logo

పేదల ఇళ్ల మాటున ఇసుక దోపిడీ

అధికార అండ ఉంటే ఏదో ఒక రూపంలో కాసులు దండు కోవచ్చనడానికి పూతలపట్టు మండలం వావిల్‌తోట ఇసుక రేవును పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది.

Published : 25 Nov 2022 01:32 IST

వావిల్‌తోట రేవు నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా
కీలక ప్రజాప్రతినిధి అండతో అడ్డగోలు వ్యవహారం

నదిలో ఇసుకను ట్రాక్టర్లలో పోస్తున్న పొక్లెయిన్‌

అధికార అండ ఉంటే ఏదో ఒక రూపంలో కాసులు దండు కోవచ్చనడానికి పూతలపట్టు మండలం వావిల్‌తోట ఇసుక రేవును పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా ముసుగులో బహిరంగంగా ఇసుక విక్రయిస్తున్నారు. రోజుకు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. పొరుగు సేవల సిబ్బంది ఇద్దరు ఉన్నా.. నియోజకవర్గంలోని ఓ కీలక ప్రజాప్రతినిధి, అధికార పార్టీకే చెందిన మరో మండల స్థాయి నాయకుడు చక్రం తిప్పుతుండటంతో మాట వినకుంటే బదిలీ చేస్తారని వారూ మిన్నకుండిపోతున్నారు. ఫలితంగానే ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, పూతలపట్టు: పేదలకు ఇళ్ల నిర్మాణానికి 40 కిలోమీటర్లలోపు ఇసుక రేవులు ఉంటే లబ్ధిదారులు అక్కడకు వెళ్లి ఉచితంగా తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అంతకన్నా ఎక్కువ దూరం ఉంటే ఇసుక తవ్వకం, విక్రయాలు చేస్తున్న జేపీ సంస్థే స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పూతలపట్టు మండలం నీవా నది పరివాహకంలోని వావిల్‌తోట రేవులో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తీసుకునేందుకు అధికారులు అనుమతించారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఇచ్చిన కూపన్లు చూపించాలని పేర్కొన్నారు. నాడు- నేడు పనులకు మాత్రం స్టాక్‌ పాయింట్‌ నుంచి తరలించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు భిన్నంగాఈ రీచ్‌లో కార్యకలాపాలు జరుగుతున్నాయి.


 ఒకే కూపన్‌పై నాలుగైదు సార్లు

సమాధుల మధ్య ఏర్పాటు చేసుకున్న దారి

పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఇచ్చిన ఒకే కూపన్‌పై నాలుగైదు ట్రాక్టర్ల మేర ఇసుకను తరలిస్తున్నారు. ఇటువంటి అక్రమాలు జరగకుండా రీచ్‌ వద్ద అవసరమైన సిబ్బంది, పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించినా ఇవేవీ అమలు కావడంలేదు. నామమాత్రంగా ఇద్దరు సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.


 రోజుకు 300కుపైగా ట్రిప్పులుతరలిస్తూ..

జగనన్న కాలనీల్లోని ఇళ్ల పేరిట ఇతరులకూ ఇసుక విక్రయిస్తున్నారు. రోజుకు 40కుపైగా ట్రాక్టర్లతో రోజుకు 300కుపైగా ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు. ఇందులో 40 శాతం వరకే అధికారికంగా ఉంటున్నాయని, మిగిలిన 60 శాతం అక్రమంగా తోలుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.4వేలు- రూ.5వేలు వసూలు చేస్తున్నారని అంటున్నారు.


ప్రజలు ప్రశ్నిస్తున్నా..

ఒకట్రెండు సందర్భాల్లో సమీప గ్రామస్థులు అభ్యంతరం తెలపడంతో అధికారులు, సిబ్బంది ఈ వ్యవహారాన్ని ప్రశ్నించారు. దీంతో పూతలపట్టు నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి తాను చెప్పినట్లు వినాల్సిందేనని హెచ్చరించారు. లేదంటే బదిలీలు తప్పవని స్పష్టం చేశారు. ఈ క్రమంలో వారు కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

చర్యలు తీసుకుంటాం: పూతలపట్టు మండలం వావిల్‌తోట రీచ్‌లో ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే ఇసుక తవ్వుకోవాలని అనుమతులు ఇచ్చారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

రిషాంత్‌రెడ్డి, ఎస్పీ

Read latest Chittoor News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని