logo

శాస్త్రీయ విధానాలతో వ్యవసాయానికి ప్రోత్సాహం

నూతన శాస్త్రీయ విధానాలతో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం అన్ని విధాలా కృషిచేస్తున్నారిన వ్యవసాయ అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు.

Published : 03 Dec 2022 01:52 IST

మాట్లాడుతున్న రాష్ట్ర వ్యవసాయ అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ నాగిరెడ్డి

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: నూతన శాస్త్రీయ విధానాలతో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం అన్ని విధాలా కృషిచేస్తున్నారిన వ్యవసాయ అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వ్యవసాయ అనుబంధ రంగాల భాగస్వామ్య పక్షాల ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అవసరమైన పరికరాల్ని రెండు, మూడు నెలల్లో అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో అధికారుల్ని నియమించి ఎరువులు, విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తూ సేద్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టిందన్నారు. సాగుచేసిన ప్రతి ఎకరాకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రైతుల సమస్యల్ని తెలుసుకునేందుకు అగ్రి మిషన్‌ పనిచేస్తోందన్నారు. కలెక్టర్‌ హరినారాయణన్‌, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, జేసీ వెంకటేశ్వర్‌, ఇన్‌ఛార్జి జేడీఏ రత్నప్రసాద్‌, శాస్త్రవేత్త చంద్రశేఖర్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకట్రావు, పట్టుపరిశ్రమ శాఖ అధికారిణి శోభారాణి, ఉద్యానశాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

సమస్యలపై రైతుల ఏకరువు

పలువురు రైతులు వివిధ సమస్యల్ని అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరల్లేక సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదన్నారు. పురుగు మందుల్ని(క్రిమిసంహారక మందులు) ఆర్బీకేల ద్వారా అందజేయాలన్నారు. వ్యవసాయ పరికరాలను రాయితీపై వ్యక్తిగతంగా రైతులకు ఇవ్వాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలతో జరిగిన పంట నష్టానికి అందజేస్తున్న నష్టపరిహారంతో ప్రయోజనం లేదన్నారు. మామిడి గుజ్జు పరిశ్రమలు జిల్లాలో 75 ఉన్నప్పటికీ.. సీజన్‌లో కేవలం 15-20 పరిశ్రమలే నడుస్తున్నాయని, తద్వారా రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని