logo

బిల్లు రాక.. పూర్తి చేయక..

ఇది గుడుపల్లెలోని రైతు భరోసా కేంద్రం. రెండేళ్ల కిందట రూ.21 లక్షలు మంజూరు కాగా ఇప్పటివరకు రూ.16 లక్షలు విడుదలయ్యాయి.

Published : 03 Dec 2022 01:52 IST

సచివాలయ, ఆర్‌బీకేల పరిస్థితి ఇదీ
కొన్నిచోట్ల నిర్మించినా అప్పగించని వైనం

* ఇది గుడుపల్లెలోని రైతు భరోసా కేంద్రం. రెండేళ్ల కిందట రూ.21 లక్షలు మంజూరు కాగా ఇప్పటివరకు రూ.16 లక్షలు విడుదలయ్యాయి. గుత్తేదారుకు రూ.2 లక్షల వరకు బిల్లులు రావాలి. అవి వస్తే పెండింగ్‌ పనులు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆరు నెలలుగా పనులు ఆగాయి. భవనం అందుబాటులోకి రాకపోవడంతో పాత పశువైద్యశాలలోనే కార్యకలాపాలు జరుగుతున్నాయి.


* ఇది పెద్దపంజాణి మండలం చలమంగళంలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రం. రూ.17 లక్షలు మంజూరు కాగా.. రూ.7 లక్షలు వచ్చాయి. తలుపులు, కిటికీలు, ర్యాంపు నిర్మాణానికి మరికొంత ఖర్చు చేశారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ఈ భవనాన్ని ప్రారంభించగా.. కొన్నిరోజులకే తాళాలు వేశారు. మిగిలిన నిధులూ విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని గుత్తేదారు కోరుతున్నారు.

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, సూళ్లూరుపేట

‘సచివాలయ వ్యవస్థ నా మానసపుత్రిక’ అని సీఎం జగన్‌ పదేపదే చెబుతున్నారు. ఇందులో భాగంగా సొంత భవనాల్లో సచివాలయాలు, ఆర్‌బీకేలు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వీటి నిర్మాణ పురోగతి భిన్నంగా ఉంది. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో నెమ్మదిగా పనులు చేస్తున్నారు. కొన్నిచోట్ల భవన నిర్మాణాలు తుది దశలో నిలిచిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తయినా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. సకాలంలో బిల్లులు మంజూరు చేసి వీటిని అందుబాటులోకి తెస్తే ప్రజలకు అవస్థలు తప్పడంతోపాటు పంచాయతీలపై అద్దెల భారమూ తగ్గుతుంది.

ప్రభుత్వం 2019 అక్టోబర్‌ 2 నుంచి  గ్రామ, వార్డు సచివాలయ సేవలు ప్రారంభించింది. సచివాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు 2019-20లో ఉపాధి హామీ పథకం నిధులు మంజూరయ్యాయి. రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే), వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి అదే ఆర్థిక సంవత్సరంలో పచ్చజెండా ఊపారు.

అధికార పార్టీకి చెందినా..

అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే గుత్తేదారుల అవతారం ఎత్తి భవన నిర్మాణ పనులు దక్కించుకున్నారు. బిల్లుల మంజూరులో తీవ్రజాప్యం జరగడంతో ఉమ్మడి జిల్లాలో ఆరు నెలలు- ఏడాదిపాటు నిర్మాణాలు నత్తనడకన సాగాయి. కుప్పం, పలమనేరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోనైతే పూర్తిగా నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు తీవ్రంగా ఒత్తిళ్లు తెచ్చినా గుత్తేదారులు ససేమిరా అన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని వాపోయారు. అనంతరం కొంత బిల్లులు జమ కావడంతో పనులు పునః ప్రారంభించారు.

భవనాలు సిద్ధంగా ఉన్నప్పటికీ..

సూళ్లూరుపేట, నగరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోని పలు పంచాయతీల్లో సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్కో గుత్తేదారుకు రూ.2 లక్షలు- రూ.10 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. దీంతో భవనాలు అప్పగిస్తే బిల్లులు రావనే భయం వారిని వెంటాడుతోంది. ఈ క్రమంలోనే అన్ని పనులు పూర్తయినా ప్రారంభోత్సవానికి మాత్రం అంగీకరించడంలేదు. పలు ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగానే తుది మెరుగులు దిద్దలేదు. యంత్రాంగం స్పందించి బిల్లులు మంజూరు చేయిస్తే భవనాలు అప్పగిస్తామని వారు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని