logo

వ్యాపార కేంద్రంలా మారిన తితిదే

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కనబడటం లేదని, అదో వ్యాపార కేంద్రంగా తయారైందని దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ముక్తకంఠంతో ఆరోపించారు.

Updated : 24 Nov 2022 06:22 IST

ఆస్తులుంటేనే దర్శన భాగ్యమా?
30 మంది పీఠాధిపతుల ఆందోళన  

మాట్లాడుతున్న శ్రీయోగిపీఠం పీఠాధిపతి శ్రీయోగి అతిదేశ్వరానంద పర్వతస్వామి

చంద్రగిరి, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కనబడటం లేదని, అదో వ్యాపార కేంద్రంగా తయారైందని దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ముక్తకంఠంతో ఆరోపించారు. విశ్వశాంతి కోసం యాగాలు పూర్తి చేసిన స్వామీజీలు శ్రీవారి దర్శనార్థం వచ్చి తిరుమలను స్వయంగా పరిశీలించారు. అనంతరం శ్రీనివాస మంగాపురంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన శ్రీయోగిపీఠం పీఠాధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి మాట్లాడుతూ.. తిరుమలలో రాజకీయ నేతలు, ఆస్తులు ఉన్నవారికి మాత్రమే స్వేచ్ఛగా దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతోందని ధ్వజమెత్తారు. అలాగైతే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దించుతామని స్పష్టం చేశారు. తిరుమలలో మార్పులు జరగకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాథిపతుల ఆశీర్వాదంతో త్వరలో ఏపీలో కొత్త పార్టీని స్థాపిస్తామన్నారు. స్వామీజీల దగ్గర కూడా వసూళ్లకు పాల్పడటం బాధాకరమన్నారు. దర్శన ఏర్పాట్ల కోసం ముందుగానే లెటర్‌ ద్వారా తెలియజేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామీజీలు ఎవరైనా సరే ఎలాంటి ఏర్పాట్లు చేయలేమని స్పష్టం చేయడం దారుణమన్నారు. ఆస్తులు ఉంటేనే విలువలిస్తామనడం కచ్చితంగా వ్యాపారమే అవుతుందన్నారు. సామాన్య భక్తులు స్వేచ్ఛగా వెళ్లి స్వామిని దర్శించుకునే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగ సభ పెట్టి తితిదేలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ధ్వజమెత్తుతామని తెలిపారు. స్వామీజీలకు, ధర్మప్రచారాలకు, హైందవ సంఘాలకు దర్శన భాగ్యం కల్పించాలని డిమాండు చేశారు.

వివరాలు ఆరా.. తిరుమల: శ్రీవారి ఆలయం వద్ద స్వామీజీల గుంపును పరిశీలించిన తితిదే భద్రతా సిబ్బంది వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. తమకు మహద్వారం ద్వారా తితిదే మర్యాదాలతో శ్రీవారి దర్శనానికి అనుమతించాలని కోరారు. తమకు ఎలాంటి సమాచారం లేదని, అనుమతించలేమని స్పష్టం చేశారు. దీంతో స్వామీజీలు శ్రీవారిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారు.

Read latest Chittoor News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts