logo

చిరంజీవులుగా నిలిచారు

అవయవ దానమంటే మరొకరికి పునర్జన్మ ఇచ్చినట్లే..! కొందరు చనిపోతూ కలకాలం నిలిచిపోతే.. మరికొందరు అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

Published : 27 Nov 2022 04:21 IST

నేడు జాతీయ  అవయవదాన  దినోత్సవం
న్యూస్‌టుడే, తిరుపతి (వైద్యం), చిత్తూరు విద్య

అవయవ దానమంటే మరొకరికి పునర్జన్మ ఇచ్చినట్లే..! కొందరు చనిపోతూ కలకాలం నిలిచిపోతే.. మరికొందరు అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా హృదయాల్లో చిరకాలం గుర్తుండిపోయేలా ముద్ర వేసుకుంటున్నారు. ఆదివారం జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా జిల్లాలో అవయవ దానం చేసి పలువురి ప్రాణాలు కాపాడిన సేవామూర్తులపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


తండ్రికే మరు జన్మనిచ్చి..


తండ్రి హనుమంతుతో హరీష్‌

వెంకటగిరి, న్యూస్‌టుడే: జన్మనిచ్చిన తండ్రికే ఆ కుమారుడు తన కాలేయం ఇచ్చి మరు జన్మనిచ్చిన వైనమిది. వెంకటగిరి కచ్చేరి వీధికి చెందిన తమటం హనుమంతుకు ఇద్దరు కుమారులు. వ్యాపారం చేస్తూ తన బిడ్డలు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలయ్యారు.. దాంతో చెన్నై లోని ఓ ఆసుపత్రిలో చేర్పించగా.. వైద్యులు కాలేయం చెడిపోయినట్లు గుర్తించారు. అవయవ మార్పిడి ద్వారానే బతికించగలమని వైద్యులు స్పష్టం చేశారు. కాలేయం కోసం అన్వేషించారు. చివరకు ఇద్దరు కుమారులే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వైద్యులు వారికి అన్ని రకాల పరీక్షలు చేసి రెండో కుమారుడు హరీష్‌ నుంచి కాలేయం తీసుకునేందుకు అంగీకరించారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో హనుమంతు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి పెంచి ఉన్నత జీవితం ఇచ్చిన తన తండ్రి రుణం తీర్చుకోవడం ఎంతో అనందంగా ఉందని హరీష్‌ తన మనోగతాన్ని వెల్లడించారు.


పూర్ణ చైతన్యం

పూర్ణ చైతన్య

చిత్తూరుకు చెందిన సహదేవనాయుడు, అరుణకుమారికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు పూర్ణచైతన్య. వారు విశ్రాంత ఉపాధ్యాయులు. కుమారుడు కుప్పంలో ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెందారు. ఈ సమయంలో సామాజిక బాధ్యతగా ఆలోచించి కుమారుడి కళ్లు, మూత్రపిండాలు దానం చేసి వారి జీవితాల్లో వెలుగునింపారు. గత 12 ఏళ్లుగా పూర్ణచైతన్య పేరుతో మెమోరియల్‌ ట్రస్ట్‌ ఏర్పాటుచేసి సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన వర్ధంతి రోజున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాత పుస్తకాలు ఉచితంగా అందజేస్తున్నారు. అలాగే రక్తదాన శిబిరాలు, వికలాంగులు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


నలుగురికి ప్రాణదానం

ప్రవీణ్‌ (దాచిన చిత్రం)

ఐరాల, న్యూస్‌టుడే: చిగరపల్లెకు చెందిన డి.భవ్య తన భర్త ప్రాణం పోతుందని తెలిసినా మరో నలుగురికి అవయవాలను దానం చేశారు. 2016 ఆగస్టు 7న ప్రవీణ్‌ మిద్దె మెట్లు దిగుతూ జారిపడి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం చెన్నై తరలించారు. అక్కడి వైద్యులు ప్రవీణ్‌ బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. ఇదే సమయంలో దిల్లీ, చెన్నై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొందరికి అవయవాలు అవసరమనే విషయాన్ని డాక్టర్లు భవ్య దృష్టికి తెచ్చారు. ఆమె వెంటనే స్పందించారు. తన భర్త చనిపోతాడని తెలిసినా... మరికొందరి ప్రాణాలు నిలిపేందుకు ఆగస్టు 11న అవయవదానానికి అంగీకరించింది. కళ్లు మినహా గుండె, కాలేయం, కిడ్నీలు, ఇతర అవయవాలు దానంగా ఇచ్చారు. కఠిన పరిస్థితుల్లో ఆమె తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది అభినందించారు.


మృతదేహాలు అందజేత

* కృష్ణా జిల్లా కలవపాముల గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు చలసాని మోహన్‌దాసు (91) పార్థివదేహాన్ని వారి కుటుంబ సభ్యులు అక్టోబరు 1న తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు అప్పగించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే క్రమంలో వైద్య విద్యార్థులు జరిపే పరిశోధనలకు తన మృతదేహాన్ని అప్పగించాలన్న ఆయన కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నారు.

* సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సతీమణి వసుమతి పార్థివదేహాన్ని తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు అందజేశారు. వైద్య పరిశోధనలకు వినియోగించాలని ఆమె కుటుంబ సభ్యులు విన్నవించారు.


‘యువ’ చైతన్యం..

శ్రీకాళహస్తి: మనం చనిపోయాక కూడా మన శరీరాంగాలు పలువురికి ఉపయోగపడాలన్న సంకల్పంతో శ్రీకాళహస్తిలోని యువతరం సేవాసమితి చైతన్యం కల్పిస్తోంది. వీరు 30 మంది అవయవదానం చేస్తూ రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమితి నిర్వాహకులు యువకిశోర్‌ తెలిపారు.  


అవగాహన పెరగాలి

- భూమా వెంగమ్మ, సంచాలకురాలు, స్విమ్స్‌

ఒకరు అవయవాలు దానం చేస్తే ఏడెనిమిది మందికి జీవం పోసినట్లే. దీనిపై సమాజంలో అవగాహన పెరగాలి.  కొవిడ్‌ కారణంగా తిరుపతిలో కొంత మేరకు అవయవదానం తగ్గింది. అన్ని రకాల అనుమతులు తీసుకుని మరింతగా సేవలందించేందుకు స్విమ్స్‌ సమాయత్తమవుతోంది.

అవయవదానం చేస్తున్నట్లు  రిజిస్ట్రేషన్‌ పత్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని