logo

ఇళ్లు.. అనుమానాల లోగిళ్ళు

ఇవి పేదల కోసం శ్రీకాళహస్తి రాజీవ్‌నగర్‌ వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లు. నిర్మించి ఏళ్లు గడిచినా మరికొన్ని పనులు ముందుకు సాగక కట్టిన నిర్మాణాలు శిథిలమైపోతున్నాయి.

Published : 25 Nov 2022 02:09 IST

వచ్చే ఏడాదే పంపిణీ
కొన్ని బ్లాకుల వద్దే అభివృద్ది
శిథిలమైపోతున్న నిర్మాణాలు

వర్షాలకు తుప్పుపట్టిన ఇనుము

ఇవి పేదల కోసం శ్రీకాళహస్తి రాజీవ్‌నగర్‌ వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లు. నిర్మించి ఏళ్లు గడిచినా మరికొన్ని పనులు ముందుకు సాగక కట్టిన నిర్మాణాలు శిథిలమైపోతున్నాయి. వర్షాలకు పాచిపట్టడమే కాకుండా శ్లాబ్‌ ఏర్పాటుకు సిద్ధం చేసిన ఇనుప కమ్మీలు తుప్పుపట్టి  నిరుపయోగంగా మారుతున్నాయి.

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: స్థానిక రాజీవ్‌నగర్‌ వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు మళ్లీ కాస్తంత వేగం అందున్నాయి. ప్రస్తుతం ఏడు బ్లాకులకు మాత్రం వైకాపా రంగులు వేయడమే కాకుండా అంతర్గత అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బ్లాకుల మధ్య రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తు స్తంభాల ఏర్పాటు పనులు చేపట్టారు. అంతర్గత రోడ్లను ఓ వైపు శ్రీకాళహస్తి-పిచ్చాటూరురోడ్డుకు, మరో వైపున దేవునిబాట రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు.

రాజీవ్‌నగర్‌ వద్ద నిర్మాణం పూర్తయిన గృహాలకు వేసిన వైకాపా రంగులు

మళ్లీ.. మార్చికేనా..?

రూ.500 చెల్లించి ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో వారికి ఇళ్ల నిర్మాణాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పక్కా ఇళ్లు ఈ ఏడాది ఆఖరుకు అందుబాటులోకి వస్తాయని లబ్ధిదారులు ఆశపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్చి వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తయినవి కేవలం 816 ఇళ్లు మాత్రమే. తొలి విడతలో నిర్మించాల్సినవి 2,144 ఇళ్లు కాగా మిగిలిన కాలం మూడు నెలలు మాత్రమే.

శిథిలమైపోతున్న కట్టడాలు

పంపిణీపైనే సందేహాలురాజీవ్‌నగర్‌ సమీపంలో దాదాపు 20 బ్లాకులకు పైగా నిర్మాణాలు జరిగాయి. వీటిల్లో కేవలం ఏడు బ్లాకులకు రంగులు వేశారు. అంతర్గత రహదారి పనులు చేస్తున్నారు. సిద్ధమవుతున్న ఇళ్లను ఏ విధంగా.. తొలి ప్రాధాన్యం ఎవరికి ఇస్తారన్నది లబ్ధిదారుల్లో పలు సందేహాలకు తావిస్తోంది. అయినవాళ్లకు ఆకుల్లో.. కాని వాళ్లకు కంచాల్లో అన్నట్లు.. తొలి ప్రాధాన్యం ఏ విధంగా అనే విషయమై లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.

తొలి విడత దరఖాస్తులు: 4,064
తొలి విడత నిర్మాణాలు:  2144
పట్టాల పంపిణీ: 3000
రిజిస్ట్రేషన్‌ చేయించింది: 1500
పూర్తయిన నిర్మాణాలు:  816

అర్హులైన వాళ్లందరికీ ఇళ్లు

అర్హులైన వారందరికీ టిడ్కో ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. ప్రస్తుతం తొలి కేటగిరిలోని ఇళ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. పూర్తయిన తర్వాత రెండో కేటగిరి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురానున్నాం.

బాలాజీనాయక్‌, కమిషనర్‌, శ్రీకాళహస్తి పురపాలక సంఘం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని