logo

Super Star Krishna: వియ్యం.. సినీ బంధం

సూపర్‌స్టార్‌ కృష్ణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో అనుబంధం ఉంది. సినిమా షూటింగుల సమయంలో.. చిత్రాల విజయోత్సవ కార్యక్రమాల్లో.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి జిల్లాకు వచ్చారు. కుమార్తెను గల్లా జయదేవ్‌కు ఇచ్చి పెళ్లి చేయడంతో కుటుంబ పరంగా దగ్గరయ్యారు.

Updated : 16 Nov 2022 09:27 IST

సూపర్‌స్టార్‌  కృష్ణకు  చిత్తూరుతో అనుబంధం


చిత్తూరు(జడ్పీ), రేణిగుంట, పాకాల, నాగలాపురం, యర్రావారిపాళెం, తవణంపల్లి, న్యూస్‌టుడే: సూపర్‌స్టార్‌ కృష్ణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో అనుబంధం ఉంది. సినిమా షూటింగుల సమయంలో.. చిత్రాల విజయోత్సవ కార్యక్రమాల్లో.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి జిల్లాకు వచ్చారు. కుమార్తెను గల్లా జయదేవ్‌కు ఇచ్చి పెళ్లి చేయడంతో కుటుంబ పరంగా దగ్గరయ్యారు. 1976లో సొంత బ్యానర్‌ పద్మాలయ సంస్థ పేరుతో ‘పాడి పంటలు’ చిత్రం రిలీజ్‌ కాగా.. చిత్తూరు ప్రతాప్‌ థియేటర్‌లో అర్ధ శత దినోత్సవాన్ని అభిమాన సంఘం పెద్ద ఎత్తున నిర్వహించగా కృష్ణ పాల్గొన్నారు. అనంతరం పలమనేరు, మదనపల్ల్లెలో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి మాజీ ఎంపీ రాజగోపాలనాయుడు మృతి చెందగా.. నిర్వహించిన పెద్దఖర్మకు తవణంపల్లె మండలం దిగువ మాఘం గ్రామానికి విచ్చేశారు. అమరరాజ ట్రస్ట్‌ తరఫున సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావును దిగువమాఘంలో సన్మానించారు. కార్యక్రమానికి కృష్ణ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైపాల్‌రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు.

రేణిగుంటతో..

కృష్ణకు రేణిగుంట మండలంతో అనుబం ధం ఉంది. ముఖ్యంగా అమరరాజా పరిశ్రమలతో ఆయనకు మొదటి నుంచి అనుబంధం ఎక్కువ. ఆ పరిశ్రమ ఎండీ గల్లా జయదేవ్‌ కృష్ణ పెద్ద అల్లుడు. 1991లో ఆయన పెద్ద కుమార్తె పద్మావతిని గల్లా జయదేవ్‌కు ఇచ్చి వివాహం చేశారు. 1992లో కరకంబాడీలోని అమరరాజా పరిశ్రమల్లో ఒక ప్లాంట్‌ను ఆయన, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.

నాగలాపురంలో 15 రోజులు..

నాగలాపురానికి చెందిన వైద్యులు టీవీ మోహనరంగంరెడ్డి తన మిత్రులతో కలిసి కథానాయకుడు కృష్ణతో ‘చెప్పిందే చేస్తా’ పేరిట సినిమాను నిర్మించారు. నాగలాపురం, పరిసర ప్రాంతాల్లో దీన్ని చిత్రీకరించారు. ఆ సమయంలో కృష్ణ 15 రోజులపాటు నాగలాపురంలోని మోహనరంగంరెడ్డి నివాసంలో ఉన్నారు.

దిగువమాఘంలో..

తవణంపల్లి మండలం దిగువమాఘంతో కృష్ణకు అనుబంధం ఉంది. గల్లా అరుణకుమారి తండ్రి రాజగోపాలనాయుడు మరణించినపుడు కృష్ణ దిగువమాఘం గ్రామానికి వచ్చారు. ప్రథమ వర్ధంతి సమయంలో రాజగోపాలనాయుడు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ సమయంలో హీరో నాగేశ్వరరావు సైతం దిగువమాఘం వచ్చారు.

ఎన్నికల ప్రచారంలో..

1994లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కృష్ణ విమానాశ్రయానికి వచ్చి రేణిగుంట వైపు రావడంతో అభిమానుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఏలూరులో కృష్ణ ఎంపీగా పోటీ చేసిన సమయంలో ప్రచారం కోసం తాము ఇక్కడి నుంచి వెళ్లిన సందర్భాన్ని అభిమానులు గుర్తు చేసుకున్నారు. 1991లో చిత్తూరు కాంగ్రెస్‌ ఎంపీగా పోటీచేసిన జ్ఞానేంద్రరెడ్డికి మద్దతుగా కృష్ణ చిత్తూరులో ప్రచారం చేయడంతో పాటు గాంధీ విగ్రహం వద్ద ప్రసంగించారు.

పాకాలలో ‘రైతుభారతం’  

త్రిపురనేని మహారథి నిర్మాణ సారథ్యంలో 1994లో కృష్ణ, వాణీ విశ్వనాథ్‌ జోడీగా నిర్మించిన రైతు భారతం చిత్ర షూటింగ్‌ మూడు రోజులపాటు పాకాల న్యూకాలనీలోని గ్రంథాలయం, సత్యమ్మగుడి పరిసరాల్లో జరిగింది. మాజీ సర్పంచి రాయపాటి శ్రీనివాసులునాయుడు ఇంట్లో ఆయన బస చేశారు. స్థానిక థియేటర్‌ యజమాని వెంకటాద్రిబాబు తదితరులు షూటింగ్‌కు సహకరించారు. 1980లో కృష్ణ, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించిన బంగారు బావ చిత్రానికి కథనందించిన కలువకొలను సదానంద పాకాలకు చెందిన వ్యక్తి కావడం మరో విశేషం.

తలకోనలో సినిమా షూటింగ్‌

1995లో వచ్చిన తెలుగువీర లేవరా, 1999లో సుల్తాన్‌ సినిమాల చిత్రీకరణలో భాగంగా  ఆయన తలకోన వచ్చారు. ఇక్కడ కృష్ణ, శ్రీదేవి నటించిన కంచుకాగడా చిత్రీకరణ జరిగింది. అప్పుడు తిరుపతిలో బస చేసి రోజూ షూటింగ్‌కు తలకోన వెళ్లేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని