logo

అంతస్తుకో అక్రమం

అనిశా అధికారులు తనిఖీలు చేసే వరకు తిరుపతి నగరంలో అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయో పట్టణ ప్రణాళిక విభాగానికి తెలియని పరిస్థితి.

Published : 03 Dec 2022 01:52 IST

అనిశా తనిఖీల్లో వెల్లడైనా చర్యలు శూన్యం

కమిషనర్‌ పాత బంగ్లా సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న బహుళ అంతస్తుల భవనం

అనిశా అధికారులు తనిఖీలు చేసే వరకు తిరుపతి నగరంలో అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయో పట్టణ ప్రణాళిక విభాగానికి తెలియని పరిస్థితి. ఇది గడిచి నాలుగు నెలలైంది. అక్రమ కట్టడాల నియంత్రణకు అధికారులు, పాలకులు తీసుకున్న చర్యలేమటని ప్రశ్న వేస్తే.. సేకరించిన వివరాలు బుట్టదాఖలు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం తేటతెల్లమవుతోంది. నియోజకవర్గంలో ఓ కీలక నేత జోక్యంతో అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని సమాచారం.

 న్యూస్‌టుడే, తిరుపతి (నగరపాలిక)

తిరుపతి నగరంలో అక్రమ కట్టడాలకు కొదువే లేదు.  ప్రతి రెండు వేల ఇళ్లకు ఒక్కో ప్రణాళిక విభాగపు కార్యదర్శి పనిచేస్తున్నా.. ఏ ఒక్క కట్టడం కూడా ఆగిన ఆనవాళ్లు లేవు.  నగరంలో ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల వెంబడి ఐదారు అంతస్తుల నిర్మాణాలను కొందరు కార్పొరేటర్లే దగ్గరుండి నిర్మిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నీటి కుళాయి, యూడీఎస్‌ కనెక్షన్‌ కావాలన్నా కార్పొరేటర్లను సంప్రదించి మంజూరు ప్రక్రియ ప్రారంభించేలా సచివాలయ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో భాగం చేసుకున్నారు. అక్రమ భవన నిర్మాణాల విషయంలోనూ అదే జరుగుతున్నట్లు పెద్దఎత్తున విమర్శలున్నాయి. నగరపాలిక కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కొన్ని డివిజన్లలో కొందరు కార్పొరేటర్లు అక్రమ భవనాల ముందు కుర్చీ వేసుకుని మరీ అనుమతులు లేని, అసలు దరఖాస్తు కూడా సమర్పించని భవనాలను సెల్లార్‌, ఐదారు అంతస్తు నిర్మించి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

నాలుగు  నెలల కిందట ఏం జరిగిందంటే..  నగరపాలక సంస్థ కార్యాలయంలో అనిశా అధికారులు ఆగస్టులో దాడులు చేశారు. నగరంలో  అక్రమ కట్టడాల నియంత్రణకు చేపట్టిన చర్యలేంటని  వివరణ కోరారు. అప్రమత్తమైన అధికారులు 2016 నుంచి 2021 వరకు నగరంలో నిర్మించిన అనధికారిక, అనుమతులు లేని, నిబంధనలు ఉల్లంఘించిన 4,200కు పైగా నిర్మాణాలకు తాఖీదులు ఇచ్చారు.

నేత వద్ద పంచాయితీ:  ఈ పంచాయితీ కీలక ప్రజాప్రతినిధి వద్దకు చేరడంతో  తాఖీదులపై అక్రమ నిర్మాణదారులు ఆందోళన వద్దని ఆయన అభయమివ్వడంతో కథ కంచికి చేరింది.

కౌన్సిల్‌ సమావేశాల్లో మౌనం.. నగరపాలక కౌన్సిల్‌ సమావేశంలో కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై ఏకరువు పెడుతుంటారు. ప్రతి సోమవారం నగరపాలిక అధికారులు నిర్వహించే డయల్‌ యువర్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేసి ప్రజా సమస్యల్ని తెలుపుతుంటారు. వీరు అక్రమ నిర్మాణాలు, కట్టడాలపై అధికారులకు ఫిర్యాదు చేయడం కానీ, కౌన్సిల్‌ సమావేశంలో చర్చించిన దాఖలాలు లేవు.

మరోసారి పరిశీలించి చర్యలు

నగరంలో 2016 నుంచి జరిగిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి మొదటి నోటీసులు ఇచ్చాం. ఆయా సచివాలయాల పరిధిలో మరోసారి పరిశీలించి.. ఉల్లంఘనలు ఉంటే రెండోసారీ నోటీసులు ఇస్తాం. పునఃపరిశీలనలో ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తాం.

సునీత, అదనపు కమిషనర్‌, నగరపాలిక
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని