logo

పంచమి తీర్థం.. ప్రణమిల్లిన భక్తజనం

శ్రీపద్మావతీ అమ్మవారి పంచమి తీర్థం సోమవారం కనులపండువగా జరిగింది. ఉదయం ఏడు గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఉత్సవమూర్తిని, చక్రత్తాళ్వారును ఊరేగింపుగా పద్మసరోవరంలోని మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు.

Published : 29 Nov 2022 02:16 IST

లక్షన్నర మందికి పైగా భక్తుల పుణ్యస్నానాలు

స్నపన తిరుమంజనం మండపంలో శ్రీపద్మావతీ అమ్మవారు, చక్రత్తాళ్వారు

తిరుచానూరు, తిరుమల, న్యూస్‌టుడే: శ్రీపద్మావతీ అమ్మవారి పంచమి తీర్థం సోమవారం కనులపండువగా జరిగింది. ఉదయం ఏడు గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఉత్సవమూర్తిని, చక్రత్తాళ్వారును ఊరేగింపుగా పద్మసరోవరంలోని మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. గజరాజుపై తిరుమల నుంచి తీసుకొచ్చిన సారె, బంగారు ఆభరణాలు, పసుపు, కుంకుమ తదితర అభిషేక ద్రవ్యాలతో అమ్మవారికి, చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు లక్షన్నర మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు తితిదే అంచనా వేసింది. రాత్రి అలమేలుమంగకు తిరుచ్చి వాహనసేవ నిర్వహించారు. ధ్వజారోహణం రోజున ఎగురవేసిన గజపటాన్ని అవరోహణ చేయడంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. పంచమి తీర్థంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు పోకల అశోక్‌కుమార్‌, రామేశ్వరరావు, శ్రీరాములు, మారుతిప్రసాద్‌, తితిదే మాజీ ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు, జేఈవో సదాభార్గవి, సీవీఎస్వో నరసింహకిషోర్‌, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పద్మసరోవరంలో భక్తులు

అమ్మవారికి అయ్యవారి సారె : అమ్మవారి చక్రస్నానం కోసం సోమవారం వేకువజామున తిరుమల నుంచి ఈవో ఏవీ ధర్మారెడ్డి తమ సిబ్బందితో కలిసి కాలి నడకన సారె తెచ్చారు. అలిపిరి వద్ద జేఈవో వీరబ్రహ్మానికి అందజేశారు. ఆపై తిరుచానూరు వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు.

అమ్మవారి హారతి అందుకుంటున్న భక్తులు

రెండు బంగారు పతకాలు కానుక: అమ్మవారి చక్రస్నానం పురస్కరించుకుని తిరుమల నుంచి శ్రీవారి తరఫున రూ.25 లక్షల విలువ చేసే రెండు బంగారు పతకాలు, ఒక హారాన్ని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తీసుకొచ్చి ఆలయ అధికారులకు అందజేశారు. చక్రస్నానం సమయంలో జరిగిన స్నపన తిరుమంజనంలో బంగారు పతకాలు ధరించి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

ధ్వజావరోహణం నిర్వహిస్తున్న అర్చకులు

* అమ్మవారి పంచమి తీర్థం ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం పద్మసరోవరం పరిసర ప్రాంతాల్లో పోలీసు భద్రతను ఆయన పర్యవేక్షించారు. తితిదే, పోలీసు సంయుక్తంగా ముందస్తు ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు చేశారన్నారు.

నేడు పుష్పయాగం

శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో మంగళవారం సాయంత్రం పుష్పయాగం నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు వరకు జరిగే కార్యక్రమంలో టన్నుల కొద్దీ పుష్పాలను వినియోగించనున్నారు. ఆర్జిత సేవా టికెట్‌ కొనుగోలు చేస్తే ఇద్దరిని అనుమతిస్తారు. మంగళవారం ఆలయంలో జరగాల్సిన అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది.

శ్రీవారి తరఫున తీసుకొచ్చిన బంగారు పతకాలు చూపుతున్న వైవీ సుబ్బారెడ్డి, ఏవీ ధర్మారెడ్డి


భక్తులకు  కష్టాలు

తోపులాట కారణంగా భక్తుల మధ్య ఘర్షణ

పంచమి తీర్థంలో పాల్గొన్న భక్తులు  పుణ్యస్నానాల తర్వాత బయటకు వెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు. ఎటు చూసినా బారికేడ్లు కనిపించడం, బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరు గేట్లు ఎక్కి బయటకు దూకే క్రమంలో గాయాలపాలయ్యారు. పద్మసరోవరంలోకి ఉదయం 10.30 గంటలకు అనుమతించారు. రాత్రి నుంచి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఉదయానికి ఓపిక నశించి భద్రతా సిబ్బందితో గొడవపడ్డారు. ప్రవేశ మార్గాలపైన దృష్టి పెట్టిన అధికారులు నిష్క్రమణ మార్గాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి.

పోలీసులు అడ్డుకోవడంతో భక్తుల అవస్థలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని