logo

రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి కూత

తిరుపతి రైల్వేస్టేషన్‌కు మహర్దశ పట్టింది. రాబోవు 40 ఏళ్లలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వేస్టేషన్‌ను అత్యున్నతంగా ఆధునికీకరించడానికి ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించారు.

Published : 03 Dec 2022 01:52 IST

రూ.299.21 కోట్లతో ఆధునికీకరణ పనులు

ప్రవేశద్వారం (నమూనా) (అంతర చిత్రంలో) జరుగుతున్న అభివృద్ధి పనులు

తిరుపతి రైల్వేస్టేషన్‌కు మహర్దశ పట్టింది. రాబోవు 40 ఏళ్లలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వేస్టేషన్‌ను అత్యున్నతంగా ఆధునికీకరించడానికి ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రవేశ ద్వారంతో పాటు దక్షిణం వైపు నూతనంగా మరో ప్రవేశ ద్వారం నిర్మాణంతో ఇరువైపులా  ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలు కలిగింది. 

న్యూస్‌టుడే, తిరుపతి(గాంధీరోడ్డు)

స్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ఆహ్లాద వాతావరణాన్ని ప్రయాణికులకు అందించనున్నారు. అందుకు తగ్గట్టు ఉత్తరం, దక్షిణం వైపు ఆధునికీకరణ పనులకు సంబంధించి రూ.311.67 కోట్లతో అంచనా వేయగా.. అందులో రూ.299.21 కోట్లతో న్యూదిల్లీకి చెందిన ఓ సంస్థ టెండర్‌ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 33 నెలల్లో అంటే 2025 ఫిబ్రవరి 28 నాటికి పనులు పూర్తి చేయాలి. జూన్‌ 13న దక్షిణం వైపు పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 99 శాతం తవ్వకం, 80 శాతం పునాదులు, ఎలక్ట్రికల్‌ పరికరాల కోసం 50 శాతం సామగ్రి సేకరణ పూర్తయింది. కేబుల్స్‌ వేయడం, స్విచ్‌ బోర్డులు మార్చడం వంటి పనులు పురోగతిలో ఉన్నాయి. దక్షిణం వైపు ప్రతిపాదనల ప్రకారం.. జీప్లస్‌ త్రీ అంతస్తులతో పాటు కార్లు, ద్విచక్రవాహనాల పార్కింగ్‌కు 9261 చదరపు మీటర్లలో బేస్‌మెంట్‌ నిర్మాణం జరగనుంది. ఇందులో  500 వరకు కార్లు, ద్విచక్రవాహనాలు పార్కింగ్‌ చేయొచ్చు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రైళ్ల రాకపోకలు, టికెట్‌ కౌంటర్‌, వెయిటింగ్‌ లాంజ్‌, రెండో అంతస్తులో కామన్‌ వెయిటింగ్‌ హాల్‌, మహిళలకు ప్రత్యేకంగా నిరీక్షణ ప్రాంతం, ఫుడ్‌కోర్టు, మరుగుదొడ్లు, క్లాక్‌రూమ్‌, మూడో అంతస్తులో రన్నింగ్‌ రూమ్‌, టీటీఈ విశ్రాంతి గదులతో పాటు పలు స్టాళ్లు అందుబాటులోకి రానున్నాయి.

భూగర్భ పార్కింగ్‌ పనులు

ఉత్తరం వైపు ఆధునికీకరణ.. దక్షిణం వైపు పనులు పూర్తైన వెంటనే ఉత్తరం వైపు చేపట్టనున్నారు. ఇందులో జీప్లస్‌ త్రీ అంతస్తుల్లో.. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రైళ్ల రాకపోకలు, టికెట్‌ కౌంటర్‌, వెయిటింగ్‌ లాంజ్‌, మొదటి అంతస్తులో కామన్‌ వెయిటింగ్‌ హాల్‌, దుకాణాలు, మరుగుదొడ్లు, మూడో అంతస్తులో విద్యుత్తు కార్యాలయం, బుకింగ్‌ కార్యాలయాలు రానున్నాయి. ఉత్తరం వైపు 13లక్షల లీటర్ల సామర్థ్యం, దక్షిణం వైపు 29 లక్షల లీటర్ల సామర్థ్యంతో అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ ట్యాంక్‌ నిర్మించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు