logo

‘ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకుంటున్నారు’

రాష్ట్రం అవినీతిమయమైందని.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు దోచుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు డా.చింతా మోహన్‌ ఆరోపించారు.

Published : 30 Sep 2022 02:19 IST

మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌

సూళ్లూరుపేట: రాష్ట్రం అవినీతిమయమైందని.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు దోచుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు డా.చింతా మోహన్‌ ఆరోపించారు. ఆయన గురువారం సూళ్లూరుపేటలో పర్యటించారు. ర.భ.శాఖ అతిథి భవనంలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలకు ప్రజల్లో గౌరవం లేదని, ముఖ్యమంత్రి వద్దా అదే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పైసలివ్వందే పనులు జరగడం లేదని, ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారని, రాష్ట్రంలో ఈదఫా వైకాపాకు 26 సీట్లు వస్తే ఎక్కువని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వంపై ఉపాధ్యాయుల నుంచి ఎక్కువ వ్యతిరేకత ఉందన్నారు. ఆయన వెంట నియోజకవర్గ ఇన్‌ఛార్జి తీగల భాస్కర్‌, నేతలు రాజేంద్ర నాయుడు, శివకుమార్‌, కేఎం రత్నం, చంద్రశేఖర్‌, పంట శ్రీనివాసులురెడ్డి, వెంకట కృష్ణయ్య, గణపయ్య పాల్గొన్నారు. * సత్యవేడు: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రజలను మోసం చేస్తూ రాష్టాన్ని అనాథగా మార్చేసిందని మాజీ ఎంపీ చింతామోహన్‌ మండి పడ్డారు. గురువారం స్థానిక అటవీశాఖ అతిథిగృహంలో కాంగ్రెస్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసలు పులివెందులలో జగన్‌ గెలవడం సాధ్యం కాదని, 175 సీట్లు గెలుచుకుంటారన్నది సీఎం జగన్‌ భ్రమ అని జోస్యం చెప్పారు. స్పీకర్‌ను ఎమ్మెల్యేలను తిట్టడం ఏమిటని.. ఇది ప్రజాస్వామ్యమా.. సొంత జాగీరా అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. తాత్కాలిక ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ యూనివర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెట్టడంతో ఒరిగిందేమీ లేదన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ పీసీసీ ప్రతినిధి రాజేంద్రనాయుడు, పురుషోత్తం, రామూర్తినాయుడు, రఘునాథరెడ్డి, లియో, రమేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని