనులను ఇతరులకు అప్పగించడం ఇక్కడ షరామామూలే.. ఎవరైనా కొత్తగా వచ్చిన ఉద్యోగులు వీరి చెప్పినట్లు వినకుంటే వారిని పొమ్మనకుండానే పొగపెట్టం వంటివి చేస్తున్నారు.

పనుల విషయానికి వస్తే..
పురపాలక సంఘంలో అత్యవసర పనులను యుద్ధప్రాతిపదికన చేసుకుని, అనంతరం కౌన్సిల్‌ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే ఇక్కడ అత్యవసరం పేరుతో ఇతర పనులు చేస్తూ.. నిధులను ఖర్చు చేసేస్తున్నారు. ఇలా రూ.లక్ష నుంచి రూ.కోట్ల వరకు వ్యయం చేసేస్తున్నారు. అత్యవసరమంటే.. వరదలు, మరేతర ముప్పు వచ్చి అంధకారంలో ఉన్నప్పుడు, తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న సందర్భాల్లో సంబంధిత పనులు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇందుకు భిన్నంగా ఇక్కడ పనులు చేసి, బిల్లులు పొందుతున్నారు. శుక్రవారం కౌన్సిల్‌ సమావేశం జరగనుండగా ఇందులో 16 అంశాలను అజెండాలో పొందుపర్చారు. అయితే వీటిలో 14 పనులు అత్యవసరం కింద చేసినట్లు చూపారు. అందులో రోడ్లు వేయడం, తదితర పనులు ఉన్నాయి. వీటిని కౌన్సిల్‌ సమావేశంలో ర్యాటిఫై కింద ఆమోదం పొందేందుకు అజెండాలో చేర్చారు.

సెక్షన్‌ 49 ఏమి చెబుతుందంటే..
ఛైర్‌పర్సన్‌కు సంబంధించి సెక్షన్‌ 49 అత్యవసర అధికారాలేమిటో వివరిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా అమలును నిర్ద్దేశించవచ్చు. ప్రస్తుతం ఆ కేటగిరిలో లేనివాటికీ ముందస్తు ఉత్తర్వులతో పనులు చేయించారు.

అత్యవసర పనులకు మాత్రమే చేయాలి
పురపాలక సంఘాల్లో అత్యవసరమైన పనులకు ఛైర్మన్‌ ముందస్తు ఉత్తర్వులతో నిధులు ఖర్చుచేసే వీలుంది. అయితే తాగునీటి అవసరాలు, ఏదైనా విపత్తులు వచ్చిన సందర్భాల్లోనే ఇది చేయాలి. పనుల వివరాలు పరిశీలిస్తాం.

- శ్రీనివాసరావు, ఆర్డీ, గుంటూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని