logo

33 రోజులు.. 3 రాకెట్‌ ప్రయోగాలు

షార్‌ నుంచి 33 రోజుల వ్యవధిలో మూడు ప్రయోగ వేదికల నుంచి మూడు వేర్వేరు రాకెట్‌ ప్రయోగాలు చేపట్టి విజయవంతం చేశారు.

Published : 27 Nov 2022 04:21 IST

నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్‌వీ-సి54

శ్రీహరికోట, న్యూస్‌టుడే: షార్‌ నుంచి 33 రోజుల వ్యవధిలో మూడు ప్రయోగ వేదికల నుంచి మూడు వేర్వేరు రాకెట్‌ ప్రయోగాలు చేపట్టి విజయవంతం చేశారు. తుపాన్లు, భారీ వర్షాలు, తదితర విపత్తుల నేపథ్యంలో అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాల్లో రాకెట్‌ ప్రయోగాలు చేపట్టేందుకు వెనకడుగు వేస్తారు. ఈ దఫా ప్రతికూల వాతావరణంలోనూ మూడు రాకెట్లను విజయవంతంగా నింగిలోకి పంపారు. ఈ ఏడాది అక్టోబరు 21 భారీ రాకెట్‌ ప్రయోగమైన ఎల్‌వీఎం-3ని నింగిలోకి పంపి, వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను కక్ష్యలో వదిలారు. అలాగే ఈనెల 18న మొట్టమొదటిగా హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌కు చెందిన ప్రైవేటు రాకెట్‌ను ఇక్కడ నుంచే పంపి విజయవంతం చేశారు. ప్రైవేటు రాకెట్‌ను స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ తయారు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో వారిని ప్రోత్సహించడంతో, అన్నింటా ఇస్రో ముద్రతోనే ముందుకు కదిలారని చెప్పొచ్చు. తాజాగా శనివారం పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి54 వాహకనౌక ద్వారా దేశానికి చెందిన ఓషన్‌శాట్‌తోపాటు, మరో 8 నానోశాటిలైట్లు కక్ష్యలో విడిచిపెట్టారు. మూడు రాకెట్ల సమయంలో వాతావరణంలో మార్పులు కనిపించాయి. అయినా శాస్త్రవేత్తలు వెనకడుగు వేయకుండా ముందుకు కదిలి విజయం సాధించారు. మూడు రాకెట్లలోనూ మూడు విభిన్నమైన సాంకేతికలను ఉపయోగించారు. శనివారం చేపట్టిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి54 వాహకనౌక ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు నుంచి 10,342 మంది వచ్చారు.

రాకెట్‌ ప్రయోగ వీక్షణకు వచ్చిన భూటాన్‌ దేశీయులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని