logo

నాడు-నేడు అవస్థలు చూడు

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు రెండో దశ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడ పర్యవేక్షణ కొరవడటం.. పనులు చేపట్టడానికి గుత్తేదారులు ఆసక్తి చూపించకపోవడంతో ఆలస్యమవుతోంది.

Published : 24 Nov 2022 03:32 IST

రెండో దశ పనుల్లో తీవ్ర జాప్యం
వర్షాలతో తడుస్తున్న విద్యార్థులు

ఉరుస్తున్న పెళ్లకూరు మండలం నెలబల్లి జడ్పీ ఉన్నత పాఠశాల

గూడూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు రెండో దశ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడ పర్యవేక్షణ కొరవడటం.. పనులు చేపట్టడానికి గుత్తేదారులు ఆసక్తి చూపించకపోవడంతో ఆలస్యమవుతోంది. ప్రభుత్వం సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతిలో సేకరించే పరికరాలు మాత్రం మందుగానే వస్తున్నాయి. ఇక్కడ జరగాల్సిన పనులు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి. విలీన పాఠశాలల్లో గదుల కొరత వేధిస్తోంది. వర్షాలతో ఎక్కువ పాఠశాలలు ఉరుస్తుండటంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో రెండో దశ నాడు-నేడు కింద 2,292 బడుల్ని ఎంపిక చేశారు. ఇందులో 2,284 పాఠశాల్లో హడావుడిగా పనులు మొదలు పెట్టారు. రూ.810 కోట్లు నిధులు మంజూరు కాగా ఇప్పటి వరకు రూ.159 కోట్లు విడుదల చేశారు. ఎంపిక చేసిన జడ్పీ ఉన్నత పాఠశాలలకు నిధులు ఎక్కువగా మంజూరు కాగా.. పునాదులు తీసి పనులు చేపడుతున్నారు. స్టీల్‌ కొనుగోలు చేసి బెండింగ్‌ చేసి సిద్ధం చేసి ఉంచారు. నెల రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పనులు ఆగిపోయాయి. అంతకు ముందు పనులు మందకొడిగానే సాగాయి. తాజా పరిస్థితుల్లో ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంది. ఎక్కువ బడుల్లో పూర్తయ్యే పరిస్థితులు కానరావడంలేదు. కొన్ని చోట్ల బడులు పాత వాటిని కొత్త రంగులేస్తున్నారు. పెళ్లకూరు మండలం నెలబల్లి జడ్పీఉన్నత పాఠశాలలో 1986లో నిర్మించిన భవనానికి కొత్త హంగులేర్పాటు చేయనున్నారు. ఈ భవనం పైకప్పు ఉరుస్తోంది.. అయినా దీనికి హంగులు సిద్ధం చేస్తున్నారు.


* గూడూరు మండలంలో రెండో దశ నాడు-నేడు కింద 33 బడుల్ని ఎంపిక చేశారు. ఇందులో అయ్యవారిపాళెం జడ్పీకి రూ.24.94 లక్షలు, దివిపాళెంకు రూ.25.05 లక్షలు, విందూరుకు రూ.23.50 లక్షలు విడుదల చేశారు. ఇతర బడులకు నామమాత్రంగానే నిధులొచ్చాయి. ఎంపిక చేసిన బడుల్లో పనులు ప్రారంభం కాగా కొన్ని చోట్ల పునాదులు దాటలేదు. ఎక్కువ చోట్ల బడులు పాత వాటి స్థానంలో శ్లాబ్‌లు బాగు చేసి కొత్త హంగులద్దుతున్నారు.


* కుప్పం మండలంలో 93 ప్రభుత్వ బడులు ఎంపిక చేసిన ప్రభుత్వం రూ.5.93 కోట్లు మంజూరు చేసింది. వాసనాడు జడ్పీకి రూ.29.70లక్షలు, కేడీపల్లి జడ్పీకి రూ.22.07 లక్షలు, కనగుడి జడ్పీకి రూ.24.75 లక్షలు విడుదల చేసింది. ఈ పాఠశాలల్లో పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. వస్తు సామగ్రి సిద్ధం చేసుకున్న నిర్మాణదారులు వర్షాలతో ఆపేశారు. ఈ మండలంలో ఎక్కువ బడులకు  రూ.లక్ష నుంచి రూ.2 లక్షల మేర విడుదల చేశారు.


* నాయుడుపేట మండలంలో 47 పాఠశాలలకు రూ.2.53 కోట్లు నిధులు నాడు నేడు కింద మంజూరయ్యాయి. ఇక్కడ ఎల్‌.ఎ.సాగరం జడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.24.30 లక్షలు, కాపులూరుకు రూ.21.86 లక్షలు, పూడేరు జడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.21.43 లక్షలు విడుదల కాగా.. తరగతి గదులకు పునాదులు తీసి పెట్టారు. స్టీల్‌ కొనుగోలు చేసిన నిర్మాణదారులు పునాదులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.


వేగంగా చేపట్టడానికి చర్యలు

- శేఖర్‌, జిల్లా విద్యాధికారి, తిరుపతి

పాఠశాల యాజమాన్య కమిటీలతో పనులు వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్ర స్థాయిలో ఇంజినీరింగ్‌ సహాయకులతో పర్యవేక్షణ ఉంటోంది. వర్షాలతో కాస్త ఆలస్యం అవుతోంది. అయినా లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని