logo

పట్టుబట్టారు.. ప్రోత్సాహకాలు మరిచారు

ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని అధికారులు చెప్పడంతో ఎస్‌.ఆర్‌.పురం మండలం పెరుమారెడ్డిగారిఇల్లుకు చెందిన రైతు సోమశేఖర్‌రెడ్డి ఏడాదిన్నర క్రితం రెండు ఎకరాల్లో పట్టు సాగు చేశారు.

Published : 29 Nov 2022 02:16 IST

15 నెలలుగా బిల్లులు రాని వైనం
అప్పులపాలవుతున్న రైతులు

ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని అధికారులు చెప్పడంతో ఎస్‌.ఆర్‌.పురం మండలం పెరుమారెడ్డిగారిఇల్లుకు చెందిన రైతు సోమశేఖర్‌రెడ్డి ఏడాదిన్నర క్రితం రెండు ఎకరాల్లో పట్టు సాగు చేశారు. పట్టుగూళ్ల పెంపకానికి షెడ్‌ కూడా నిర్మించినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.5.20 లక్షలు ఇంకా రావాలి. పలమనేరు మార్కెట్‌లో 400 కిలోల పట్టుగూళ్లు ఇవ్వగా వాటికి రూ.2 లక్షలు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకం అందాలి. అప్పులు చేసి పంట సాగు చేశానని.. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నానని సోమశేఖర్‌రెడ్డి వాపోతున్నారు.

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు, న్యూస్‌టుడే, శ్రీరంగరాజపురం: అన్నదాతలు సంప్రదాయ పంటల నుంచి మార్కెటింగ్‌ పరంగా అవకాశాలున్న పట్టు సాగు వైపు మళ్లాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక ప్రోత్సాహకాలు అందుతాయని చెబుతున్నారు.. నష్టాల బాటలో ఉన్న రైతాంగం ఈ మాటలు నమ్మి వ్యయప్రయాసలకు ఓర్చి క్రమంగా పట్టు పంట వైపు అడుగులు వేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చెప్పిన హామీని విస్మరిస్తోంది.. ఫలితంగా అన్నదాతలు  రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు.

పట్టు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఒక్కో మొక్కకు రూ.2 చొప్పున ఎకరాకు 3 వేల మొక్కలకు రూ.6 వేలు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. కూలీలు, కలుపుతీత తదితర ఖర్చులకు ఏటా ఉపాధి హామీ పథకం నుంచి రూ.40వేలు వస్తాయి. ఇలా మూడేళ్లపాటు చెల్లిస్తారు. పట్టుగూళ్ల పెంపకం షెడ్‌ నిర్మాణానికి రాయితీలు ఇస్తున్నారు. చివరగా మార్కెట్‌కు తెచ్చే పట్టుగూళ్లకు ప్రభుత్వం కిలోకు రూ.50 అదనంగా చెల్లిస్తోంది. ఇలా జిల్లావ్యాప్తంగా అధిక శాతం మంది రైతులకు పంట నిర్వహణకు ఇచ్చే డబ్బులు రాలేదు. 15 నెలలుగా పట్టుగూళ్లకూ ప్రోత్సాహకాలు అందించడంలేదు. ప్రభుత్వానికి ఎప్పటిక ప్పుడు బిల్లులు పంపుతున్నా నిధులు విడుదల కాకపోవడంతో రైతులు ఉసూరుమం టున్నారు. మొత్తంగా అన్నదాతలకు ప్రభుత్వం రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాలి.

నష్టాలతో సాగుకు దూరమవుతూ: ఓవైపు పట్టు సాగుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు రాకపోవడం, కొవిడ్‌ తర్వాత వరుసగా పట్టుగూళ్ల ధరలు గణనీయంగా తగ్గడంతో కొందరు రైతులు ఆ పంటను తీసేశారు. ఇప్పుడు కిలో రూ.600- రూ.700 పలుకుతున్నా తిరిగి ఎప్పుడు గడ్డు పరిస్థితులు తలెత్తుతాయోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. ఈక్రమంలోనే కర్షకులు ప్రత్యామ్నాయ పంటలు వైపు మళ్లుతున్నారు. 

రాష్ట్రంలోనే రెండో స్థానం: ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా పట్టుకు డిమాండ్‌ పెరిగింది. దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గిపోయే పరిస్థితి సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో పట్టు సాగుకు అనుకూలమైన వాతావరణం మన రాష్ట్రంలోనూ ఉన్నందున ఇక్కడ పంట విస్తీర్ణాన్ని పెంచాలని కేంద్రం నిర్దేశించింది. ప్రధానంగా ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, ఏజెన్సీ ప్రాంతాలు ఇందుకు అనువుగా ఉన్నాయని గుర్తించారు. మొక్కల కొనుగోలు నుంచి పట్టుగూళ్ల విక్రయం వరకూ ప్రతి దశలోనూ అన్నదాతలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రస్తుత చిత్తూరు జిల్లాలో 38 వేల ఎకరాల్లో మల్బరీ పట్టు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో ఉంది. అందులోనూ కుప్పం, పలమనేరు, పుంగనూరు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోనే అత్యధికంగా పండిస్తున్నారు.

జిల్లాలో పట్టు సాగు విస్తీర్ణం:  38 వేల ఎకరాలు

బకాయిలు రావాల్సిన రైతులు:  5,800 మంది

ఎన్ని నెలలుగా: 15 నెలలు

మొత్తం బకాయిలు: రూ.9 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని