logo

ప్రాజెక్టు పనులు పూర్తయ్యేదెలా?

సాగునీటి ప్రాజెక్టు పనులు 75 శాతం అయిన వాటిని ప్రాధాన్యంగా తీసుకుని పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుండటంతో గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు సందిగ్ధంలో పడనున్నాయి.

Published : 29 Nov 2022 02:16 IST

ప్రభుత్వ తాజా ఆలోచనతో సందిగ్ధంలో జీఎన్‌ఎస్‌ఎస్‌
కాలువ పనులు చేపట్టినా ఫలితం శూన్యం

మధ్యలోనే నిలిచిన మల్లెమడుగు జలాశయ పనులు

సాగునీటి ప్రాజెక్టు పనులు 75 శాతం అయిన వాటిని ప్రాధాన్యంగా తీసుకుని పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుండటంతో గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు సందిగ్ధంలో పడనున్నాయి. మూడేళ్లుగా ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు మూడుసార్లు అంచనాలు రూపొందించి రూ.5వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి నివేదించినా పరిపాలనపరమైన అనుమతులు లభించలేదు. దీంతో 15 ఏళ్ల కిందట ప్రారంభమైన జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు పనులు నామమాత్రంగానే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వీటి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

ఈనాడు-తిరుపతి: కరవు ప్రాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీటిని అందించేందుకు గతంలో ప్రభుత్వం గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా జలాలను తరలించేందుకు ప్రణాళికలు రూపొందించింది. పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 10.87 టీఎంసీల సామర్థ్యంతో ఏడు జలాశయాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత పలు కారణాలతో రెండు జలాశయాల నిర్మాణాలను పక్కనబెట్టారు. ఇప్పటి వరకు అడవికొత్తూరు, వేపగుంట మినహా మిగిలిన జలాశయ, కాలువ పనులు ముందుకు సాగలేదు.  మిగిలిన పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసే పరిస్థితి కనిపించట్లేదన్న వాదనలున్నాయి. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల స్థితిగతులపై జలవనరుల శాఖ అధికారులు నివేదిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో జీఎన్‌ఎస్‌ఎస్‌తో పాటు హంద్రీ-నీవా, సోమశిల స్వర్ణముఖి లింకు కాలువ తదితరాలున్నాయి.  హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో చేపట్టిన పనులు చాలా వరకు పూర్తి కావచ్చాయి. ఇటీవల పుంగనూరు నియోజకవర్గ పరిధిలో కొత్తగా మూడు జలాశయాల నిర్మాణానికి ఆమోదించారు. ఇప్పుడు వీటి పనులు కొనసాగిస్తారా లేక  పెండింగ్‌లో ఉన్న వాటికి ఆమోదముద్ర వేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.


* వేణుగోపాల్‌సాగర్‌ జలాశయ పనులు 29 శాతమే చేపట్టారు. అటవీ భూ సమస్యతో పనులు ముందుకు సాగలేదు.


* వేపగుంట నుంచి అడవికొత్తూరు వరకు(311 నుంచి 334 కి.మీ వరకు) చేపట్టిన ప్రధాన కాలువ పనులు 87 శాతం పూర్తయ్యాయి. రెండు జలాశయాల నిర్మాణం సుమారు 75 శాతం పూర్తి చేశారు.


జీఎన్‌ఎస్‌ఎస్‌లో భాగంగా ఎస్‌.ఉప్పరపల్లె ప్రాంతం (240 కి.మీలు) నుంచి తుంబురకోన వరకు టన్నెల్‌ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. ఎప్పటికప్పుడు అలైన్‌మెంటు మారుస్తుండటంతో ఇది కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఈ టన్నెల్‌ పనులు పూర్తయితే మల్లెమడుగు, బాలాజీ జలాశయాలకునీటిని తరలించేందుకు ఆస్కారం ఉంది.


మల్లెమడుగు జలాశయం పనులు 44 శాతం పూర్తయ్యాయి. కైలాసగిరి  కైలాసగిరి కాలువ పనులు  కొన్ని ప్రాంతాల్లో మాత్రమే  చేపట్టారు. వాస్తవానికి అటు తెలుగు గంగ కాలువ ద్వారా ఆల్తూరుపాడు, మేర్లపాక నుంచి మల్లెమడుగుకు నీటిని తరలించేందుకు పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయినా జలాశయం పూర్తికాకుంటే కాలువలు తవ్వినా  ప్రయోజనం ఉండదన్న విమర్శలు ఉన్నాయి.


బాలాజీ జలాశయ నిర్మాణ పనులు 10.28 శాతమే పూర్తయ్యాయి. వాస్తవానికి ఈ జలాశయ నిర్మాణం పూర్తయితే తిరుపతి, తిరుమలతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలకు తాగునీటి ఇబ్బందులను తీర్చవచ్చు. జలాశయ నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.552 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పనులు కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. కేంద్రం జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఆమోదముద్ర వేస్తే పట్టాలెక్కేందుకు ఆస్కారం ఉంది.

నివేదిక సిద్ధం చేస్తున్నాం

జిల్లాల వారీగా ప్రాజెక్టు పనులతోపాటు పెండింగ్‌ బిల్లులపై నివేదిక తయారు చేస్తున్నాం. ప్రాజెక్టుల కింద పూర్తయిన పనులు, వాటికి రావాల్సిన బిల్లుల సమాచారాన్ని క్రోడీకరిస్తున్నాం.

హరినారాయణరెడ్డి, సీఈ, తెలుగుగంగ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని