logo

వనిత.. పాల ఘనత

ఉమ్మడి చిత్తూరు జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది.. పాడి పరిశ్రమే. వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా 90 శాతం మంది రైతులు పశుపోషణను ఎంచుకుని.. జీవనం సాగిస్తున్నారు.

Updated : 26 Nov 2022 06:34 IST

పశుపోషణే ప్రధాన ఆర్థిక వనరు

- న్యూస్‌టుడే, చిత్తూరు,తిరుపతి (వ్యవసాయం), పాకాల, పుత్తూరు, చంద్రగిరి

పాకాల మండలం నడింపల్లెలో పాలు పోస్తున్న మహిళ

ఉమ్మడి చిత్తూరు జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది.. పాడి పరిశ్రమే. వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా 90 శాతం మంది రైతులు పశుపోషణను ఎంచుకుని.. జీవనం సాగిస్తున్నారు. పాడినే నమ్ముకొని ఎంతో మంది మహిళలు కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. నేడు జాతీయ పాల దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

ఉమ్మడి చిత్తూరు జిల్లా కరవుకు నిలయం. పంటల సాగుకు వర్షమే ఆధారం. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో జిల్లా రైతులను పాడి పరిశ్రమే ఆదుకుంది. పశుపోషణతో కరవును జయించారు. పల్లెల్లో ఎటుచూసిన గోకులాలు కన్పిస్తాయి. జిల్లాల విభజన తర్వాత ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో రోజుకు 500 లీటర్ల కన్నా ఎక్కువ పాల ఉత్పత్తి సాధిస్తున్న గ్రామాలు 442 ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

150 కుటుంబాలు.. 450 పశువులు

చిత్తూరు నగర పరిధి కన్నికాపురం పాలవెల్లువకు ప్రసిద్ధి. ఇక్కడ 105 కుటుంబాలు ఉండగా 450 పశువులున్నాయి. రోజుకు పాల ఉత్పత్తి 850-900 లీటర్లు. ఊరంతా కలిసి నెలకు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వ్యాపారం చేస్తోంది. ఏడాదికి సగటున రూ.1.40 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా.

మహిళలే యజమానులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సన్న, చిన్నకారు మహిళా రైతుల సంక్షేమానికి ఏర్పాటైందే శ్రీజ మహిళా యాజమాన్య పాల ఉత్పత్తిదారుల సమాఖ్య.  దేశంలో తొలి మహిళా పాల ఉత్పత్తిదారుల సంస్థగా నమోదైంది. 2014లో తిరుపతి కేంద్రంగా ప్రారంభించారు. 27 మంది వాటాదారులతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం లక్ష మంది చేరారు. శ్రీజ సంస్థ రోజూ 75 పాలశీతలీకరణ కేంద్రాలతో 2.5 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. 2021-22 ఆర్థికసంవత్సరంలో రూ.720 కోట్ల టర్నోవర్‌ సాధించింది.

ఉత్పత్తులపై శిక్షణ

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య వర్సిటీ ఆవరణలోని డెయిరీ టెక్నాలజీ కళాశాలలో పాల ఉత్పత్తులపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాల వినియోగం పెంచేందుకు కళాశాలలో పాలకోవా, రసగుల్లా, ఐస్‌క్రీం, పన్నీర్‌, ద్రాక్షరసం, నెయ్యి తదితర ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తుంటారు. గ్రామీణ మహిళలు, ఔత్సాహిక యువతకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.

ముగ్గురు బిడ్డల ఉన్నత చదువులు

పుత్తూరు మండలం శిరుగురాజుపాళెం పంచాయతీలో పాడి పరిశ్రమపై ఆధారపడి దాదాపు 50 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గ్రామానికి చెందిన గంగాధరం, ఉమాసుందరి 12 పాడి ఆవులతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి పెద్ద కుమారై ప్రవీణ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె కవిత బీఎస్సీ, బీఈడీ; కుమారుడు కిరణ్‌కుమార్‌ ఏజీ బీఎస్సీ పూర్తి చేశారు. వీరంతా పాల ద్వారా వచ్చే ఆదాయంతోనే చదువుకున్నారు.

రైతుకు చెందిన షెడ్డులో సంకరజాతి పాడి ఆవులు
కొండకిందపల్లి.. పాలవెల్లి

పాకాల మండలం పదిపుట్లబైలు పంచాయతీ కొండకిందపల్లిలో 70 కుటుంబాలు పాడి, పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. గ్రామంలో 135 పాడి ఆవులుండగా రెండు పాలసేకరణ కేంద్రాలున్నాయి. రోజుకు సగటున 450 లీటర్ల పాలను ఇక్కడి మహిళలు విక్రయిస్తున్నారు.

కొత్తశానంబట్ల గ్రామం

80 శాతం మంది పాడి రైతులే..
చంద్రగిరి మండలం శానంబట్లలో 621 కుటుంబాలు ఉండగా.. వీరిలో పాడిరైతులు 950 మంది. వెయ్యికిపైగా పాడిపశువులు ఉన్నాయి. రోజుకు 4 వేల నుంచి 5 వేల లీటర్ల వరకు పాలు ఉత్పత్తి చేస్తున్నారు. పంచాయతీలో 80 శాతం మంది పాడిరైతులే ఉన్నారు.


చిత్తూరు, తిరుపతి పాల ఉత్పత్తులు ఇలా..
జిల్లా పశువుల సంఖ్య పాల దిగుబడి(రోజుకు)
లక్షల్లో.. లక్షల లీటర్లలో
చిత్తూరు 5.20 18  
తిరుపతి 5.29   7.15

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని