logo

రాకెట్‌లా దూసుకెళ్లారు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం దిశానిర్దేశం చేశారు.

Published : 26 Nov 2022 06:16 IST

కర్ణాటక విద్యార్థుల రూపకల్పన కేజీఎస్‌3
ఉపగ్రహానికి పునీత్‌ పేరు
త్వరలో షార్‌ నుంచి కక్ష్యలోకి..

ఉపగ్రహాల రూపకల్పన హ్యాండ్‌ బుక్‌ను ఆవిష్కరిస్తున్న కర్ణాటక మంత్రి నారాయణ, తదితరులు

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం దిశానిర్దేశం చేశారు. దీనిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా రాకెట్‌ వేగంలా ఆలోచనలకు పదునుపెట్టి కేజీఎస్‌3 ఉప్రగహం తయారుచేసి ఔరా అనిపించుకున్నారు. దీనికి కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌గా నామకరణం చేశారు. త్వరలో షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1.90 కోట్ల మేర నిధులు మంజూరు చేసింది.

బరువు చాలా తక్కువ

ఉపగ్రహం బరువు 1.5 కిలోలు. ఇప్పటి వరకు ఏ ఉపగ్రహం బరువైనా 50 కిలోల వరకు ఉండేది. ఇందుకుగాను రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ఖర్చు చేసేవారు. దీని రూపొందించేందుకు విద్యార్థులు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో కఠినమైన శిక్షణ పొందారు. ఉపగ్రహ పెలోడ్‌, నానో ఉపగ్రహాల పరిచయం, బెంగళూరులోని శాస్త్రీయ సంస్థలను సందర్శించడంతో పాటు సీనియర్‌ శాస్త్రవేత్తలతో కలిసి వివరాలు తెలుసుకుని అనుమానాలను నివృత్తి చేసుకోవడం జరుగుతున్నాయి. గ్రౌండ్‌స్టేషన్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహానికి ముందుగా కేజీఎస్‌3 అని పేరు పెట్టారు. అయితే కన్నడ సినీనటుడు పునీత్‌ రాజకుమార్‌ మరణాంతరం ఆయన పేరిట ఉపగ్రహాన్ని పంపాలని భావించి.. కేజీఎస్‌3 శాట్‌కు పునీత్‌ శాట్‌గా నామకరణం చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సైన్సు అండ్‌ టెక్నాలజీ మంత్రి డాక్టర్‌ అశ్వంత్‌ నారాయణ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని