logo

నీటిశుద్ధి యంత్రాలున్నాయంతే..!

విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకుతోడు విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, అభ్యసన సామ ర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటిస్తోంది..

Updated : 26 Nov 2022 06:38 IST

మరమ్మతులకు గురైనా స్పందించని నిర్వాహకులు

ఇళ్ల నుంచే నీళ్లు తెచ్చుకుంటున్న విద్యార్థులు

1213 - నాడు-నేడు తొలివిడత ఎంపికైన పాఠశాలలు

రూ.424 కోట్లు - చేసిన వ్యయం


ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకుతోడు విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, అభ్యసన సామ ర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటిస్తోంది.. ఇందుకోసం కోట్లాది రూపా యలు ఖర్చు చేస్తున్నామని, ఎన్ని నిధులు వెచ్చించ డానికైనా సిద్ధంగా ఉన్నామని వెల్లడిస్తోంది.. ఇన్ని నిధులు వెచ్చించినా క్షేత్రస్థాయిలో మాత్రం కొన్నిచోట్ల సమస్యలు తీరడంలేదు.

నాడు- నేడులో భాగంగా పాఠశాలల్లో నెలకొల్పిన నీటి శుద్ధి యంత్రాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు.. వాటిని బాగు చేయించినా కొన్ని రోజులకే మూలన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ సమస్య గురించి ఏజెన్సీ నిర్వాహకులకు ప్రధానోపాధ్యాయులు చెప్పినా వారి నుంచి సమాధానం రావడంలేదని అంటున్నారు. రేపు మాపు అంటున్నారే తప్పా పాఠశాలల వైపు చూడటంలేదని బాధ పడుతున్నారు.

జిల్లాలోని పడమటి మండలాల్లో మూడేళ్ల క్రితం వరకూ నీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్థులు ట్యాంకరు నీటి కోసం పనులు మానేసి నిరీక్షించారు. పాఠశాలల్లో బోర్లు వేసినా కొంతకాలానికి నీరు రాకపోవడం, కొన్నిచోట్ల అంతంతమాత్రంగానే వస్తుండటంతో ఆ అరకొరా నీటితోనే గొంతు తడుపుకునే దుస్థితి. కొన్ని ప్రాంతాల్లో సమస్య నుంచి గట్టెక్కించేందుకు క్యాన్ల ద్వారా నీళ్లు ఇవ్వడంతో కొంతమేరైనా ఇక్కట్లు తప్పాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ‘నాడు- నేడు’ ద్వారా బడుల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొంది. ప్రధానంగా తాగునీటి ఎద్దడిని పరిష్కరిస్తామని చెప్పింది. ఈ క్రమంలోనే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నీటి సదుపాయం లేనిచోట లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేసింది. మరమ్మతులకు గురైతే ఏజెన్సీ నిర్వాహకులకు సమాచారం ఇస్తే వెంటనే చక్కదిద్దుతారని ప్రకటించింది.

బాగు చేయకపోవడంతో మూలకు..

కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో తరచూ యంత్రాలు పాడైపోతున్నాయి. వీటిని బాగు చేయించాలని ప్రధానోపాధ్యాయులు ఏజెన్సీలకు చెబుతున్నా ఒకట్రెండు సార్లు వచ్చి మరమ్మతులు చేశారు. తర్వాత వారి జాడే లేకుండా పోయిందని విద్యార్థులు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. దీంతో నీటి శుద్ధి యంత్రాలను పాఠశాలల్లోనే ఓ మూలన పడేశారు. విద్యార్థులు ఇళ్ల నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నారు. కొన్నిచోట్ల మాత్రం ఉపాధ్యాయులు చొరవ తీసుకుని క్యాన్ల ద్వారా నీళ్లు తెప్పిస్తున్నారు. ఆ ఖర్చులనూ వారే భరిస్తున్నారు.

* కుప్పం మండలం గోనుగూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 320 మంది విద్యార్థులున్నారు. ‘నాడు- నేడు’ మొదటి విడతలో భాగంగా ఇక్కడ విద్యా ర్థులకు శుద్ధినీరు అందిం చేందుకు ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు. వారం రోజులకు మరమ్మతులకు గురికావడంతో ఓ గదిలో ఉంచేశారు. అప్పటి నుంచి విద్యార్థులు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. అధిక శాతం మంది ఇళ్ల నుంచే నీళ్లు తెచ్చుకుంటూ దాహార్తి తీర్చుకుంటున్నారు. మరమ్మతులకు గురైన విషయాన్ని ఉపాధ్యాయులు.. ఏజెన్సీ నిర్వాహకులకు చెప్పినా ఒకసారి బాగు చేయించారు. మరికొన్ని రోజులకు తిరిగి సమస్య మొదలైంది.

* కుప్పం పట్టణం పాతపేట ప్రాథమిక పాఠశాలలో 117 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రం మరమ్మతులకు గురవడంతో క్యాన్లలో నీరు తెచ్చి విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని