logo

పైరులో ఒరిగి.. రైతుకు దిమ్మెతిరిగి

మండల పరిధిలోని రామేగౌనిపల్లె, సోలిశెట్టిపల్లె సమీపంలో అక్రమ క్వారీల నుంచి రాత్రి వేళ గ్రానైట్‌ తరలింపు లారీల రాకపోకల వల్ల స్థానిక రైతులకు నష్టాలు తప్పడం లేదు.

Published : 27 Nov 2022 04:25 IST

గ్రానైట్‌ అక్రమ తరలింపులో పొలంలో పడ్డ లారీ
వరి పంట, రాతి కంచె ధ్వంసం
రామేగౌనిపల్లె వద్ద అర్ధరాత్రి ఘటన


పొలంలో పడిన గ్రానైట్‌ దిమ్మెలు

కుప్పం, శాంతిపురం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని రామేగౌనిపల్లె, సోలిశెట్టిపల్లె సమీపంలో అక్రమ క్వారీల నుంచి రాత్రి వేళ గ్రానైట్‌ తరలింపు లారీల రాకపోకల వల్ల స్థానిక రైతులకు నష్టాలు తప్పడం లేదు. శుక్రవారం అర్ధరాత్రి గ్రానైట్‌ తరలిస్తున్న లారీ రామేగౌనిపల్లె వద్ద అదుపు తప్పి పంట భూముల్లోకి దూసుకెళ్లడంతో రైతులకు నష్టం వాటిల్లింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సమీప క్వారీ నుంచి రెండు దిమ్మెలతో రామేగౌనిపల్లె వైపు వస్తున్న లారీ వరి పొలంలో ఒరిగింది. దిమ్మెలు పంటలో పడిపోయాయి. రాత్రి వేళలలోనే గ్రానైట్‌ దిమ్మెలను మరో లారీ ద్వారా తరలించే ప్రయత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. రైతులు పంట భూములకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న కంచెకు సంబంధించిన రాతి స్తంభాలు నేలమట్టం అయ్యాయి. పంట కూడా దెబ్బతిందని బాధిత రైతులు వాపోయారు.

రాత్రి వేళల్లో యథేచ్ఛగా తరలింపు

క్వారీలకు ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నట్లయితే.. గ్రానైట్‌ను పగటి వేళల్లో తరలించవచ్చు కదా..? అని స్థానికులు అంటున్నారు. అనధికారిక క్వారీల్లో పగటి వేళ తవ్వకాలు చేపడుతూ.. అర్ధరాత్రి వేళల్లో రహస్యంగా రాతి దిమ్మెలను తరలించాల్సిన అవసరం ఏమిటి..? అని ప్రశ్నిస్తున్నారు. సోలిశెట్టిపల్లె, రామేగౌనిపల్లె సమీపంలోని కొండల నుంచి నిత్యం రాత్రుల్లో పదుల సంఖ్యలో లారీల ద్వారా గ్రానైట్‌ తరలింపు సాగుతోందని స్థానికులు చెబుతున్నారు. లారీలు, ట్రాక్టర్ల రాకపోకల వల్ల రామేగౌనిపల్లె రోడ్డు అధ్వాన స్థితికి చేరుకొందని వాపోయారు. సోలిశెట్టిపల్లె- గెసికపల్లె రోడ్డుతో పాటు కుప్పం- కేజీఎఫ్‌ రహదారి కూడా దెబ్బతింటోందని పేర్కొన్నారు.

లారీ ధాటికి నేలకూలిన రాతి స్తంభాలు

ఉద్యాన పంటల్లో విపరీతమైన దుమ్ము

గ్రానైట్‌ వాహనాల ధాటికి రహదారులు గుంతలమయం కావడంతో వాటి రాకపోకల వల్ల సమీప పంట భూముల్లో దుమ్ము పేరుకుపోతోందని రైతులు అంటున్నారు. మట్టి రోడ్లపై వాహనాలు వెళ్లే సందర్భంలో ఉద్యాన పైర్లపై విపరీతమైన దుమ్ము అలముకోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. రాత్రి వేళల్లో గ్రానైట్‌ లారీలు, ట్రాక్టర్ల రాకపోకల వల్ల శబ్ద కాలుష్యంతో తీవ్ర అసౌకర్యం ఎదురవుతోందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని