logo

వైకాపా ప్రజాప్రతినిధుల మధ్య మట్టి రగడ

సత్యవేడు మండలంలో మట్టి రవాణాపై సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి.

Published : 29 Nov 2022 02:16 IST

సత్యవేడు ఎంపీడీవో కార్యాలయంలో అధికార పార్టీ నేతల వాగ్వాదం

సత్యవేడు (వరదయ్యపాళెం), న్యూస్‌టుడే: సత్యవేడు మండలంలో మట్టి రవాణాపై సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. మండలంలోని కొత్తమారికుప్పంలో స్థానిక అవసరాలకు, భూ అభివృద్ధి పనులకు అధికారుల అనుమతితో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు మోహన్‌రెడ్డి చేపడుతున్న మట్టి తవ్వకాలను జడ్పీటీసీ వర్గీయులు అధికారులతో అడ్డుకోవడం ఈ వివాదానికి దారి తీసింది. స్థానిక సర్పంచి శ్రీరాములురెడ్డి జోక్యంతో జడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి భర్త చంద్రశేఖర్‌రెడ్డి అధికారులను పంపి మట్టి రవాణాను అడ్డుకున్నారంటూ ఎంపీటీసీ సభ్యుడు మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ సభ్యురాలి భర్త చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచితో వాగ్వాదానికి దిగారు. తమిళనాడుకు నిత్యం వందలాది టిప్పర్లలో మట్టి రవాణా చేస్తుంటే పట్టించుకోకుండా, స్థానికంగా తరలిస్తే అడ్డుకుంటారా అంటూ నిలదీశారు. అధికార పార్టీ నాయకునిగా, ప్రజాప్రతినిధిగా కనీసం మట్టి రవాణా కూడా చేయకపోతే ఈ పదవెందుకు అంటూ ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య గొడవ పెరిగింది. ఎంపీపీ భర్త, వైకాపా మండల కన్వీనరు సుశీల్‌కుమార్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని, దీనిపై బహిరంగంగా పరస్పరం వాదనలకు దిగితే ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉందని నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని