logo

చోదకుడి నిద్రమత్తు.. ప్రైవేట్‌ బస్సు బోల్తా

ప్రైవేట్‌ బస్సు చోదకుడి నిద్రమత్తు ఓ యువకుడి ప్రాణాల్ని బలి తీసుకుంది.

Published : 03 Dec 2022 01:52 IST

యువకుడి మృతి... పలువురికి గాయాలు

బోల్తా పడిన బస్సును ప్రొక్లెయిన్‌తో తొలిగిస్తున్న దృశ్యం
(అంతర్‌ చిత్రంలో) మృతి చెందిన విజయ్‌

గంగవరం, న్యూస్‌టుడే: ప్రైవేట్‌ బస్సు చోదకుడి నిద్రమత్తు ఓ యువకుడి ప్రాణాల్ని బలి తీసుకుంది. డ్రైవింగ్‌ చేస్తూ కునుకు తీయడంతో వాహనం బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం బెంగుళూరు, చెన్నై జాతీయ రహదారిపై కేటల్‌ఫారం సమీపంలో శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. గంగవరం సీఐ అశోక్‌కుమార్‌ కథనం మేరకు వివరాలు... బెంగుళూరు నుంచి విజయవాడకు వస్తున్న ప్రైవేటు బస్సులో 30 ప్రయాణికులతో డ్రైవర్‌ ప్రకాష్‌ బయల్దేరాడు. ఆయన వాహనం కేటల్‌ఫారం సమీపంలోకి రాగానే కునుకు తీయడంతో బస్సు జాతీయరహదారి పిట్టగోడను ఢీకొని రహదారి పక్కకు పడిపోయింది. ప్రమాదంలో పల్నాడు జిల్లా క్రోసూరుకు చెందిన చిలక సాంబయ్య కుమారుడు విజయ్‌ (26) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విజయ్‌ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడని వారాంతపు సెలవులు కావడంతో స్వగ్రామానికి వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  సంఘటన స్థలాన్ని తహసీల్దార్‌ మురళి పరిశీలించారు. బోల్తా పడిన బస్సును యంత్రం సాయంతో రోడ్డుపైకి తీసుకువచ్చారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని