logo

సెజ్‌ బాహ్య రహదారికి మోక్షం

పారిశ్రామికవాడ బాహ్య రహదారి విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి రానుంది. నాయుడుపేట ఇండస్ట్రీయల్‌ క్లస్టర్‌కు 2018లో ఏడీబీ సాయంతో రోడ్డు ఏర్పాటుకు అనుమతి లభించింది.

Published : 26 Nov 2022 06:21 IST

రూ.161 కోట్లతో విస్తరణ

 పండ్లూరు వద్ద ఆర్‌వోబీ

విస్తరించనున్న రహదారి

గూడూరు, న్యూస్‌టుడే:  పారిశ్రామికవాడ బాహ్య రహదారి విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి రానుంది. నాయుడుపేట ఇండస్ట్రీయల్‌ క్లస్టర్‌కు 2018లో ఏడీబీ సాయంతో రోడ్డు ఏర్పాటుకు అనుమతి లభించింది. ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఆర్డీసీ) ఆధ్వర్యంలో అప్పట్లో హద్దులు, భూసేకరణ ప్రక్రియలు చకచకా సాగాయి. కొందరు రైతులు పొలాలు ఉన్నాయని కోర్టును ఆశ్రయించడంతో కొంత మేర అలైన్‌మెంట్‌ మారింది.

నాయుడుపేట ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌కు 8.7 కి.మీ మేర నాలుగు వరుసల బాహ్య రహదారికి రూ.161 కోట్లు మంజూరయ్యాయి. ఇక్కడి నుంచి రోజూ  2,500 వాహనాలు రాకపోకలు చేస్తున్నాయి. నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు మండలాల్లోని భూముల్లో ప్రత్యేక అర్థిక మండలి, పారిశ్రామిక పార్కులకు 5 వేల ఎకరాలు కేటాయించారు. ఇప్పటికే కొన్ని భారీ పరిశ్రమలతో పాటు ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. దీంతో ఇక్కడికి బాహ్య రహదారి అవసరాన్ని గుర్తించారు. తెదేపా హయాంలో పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. తాజాగా ఏడీబీ నుంచి నిధులు పక్కకు మళ్లే పరిస్థితులు రావడంతో ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రహదారి అలైన్‌మెంట్‌ మార్చి 8.7 కి.మీ మేర నాలుగు వరుసల నిర్మాణానికి ఏర్పాట్లు చేపట్టారు.

వంతెన ఏర్పాటుపై నిర్ణయం

జాతీయ రహదారి 16 నుంచి పండ్లూరు రైల్వేక్రాసింగ్‌ దగ్గర వంతెన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పెన్నేపల్లి, అయ్యప్పరెడ్డిపాళెం దగ్గర వ్యవసాయ భూములు ఉండటంతో రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మార్గం మార్చిన ర.భ అధికారులు కొత్తగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు.  పండ్లూరు, అయ్యప్పరెడ్డిపాళెం, ఓజిలి మండలం పెన్పేపల్లి, కొత్తపేట, గ్రద్ధగుంట మీదుగా నాయుడుపేట-రాపూరు రహదారికి అనుసంధానం చేయనున్నారు. కొత్త మార్గంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి రానుంది. ఉన్న రహదారిని విస్తరిస్తూ నాలుగు వరుసలు చేయనున్నారు.

ఆదిలోనే అడ్డంకులు

నాయుడుపేటలో గతంలో ఓ రహదారి ప్రతిపాదించగా ఆదిలోనే అడ్డంకులు పడ్డాయి. ఆ మార్గం వదిలి ప్రస్తుతం ఇక్కడ నాలుగు వరుసలతో డివైడర్‌ ఏర్పాటు చేయనున్నారు. గోమతి నుంచి స్వర్ణముఖి నది వరకు విస్తరించి విద్యుద్దీపాలు అమర్చనున్నారు.  

త్వరలో ప్రారంభించే అవకాశం

నాయుడుపేట పారిశ్రామిక క్లస్టర్‌ బాహ్య రహదారిటెండర్‌ ప్రక్రియ పూర్తి చేశాం. ఏడీబీ నుంచి అనుమతులు రాగానే పనులు మొదలవుతాయి. కొత్త అలైన్‌మెంట్‌ మేరకు పనులు చేపడతాం.        

- రామాంజనేయులు, కార్యనిర్వాహక ఇంజినీర్‌, ర.భ. శాఖ, గూడూరు


పారిశ్రామిక క్లస్టర్‌ నుంచి ట్రాఫిక్‌ అంచనా
సంవత్సరం   వాహనాలు
2018 1,984
2023 2,887
2228 4,161
2033 5,872

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు